ఫిబ్రవరి 2, 2011

దహించేదీ ధరించేదీ- దాసరి అగ్నిమాల

Posted in పుస్తకాలు at 7:33 సా. by వసుంధర

సృష్టిలో జీవరాశులు అనంతం. సృష్టి అనంతంగా కొనసాగడానికి ఇంచుమించు అన్ని జీవరాశుల్లోనూ  స్త్రీపురుష విభజన సామాన్యం. మనుషుల్లో స్త్రీపురుషబంధాన్ని అసామాన్యం చేసింది ప్రేమ. సామాన్య జీవితంలో అంతర్లీనమై భాసిల్లే ప్రేమని- వెలికి తీసి మనోహరం చేసి సామాన్యుడికి అందిస్తుంది సాహిత్యం. ఏ భాష సాహితి చూసినా నరజాతి చరిత్ర సమస్తం ప్రేమాయణ పరవశత్వం.

సాహిత్యంలో ప్రేమ పుట్టుకకు- వినికిడి, తొలిచూపు కారణమవడం సర్వసాధారణం. కొండొకచో వ్యామోహం, రాజకీయం ప్రేమకు దారి తీసినా- ఆ కథల్లో వ్యూహానికున్న ప్రాధాన్యం ప్రేమకు లభించకపోవడం సాధారణం. అలా చూస్తే అసామాన్య రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్య కృత అగ్నిమాల అసాధారణం.

కథానాయకుడు అగ్నిపాలుడు మహావీరుడు, రాజభక్తుడు, ధీరోదాత్తుడు. అలాగని పురుషోత్తముడు కాడు. మేటి వీరుణ్ణి మట్టి కరిపించినా అది- ఒక వారవనిత కోసం. కథానాయికని ప్రేమించినా అది- ఒక అవజ్ఞునిపై పందెం గెలవాలని. కథానాయిక వకుళమాల అసమాన సౌందర్యవతి, సుగుణవతి, అభిమానవతి. అలాగని మహిళోత్తమ కాదు. అపహాస్యంతో తనకు నచ్చని బేతాళవర్మను నొప్పించగలదు. ఆవేశంతో ప్రియుడికే ప్రాణాంతక స్థితి కలిగించగలదు. వీరురువురి ప్రేమకథలో మాధుర్యం అల్పం, రాజకీయం అనల్పం. ఇవన్నీ రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం (దాసు) వాస్తవిక దృక్పథానికి నిదర్శనం.

వాస్తవానికిది అగ్నిపాలుడి ప్రేమకథ ఐనా- ఆ ప్రేమ నవభోజుడు, కాలభోజుడు అనే ఇద్దరు ప్రభువుల రాజకీయ వ్యూహంలో అంతర్భాగం కావడం ఈ రచనలో విశేషం. జూదంలాంటి పందెంలో పుట్టిన ప్రేమని కథ పొడుగునా నిరసించే ఔచిత్యం, బురదలో పుట్టిన పద్మం పంకజమై పూజార్హమైనట్లు- ఆ ప్రేమ ఉదాత్తమని అడుగడుగునా స్ఫురింపజేసే చాకచక్యం ఈ రచన ప్రత్యేకత. ఐతే ఈ రచన గొప్పతనం ప్రేమలో కాక పాత్రచిత్రణలో ఉండడం గమనార్హం.

ఈ కథలో ముఖ్యపాత్ర ఆగ్నిపాలుడు. అతడు మహాశక్తిమంతుడైనా రాజుని సేవించాలనే తప్ప రాజు కావాలని అనుకోడు. జగ్గరాజువంటి మహాయోధుణ్ణి ఓడించినందుకు గర్వపడుతూనే- ఒక వారకాంతకోసం అతడితో తలపడ్డానని కించపడతాడు. స్నేహితుల కీచులాటని పట్టించుకోని వాస్తవిక దృక్పథం, అతిథులమధ్య అలాంటిదొప్పని సంస్కారం ప్రదర్శిస్తూనే- కుటిలత్వం రెచ్చగొడితే నీచమైన పందేనికైనా సిద్ధపడతాడు. పందెంకోసమే వకుళమాలని పొందాలనుకున్నా- ఆమె ప్రేమను పొందినాకనే పెళ్లాడాలనుకుంటాడు. ఆమె తనను నిరసించి ద్వేషించినా- ఆత్మాభిమానంగా గుర్తించి గౌరవిస్తాడు. అవజ్ఞుడివంటి దుష్టుణ్ణి అన్నివేళలా అంచనా వెయ్యలేకపోయినా, ప్రాణప్రమాద సమయంలో కూడా తన ధైర్యాన్ని మొక్కవోనివ్వడు. అతడి పాత్ర నవలకే తలమానికం. కథానాయిక వకుళమాల పాత్రని- హీరో ప్రధానంగా వచ్చే నేటి చలనచిత్రాల్లో హీరోయిన్‌ పాత్రలకు- ఒరవడిగా అనుకోవచ్చు. అవధుల మేరకే ప్రదర్శితమైన ఈ పాత్ర ప్రవర్తనలో సజీవం. ఆమె ఉనికి పాఠకుల్ని ఉత్తేజపరుస్తుంది.

ఈ కథలో ప్రతినాయకుడు అవజ్ఞవర్మ. అతడు కుటిలుడు, దుష్టుడు, అత్యాశాపరుడు. తన బలహీనతలు, పరిమితులు తెలిసినవాడు. కార్యసాధనకై ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టగలిగినవాడు. వ్యక్తిత్వం బలమైనది కాకపోయినా ఆశయబలంతో బలవంతులతో పోటీపడినవాడు. అవకాశవాదంతో అర్హతకు మించిన అవకాశాలు పొందగలిగినవాడు. ఈ రచనలో అతడి పాత్ర అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది కానీ- కర్ణుడి తల భారతమన్నట్లు- అతడే ఇంత కథకూ కారణమయ్యాడు. నేటి రాజకీయవాదుల్ని గమనిస్తున్నవారికి అతడి పాత్ర సజీవమని స్ఫురించడం సహజం. మరో దుష్టపాత్ర బేతాళవర్మ సామర్ధ్యంలో తక్కువైనా ఆశయాల్లో అవజ్ఞవర్మను సరిపోలుతాడు. దుష్టుల ప్రగతి స్వీయప్రతిభలో కాక మంచివారిని నమ్మించి మోసగించడంలో ఉన్నదని ఈ పాత్రల ద్వారా సూచిస్తూ, వారి అదృష్టం చివరికి తాత్కాలికమేనని హెచ్చరించారు రచయిత.

మిగతా పాత్రలు లీలామాత్రమైనా- వాటిపట్ల రచయితకున్న సంపూర్ణ అవగాహన చిత్రణలో ద్యోతకమౌతుంది. హైహయ వంశస్థుణ్ణని మిడిసిపడే ప్రసేనుడు సామంతుడైనా ‘రాజా ప్రసేన్‌’గా సంబోధించబడతాడు. అసహాయంగా అనుసరిస్తూనే అవధులమేరకు భర్త  మూర్ఖత్వాన్ని నిరసిస్తుంది చంద్రావతి. ప్రసేనుడితోసహా నవభోజుడిపట్ల రాజద్రోహానికి తలపడినవారందరి సందిగ్ధ మనోభావాలు- నేటి రాజకీయ వాదుల్ని స్ఫురింపజేస్తాయి. విధి నిర్వహణకు విచక్షణను జోడించాడు ధర్మనందుడు. మీ తండ్రిగారి సేవలోనే మరణించి ఉంటే ఎంత బాగుండేది’ అని వాపోయేటంతలా సేవాధర్మం జీర్ణించుకున్న మాహూలో ఆత్మీయతానుబంధమే తప్ప- సేవకుడినన్న భావం లేదు. వీరందరూ ఈ రచనలో పాత్రచిత్రణకు పరాకాష్ఠ అనవచ్చు.

ఈ కథలో పాత్రల పేర్లు గమనించతగ్గవి. ప్రతిద్వంద్వులైన రాజులిద్దరూ భోజులే. ‘నవ’భోజుడు ఆధునిక దృక్పథానికీ, ‘కాల’భోజుడు కౌటిల్యానికీ సూచికలు. దుష్టులైన వారిద్దరూ వర్మలే. అవజ్ఞుడు తిరస్కరించబడినవాడు. బేతాళుడు కథని పొడిగించినవాడు. రాజ ద్రోహానికి తలపడినా స్నేహానికి ప్రాణమిచ్చేవాడు విష్ణు’మిత్రుడు’. అనుమానితుణ్ణి బందీ చేసినా- నిర్దోషిత్వ నిరూపణకు అవకాశమిచ్చినవాడు ‘ధర్మ’నందుడు. విశ్వాసపాత్రుడైన సేనాని హనుమప్ప. విధి నిర్వహణకు సూచికగా కథానాయకుడు అగ్నిపాలుడు. ప్రేమాస్వాదనకు తగిన కథానాయిక వకుళమాల. రాజకీయపరంగా అత్యావశ్యకమైన వారి కలయిక అగ్నిమాలగా ఈ రచనకు మకుటం.

మన పురాణకథల విశిష్టత ఏమంటే- అవి చందమామలో పిల్లల్నీ, సాంఘికంగా పెద్దల్నీ సమంగా అలరించగలవు. భక్తులకు కల్పవృక్షాన్నీ, వ్యతిరేకులకు విషవృక్షాన్నీ అందివ్వగలవు. మేధావులకు వేదాంతాన్ని సూచించగలవు. చర్చల్ని సముద్రమంత లోతుకు తీసుకెళ్లగలవు. ఆ విధంగా అగ్నిమాలకూ పురాణవైశిష్ట్యముంది. అగ్నిమాల కథగా బాలసాహిత్యమై సంక్షిప్తమై చందమామలో ఆరు పేజీల్లో ఇమడగలదు. కథనంలో సాంఘికమై సమగ్రమై వందల పేజీలు దాటగలదు. రెండిటా ఆరితేరిన సవ్యసాచి దాసు ఈ కథను సులభగ్రాహ్యంగా, ఆలోచనాత్మకంగా రూపొందించడంలో కృతకృత్యులయ్యారు. చందమామ సీరియల్స్‌ శైలి కథనానికి సొగసులిస్తే- సాంఘికంగా సీరియల్‌ కాకపోవడం కథనానికి పగ్గాలేసింది. వారపత్రికలో ధారావాహికంగా కనీసం 52 సంచికల్లో కొనసాగాల్సిన కథనం- మాసపత్రికలో 12 సంచికలకు పరిమితం కావడంలో- ఆరంభం కాస్త పొడిపొడిగా- ముగింపు మరీ వడివడిగా రూపొందింది. విపులంగా దాసు కథనంలో రాణించాల్సిన- విష్ణుమిత్రుడి ఉదంతం, మాహూ అనుభవాలు, బేతాళవర్మ కుతంత్రాలు వగైరాలెన్నో- పాఠకుల ఊహకు వదిలివెయ్యబడ్డాయి. కావ్యంలా కొనసాగాల్సిన వకుళమాల ప్రేమ సందిగ్ధం- కథ ముగింపుకి తొందరపడి చిన్ని పేరాతో పరిష్కారమైపోయింది. ఆ మేరకి ఈ రచన పాఠకులకి కొంత అసంతృప్తిని కలిగించినా- కథనం ఉత్కంఠభరితమై ఏకబిగిన చదివిస్తుంది.

సాగరమంత లోతైన ఈ ఇతివృత్తంలో ఆణిముత్యాలకు కొదవా? వ్యాఖ్యల్లో మచ్చుకి కొన్ని: ఏ కార్యమైనా ‘వారివారి మనఃప్రవృత్తినిబట్టి గౌరవప్రదమో, అగౌరవకారణమో అవుతుంది’; ‘జూదం శాస్త్ర సమ్మతం. కుక్కవెంబడే తోకలాగా జూదంతోపాటే పందెం ఉంటుంది’; ‘లౌక్యం మరిచి కేవలం పౌరుషం ప్రధానంగా మాట్లాడే భర్తతో విసిగిపోయింది’; ‘ఉరి తియ్యబడుతున్న రాజద్రోహులెలా ఉంటారో చూడాలని ఉన్నదిట. ఒకరి బాధ మరొకరికి ఆనందం’. చతురోక్తుల్లో మచ్చుకి కొన్ని: ‘ఈ కొండ ఈ ఇరవై ఏళ్లలోనూ పుట్టి పెరిగి ఉంటుంది’, ‘ఆ శవం దొరికితే బావుండును- విష్ణుమిత్రుడైతే తప్పక గుర్తిస్తాడు’. ఇక పాత్రానుగుణమైన మనోవిశ్లేషణ కథనానికి అదనపు సొబగులు చేకూర్చింది. మచ్చుకి అగ్నిపాలుడి విషయమై- ప్రసేనుడు, చంద్రాదేవి, వకుళమాలల ఆలోచనలు అత్యంత సహజమూ, ఆద్భుతమూ.

అగ్ని దహిస్తే పునీతం. మాల ధరిస్తే పరిమళభరితం. అధికారాన్నీ అలంకారాన్నీ అగ్నిమాలగా సమన్వయిస్తే- నరజాతి చరిత్ర సమస్తం నిస్సందేహంగా ప్రేమాయణ పరవశత్వం.

ఒక్క మాటలో చెప్పాలంటే- హస్తభూషణం అనుకునేవారు చదవతగ్గదీ, మస్తకమథనం అనుకునేవారు అధ్యయనం చెయ్యతగ్గదీ- ఐన పుస్తకం అగ్నిమాల.

అగ్నిమాల మిమ్మల్ని వరించాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి

1 వ్యాఖ్య »

  1. వేణు said,

    ‘అగ్నిమాల’ నవల గురించి మీరు రాసింది చాలా బాగుందండీ. మీ విశ్లేషణలో మెరుపులెన్నో! మచ్చుకు… ‘కావ్యంలా కొనసాగాల్సిన వకుళమాల ప్రేమ సందిగ్ధం- కథ ముగింపుకి తొందరపడి చిన్ని పేరాతో పరిష్కారమైపోయింది’. మీ టైటిల్ కూడా అద్భుతంగా కుదిరింది!


Leave a Reply

%d bloggers like this: