ఫిబ్రవరి 16, 2011

శశిరేఖా పరిణయం- చిత్ర సమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 5:18 సా. by వసుంధర

2009లో జనవరి 1న విడుదలైంది శశిరేఖా పరిణయం. కథానాయిక శశిరేఖ పెళ్లి ప్రయత్నాలతో మొదలై పెళ్లితో అంతమైనందున ఆ పేరు పెట్టారు. 1957లో మాయాబజార్‌ పేరిట విడుదలైన నిత్యనూతన చిత్రరాజం కూడా శశిరేఖా పరిణయమే. అందుకనేమో- ఆరంభంలో చిత్రబృందం పేర్లు చూపేటప్పుడు- మాయాబజార్‌ చిత్రంలోని అహ నా పెళ్లంట పాటను చూడ ముచ్చటగా ప్రేక్షకుల ముందుంచారు. కథలోకి వెడితే…
ముందు చెప్పకుండా వరుడి వివరాలైనా తెలియనీకుండా సరాసరి పెళ్లి మంటపానికి శశిరేఖని రప్పించాడు తండ్రి. అది పురుషాహంకారం. అందుకు కూతురు అభ్యంతరపెడితే చంపడానికి కూడా సిద్ధపడ్డాడాయన. అది మూర్ళత్వం. అయిస్టంగానే పెళ్లికి సిద్ధపడింది శశిరేఖ. అది అసహాయత. తనవారితో పెళ్లికి తరలివచ్చిన వియ్యంకుడు కట్నం డబ్బు విషయంలో అమర్యాదకరంగా, అసభ్యంగా, అసహ్యంగా- ఇంకా చెప్పాలంటే దుర్మార్గంగా, కౄరంగా ప్రవర్తించాడు. అది సంప్రదాయం. శశిరేఖ తండ్రి నొచ్చుకోకుండా ఆయన కాళ్లు పట్టుకుందుకు సిద్ధపడ్డాడు. అదీ సంప్రదాయమే. ఇదంతా తెలిసిన శశిరేఖ ఆ పెళ్లి తప్పించుకునేందుకు ఇంట్లోంచి పారిపోయింది. అది సాహసం కాదు, భయం. అది తెలిసిన వియ్యంకుడు శశిరేఖ తండ్రిని అవహేళన చేశాడు. అది స్పందన. శశిరేఖ తండ్రి తిరగబడ్డాడు. అది పౌరుషమట. ఇంతవరకూ అది పెళ్లి విషయంలో మన సమాజం తీరుపట్ల వాస్తవికమూ, ప్రతిభావంతమూ ఐన వ్యాఖ్య.

పారిపోయిన శశిరేఖ తెగిన గాలిపటం కావలసిందే. ఆమెకు ఆనంద్‌ తగిలాడు. అతడే తనకు కాబోయే వరుడని ఆమెకు తెలియదు. అతడికి త్వరలోనే తెలిసినా ఆమెకు చెప్పడు. ఆనంద్‌ ఉత్తముడు, ఉదాత్త పురుషుడు. తండ్రి పద్ధతులు నచ్చనివాడు. ఆనంద్‌, శశిరేఖల పలాయన యాత్రగా నడిచిన మిగతా కథ- రొటీన్‌ డెయిలీ సీరియల్‌ స్థాయిలో- ఊహకందే సంఘటనలతో అనాసక్తికరంగా ముందుకెడుతుంది. చివరికి పెద్దలకు బుద్ధొస్తుంది. శశిరేఖకి ఆనంద్‌తో పరిణయమౌతుంది.

ఇది 2007 ఆక్టోబర్‌ 26న విడుదలై ఘన విజయం సాధించిన జబ్‌ వుయ్‌ మెట్‌ హిందీ చిత్రానికి అనుకరణో, అనుసరణో అన్న ప్రచారం ఉంది. ఆ కథలో కథానాయిక పెద్దలు నిశ్చయించిన వరుడి సాయంతో తన ప్రియుణ్ణి చేరాలనుకుంటుంది. ‘తన కర్మకు తనే బాధ్యురాలనీ, దేనికీ ఇతరులని తప్పు పట్టకూడదనీ’ అన్న ఆమె నమ్మిక- యువతరానికి గొప్ప సందేశం. అలాంటి సందేశమేమీ శశిరేఖా పరిణయంలో వినిపించదు. కథలో కూడా పోలిక చాలా తక్కువ.

నటీనటుల్లో శశిరేఖ తండ్రిగా ఆహుతిప్రసాద్‌ నటన గొప్పగా ఉంది. సుబ్బరాజు, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ అవధుల మేరకు ఒప్పిస్తే మిగతా నటులందరూ పాత్రోచితంగా నటించారు. తరుణ్‌ తనదంటూ ప్రత్యేకత లేకుండా జుఖీఈతిజి ళీజూజీదితి చీబితీజీటుడిగా ఎదిగిపోతున్న ఇక  ఆమె నము&తానేం చేసినా ప్రత్యేకత లేకుండా పాత్రలో ఇమిడాడు. జెనీలియా ఈ చిత్రంలోనూ చాలా అందంగా కనిపించింది. నటన విషయానికొస్తే ఆమె బొమ్మరిల్లు హాసిని వ్యక్తిత్వంనుంచి బయటపడలేకపోతోందనిపిస్తుంది. ఆంక్షలున్న సంపన్న కుటుంబంలో కాలేజి చదువులకు నోచుకున్న అమాయక పల్లెటూరి అమ్మాయిగా అని ఎక్కడా అనిపించదు. దుస్తుల విషయంలో దర్శకుడు, నటన విషయంలో ఆమె ఈ విషయం విస్మరించారనిపిస్తుంది. ఈ చిత్రంలో జెనీలియా పాత్రలో జీవించడానికి బదులు- పాత్రలో జెనీలియా జీవించింది. ఐతే- తాగుడు మైకంలో ఆమె తండ్రిని, మగాళ్లనీ నిరసించినప్పటి మాటలు, నటన ఆమె సామర్ధ్యానికి ఋజువుగా నిలుస్తాయి. ఈ చిత్రంలో తలమానికమన్న నటనా వైదుష్యం ప్రదర్శించారు పరుచూరి గోపాలకృష్ణ. శశిరేఖ మామగా ఆయన అడపాతడపా నవ్వే నవ్వు చూస్తే- ఆస్కార్‌ అవార్డ్‌ ఇవ్వడానికి ఆ నిర్వాహకులు తెలుగు నేర్చుకునే అవకాశముంది. ఆ మహానటుడికి అభివందనాలు.

పాటల వ్రాత, చేత బాగుంది. దృశ్యాల తీత బాగుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో కథనపరంగా చెప్పుకోతగ్గదేం లేదు. పల్లెటూరి మోతుబరులు, పొగరుబోతులు- మాట్లాడే భాషని యధాతథంగా వినిపించాలన్న తాపత్రయం గర్హనీయం. చిత్రీకరణకు విదేశాలకంటే తెలుగు గ్రామీణ వాతావరణమే గొప్పదని ఋజువు చేసిన ఆయన సాహసం గర్వకారణం.

ఈ చిత్రం విజయవంతమైంది. ఇంకా అర్థవంతమైన చిత్రాలను విజయవంతం చేసే దిశగా ఈ చిత్రనిర్మాణ బృందం ప్రయత్నాలు కొనసాగాలని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: