ఫిబ్రవరి 15, 2011

బుల్లితెరపై కొత్త ధారావాహికలు

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 4:16 సా. by వసుంధర

మనసు-మమత (ఈటివి): నటీనటులు అవధుల మేరకు న్యాయం చేకూర్చుతున్న ఈ కొత్త ధారావాహికలో కథ, మాటలు, సన్నివేశాలు పాత సీసాలో పాత సారా. కథనం ఆసక్తి పుట్టించదు. శీర్షిక గీతం బాగుంది. ఈటివిలో ధారావాహికలకు ఇతివృత్తాల కొరత ఏర్పడిందని కొత్త ధారావాహిక మొదలైనప్పుడల్లా అనిపిస్తుంది. అది చూసేవారి స్థాయికి కొలత ఐతే- కలవరపడాల్సిన అంశం.

మా పసలపూడి కథలు (మాటివి):  సుప్రసిద్ధ కార్టూనిస్టు, రచయిత శంకు బహుముఖప్రజ్ఞ తెలుగువారికి సుపరిచితం. గతంలో ఆయన దూరదర్శన్‌ ద్వారా మునిమాణిక్యం హాస్యాన్ని ప్రేక్షకులకి అందించారు. ఆశించిన స్థాయిలో లేకపోయినా ఆ అభిరుచి అభినందనీయం. ప్రస్తుతం మాటివిలో మొదలైన ‘మా పసలపూడి కథలు ప్రేక్షకులకి అందించాలన్న తలపు రావడం శంకు అభిరుచికి సహజం. అచ్చ తెనుగు ఊళ్లు, మనుషులు, పేర్లు, పలుకుబడి, కబుర్లు- అవీ వంశీ ‘మా పసలపూడి కథలు’. స్వాతి వారపత్రిక అభిరుచికి జోహారులనతగ్గ ఈ కథలు పాఠకులకే దృశ్యకావ్యమయ్యాయి. వాటిని బుల్లితెరపై దృశ్యకావ్యంగా అందించాలనుకోవడం ‘శంకు’తీర్థం.  వంశీ స్వరపర్చిన శీర్షిక గీతం వీనులవిందుగా ఉంటే, శంకు చిత్రీకరణ బహుపసందుగా అనిపించింది. గ్రామీణవాతావరణం చక్కగా కనిపించింది ఇంతవరకూ నడిచిన కథల్లో కథనం, పాత్రలు, అవి మాట్లాడే భాష కృతకంగా తోస్తున్నాయి. ప్రస్తుతానికి అభిరుచికి మాత్రమే అభినందనం.

గతజన్మ రహస్యం (మాటివి): సాయికుమార్‌ సారధ్యంలో గతవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అంశం కొత్తది. మానసిక నిపుణుల ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని కాలయంత్రంలోలా వెనక్కి తీసుకెడుతూ గతజన్మకి చేర్చి వివరాలు చెప్పించడం ఆసక్తికరం. ఆ వ్యక్తి మాటల్ని దృశ్యాలుగా మార్చి ప్రేక్షకుల కళ్ల ముందుంచిన తీరు ప్రతిభావంతం. మొదటి ఘటన ఫిబ్రవరి 12న ఒక ఆధునిక మహిళతో చూపించారు. ఆ కథనం  ప్రకారం ఆమె గత జన్మలో ఒక లంబాడీ యువతి. తాగుబోతు భర్త చేతిలో నానా హింసలూ పడింది. కొడుకును కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఆ కొడుకే ఈ జన్మలో భర్త అయ్యాడట. చూడ్డానికి ఆసక్తికరంగా అనిపించినా ఈ తంతువల్ల ప్రయోజనం కనబడదు. గతజన్మ ఉన్నదన్న నమ్మకమూ కలుగదు. నటుడు రాజా గతజన్మ రహస్యం తెలుసుకోగోరినవారు ఫిబ్రవరి 16 రాత్రి 9-10 మాటివి చూడొచ్చు.

1 వ్యాఖ్య »

  1. సత్య said,

    ఇప్పుడంతా సీరియళ్ళదే హవా..
    వాటి టైటిల్ సాంగ్స్ చాలా బాగుంటున్నాయ్ .. మా వీధిలో పిల్లలు ఆడుకుంటూ హమ్ చేస్తుంటే తెలుస్తుంది వాటి ప్రభావం!…మంచి గీత రచయితల్తో రాయిస్తున్నారు..

    కథా నాయికలతో, నటీ నటులతో ముందే ఒప్పందం చేసుకుంటారేమో …బాగా కన్నీరు పెట్టుకోవాలని,ఏడ్వాలని, ఎప్పుడు నవ్వకూడదని, చెంపదెబ్బలు బాగా తినాలని, ప్రతీ సీన్ మూడు మూడు సార్లు చేయడానికి రెడీగా వుండాలని .. సెటైర్లు బాగా పండాలని….ఇలా..


Leave a Reply

%d bloggers like this: