జనవరి 30, 2011

అడగక ఇచ్చిన మనసు- జెమిని టివి సీరియల్

Posted in టీవీ సీరియల్స్ at 5:33 సా. by వసుంధర

రక్తం చివ్వున చిమ్మేలా కాళ్లు, చేతులు, తల నరకడం.
విషం పెట్టో, పీక నొక్కో, కత్తితో పొడిచో, తుపాకితో పేల్చో హత్య.
ఆడామగా, చిన్నాపెద్దా భేదం లేకుండా దారుణ హింస.
మోసం, దగా, మానభంగం, కిడ్నాప్ వగైరా నేరాలు, ఘోరాలు.
కనీసం మెదడుకు పదునుపెట్టే వ్యూహాలు, పథకాలు ఉండవు. సామాన్య మధ్యతరగతి ఇళ్లలో పైవన్నీ నిత్య దినచర్యగా భావింపజేస్తూ- సోమరి ఆలోచనల్లో దెయ్యత్వానికి దోహదం చేయడమే ప్రధానాశయమా అనిపింపజేస్తున్నాయి- సగటు తెలుగు టివి సీరియల్స్ .
వీటిలో పాలు పంచుకున్న నటీనటుల, సాంకేతిక నిపుణుల ప్రతిభ- మురుగు కాల్వలో పన్నీరే!
ఈ నేపధ్యం చాలు- ఇటీవల జెమిని ఛానెల్లో ప్రారంభమైన కొత్త సీరియల్ అడగక ఇచ్చిన మనసుని అద్భుతం చెయ్యడానికి.
ఉత్తమాభిరుచికి పేరుపడ్డ ఊర్మిళ గుణ్ణం ఈ సీరియల్ నిర్మాత.
మధ్యతరగతి గతిని మార్చేసిన సాఫ్ట్‌వేర్ రంగం కథకు రంగస్థలం.
యువత, నవత కథనానికి ఊపిరి.
మారుతున్న కాలంలో కాలానుగుణమైన మార్పులు, చేర్పులు, కూర్పులు ఇతివృత్తం.
ఆదర్శాలను నమ్మిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరేశలింగం. అతడి రూంమేట్స్ నిరుద్యోగులు, పరాన్నభుక్కులు. మంచితనంతో వారిని భరించాడు. మరీ హద్దు మీరితే మంచిగానే ఛీకొట్టాడు. పాత మిస్సమ్మ పద్దతిలో పై ఆఫీసరు అమెరికా ఛాన్స్ దంపతులకే దత్తం చేస్తే_ అందుకు తనని ప్రపోజ్ చేసిన అందమైన అమ్మాయిని కాదంటాడు.
కూతుర్ని చదివించడం, ఉద్యోగం చెయ్యనివ్వడమే స్చేచ్ఛనివ్వడం అనుకునే ఓ పురుషాహంకారి. ఆమె వివాహం తన శిలాశాసనం కావాలనుకుంటాడు.
భార్యనూ, కొడుకునూ శాసిస్తున్నాననుకునే మరో పురుషాహంకారి. ఎక్కడో ఒకసారి చూసిన ఓ అనామిక కోసం- ఆయన కొడుకు ప్రేమాన్వేషణ.
కథలాగే నటీనటుల్లోనూ తాజాదనం. సంభాషణలు తెలివిగా, పదునుగా, ఆహ్లాదకరంగా కొనసాగాయి. ఈ సీరియల్ ప్రస్తుతానికి వీటి బలం మీదనే నడుస్తోంది. ఐతే-
సినిమాల్లో పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కృష్ణ భగవాన్, సునీల్ తదితరులు- పొడి సంభాషణలతో జనాల్ని ఆకర్షించే పద్ధతిని- జయప్రదం చేశారు. టివి సీరియల్స్‌లో అమృతం, రాధ-మధు, అమ్మమ్మ డాట్‌కామ్ వగైరాలు కూడా ఈ పద్దతిని జయప్రదంగా అమలు చేశాయి. కానీ కథాబలం, పాత్రచిత్రణ లేకుండా ఈ పద్ధతి రాణించదనడానికి ఈ సీరియల్ ఓ ఉదాహరణ.  తెలివిగా మాట్లాడడమే ప్రధానం కావడంవల్ల ఈ సీరియల్‌లో- రాంజగన్‌వంటి సీనియర్ నటులతో సహా ప్రతిఒక్కరూ- సంభాషణలు చెబుతున్నారే తప్ప నటించడం లేదు. ప్రస్తుతానికి కథ కూడా బలంగా అనిపించడం లేదు. చంద్రశేఖర్ ఆజాద్ నటన, మాటలు- సుత్తి వీరభద్రరావు ఫక్కీలో నడుస్తూ- ఆ పాత్రకు ఆ తరహా వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తున్నాయి.
టైటిల్ సాంగ్ వరస 1970ల బాలు మధురిమను గుర్తు చేసింది. సంగీత దర్శకుడు శ్రీ గొంతు, సంగీతం- మరిచిపోలేనివిగా ఉన్నాయి. ఆ పాటలోని ఈలను బ్రేక్‌కి ముందు, వెనుక ఉపయోగించడం ఎంతా బాగుందంటే- ప్రేక్షకులు దానికోసమే- బ్రేక్ కోసం ఎదురు చూస్తారు. బ్రేక్ ఎప్పడైపోతుందా అని ఎదురు చూడ్డం కూడా దానికోసమే.
ఈ సీరియల్ ఇంకా మెరుగుపడాలి. కానీ మూస సీరియల్స్‌తో విసిగిపోయినవారికి- చాలా గొప్ప రిలీఫ్ కావడంవల్ల- ఈ సీరియల్‌లో చిరులోపాలెంచడం కూడా మెగా తప్పిదం కాదుకదా అనిపిస్తుంది. యధాతథంగా కూడా తప్పక చూడాల్సిన ఈ సీరియ్ల్ రాత్రి 10కి రావడమొక్కటే అసలు ఇబ్బంది. ఆ సమయానికి నిద్ర ముంచుకొస్తోంది. నిద్ర తేలిపోయేటంత ఆసక్తి కలిగించే సన్నివేశాలు లేని ఈ సీరియల్ 8 గంటల ప్రాంతానికి తరలివస్తే క్రమం తప్పకుండా చూడ్డం మాబోంట్లకు వీలుగా ఉంటుంది.
ప్రస్తుతానికి పాటకీ, మాటకీ, నిర్మాతకీ పరిమితమైన అభినందన- క్రమంగా కథకీ, దర్శకునికీ, నటీనటులకీ విస్తరించగలదని ఆశిద్దాం.

2 వ్యాఖ్యలు »

  1. raman said,

    this serial is OK so far.
    No big hype
    There are other equally good serials like ” DEVatha” sivaranjani for example.

  2. cbrao said,

    కధలో కొత్తతనముంది. మాటలు బాగున్నై. చూడవచ్చు ఈ సీరియల్. మీ పరిచయం బాగుంది.


Leave a Reply

%d bloggers like this: