ఫిబ్రవరి 23, 2011

సరదాగా కాసేపు

Posted in బుల్లితెర-వెండితెర at 2:06 సా. by వసుంధర

 


2010 సెప్టెంబర్‌ 17న విడుదలైన ఈ సినిమా 2011 ఫిబ్రవరి 22న మాటివిలో ప్రసారమైంది. అంత తొందరగా టివిల కెక్కేవి – హిట్‌లా ఫట్‌లా అన్నది  తార్కికంగా నిర్ణయించడం కష్టం. అసలు సినిమాలెందుకు హిట్టూ ఫట్టూ ఔతాయో కూడా తర్కానికందవు. సెన్సెక్స్‌ సూచిక లాగే ఫలితాన్ని బట్టి కారణాలు నిర్ణయిస్తాం. మనం మాత్రం ఈ చిత్రాన్ని తార్కికంగా పరిశీలించి చూద్దాం. సినిమాకి తర్కమేమిటీ అనుకోవద్దు. రాశిలోనే తప్ప వాసిలో రాణించకపోవడం తెలుగు సినిమాల ప్రత్యేకత. వాసికెక్కిన విశ్వనాథ్‌కి శిష్యుడై, వాసికెక్కిన సితారకి దర్శకుడై, ఉత్తమాభిరుచికీ వాసికెక్కిన వంశీ దర్శకత్వంలో తెలుగువాసికి వాసి గల చిత్రాలు వచ్చే అవకాశం పరిశీలించడానికే ఈ తర్కం.

సినీ ప్రముఖులు కొందరితో మాకు చెప్పుకోతగ్గ పరిచయాలున్నాయి. ప్రతిఒక్కరూ సినీరంగంలో కథకుల కొరత ఉన్నదంటారు. మరి కథకుడిగా కూడా వాసికెక్కిన వంశీ దర్శకుడైతే సినీరంగంలో చక్కని కథలకు లోటుండకూడదు. ఐతే కథంటే సినిమాకోసం అల్లినది కాదు. పత్రికలకోసం కథగా, నవలగా మలిచినదే కథ. అప్పుడు దాన్ని సినిమాకై అనుకరించాలి తప్ప నేరుగా సినిమాకోసమే అల్లితే అది కథ అనిపించుకోదు.

మదిలో తళుక్కున మెరిసిన భావాలకి సన్నివేశాల రూపకల్పన చేసి సినిమాగా తీయడం మంచపద్ధతి కాదనలేం. అలా ఎన్నో మంచి చిత్రాలు తెలుగులో వచ్చాయి కూడా. కానీ మనకి అదే పద్ధతైపోయింది. కళాతపస్వి కూడా ఆ పద్ధతినే అనసరించడం వల్ల క్రమంగా ఆయన చిత్రాలు కథాపరంగా పేలవమయ్యాయి. స్వతహాగా కథకుడైన వంశీ కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ కొనసాగిస్తున్నాడనడానికి ఈ చిత్రం ఉదాహరణ.

ఈ చిత్రానికి కథారచయిత శంకరమంచి. ఫలానా రచన ఆధారంగా అని వ్రాయలేదు కాబట్టి ఈ కథని సినిమాకోసం అల్ల్లినట్లు అనుకోవాలి. పాత్రలకంటే నటుల పేర్లే గుర్తుంటాయి కాబట్టి నటుల పేర్లతో కథని స్మరిద్దాం.

కొండవలస సాయంతో బాగుపడి హోదాలో ఆయన్ని మించిపోయిన జీవా కొడుకు శ్రీనివాస్‌. అమెరికాలో చదువుకుని వచ్చిన శ్రీనివాస్‌కి తన కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటాడు కొండవలస. జీవా తన హోదాకి తగ్గట్లు కొడుక్కి  కోఠీశ్వరుడు ఆహుతిప్రసాద్‌ కూతురు మధురిమనిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటాడు. అవగాహనకి ఆమెతో నెల్లాళ్లు డేటింగ్‌ చెయ్యాలంటాడు శ్రీనివాస్‌. పెళ్లి చూపులకి డ్రైవర్‌ నరేష్‌నిచ్చి కొడుకుని కార్లో హైదరాబాద్‌ పంపుతాడు జీవా. తానెవరో వారికి తెలియకూడదని తను డ్రైవరుగా, నరేష్‌ యజమానిగా నటిస్తామంటాడు శ్రీనివాస్‌. ఆ రహస్యాన్ని జీవా ముందే వియ్యంకుడికి తెలియబరుస్తాడు. ఐతే ఇండియాలో డ్రైవరుకి గౌరవం తక్కువని గ్రహించిన శ్రీనివాస్‌ తన అహం దెబ్బ తింటుందని వేషాలు మార్చుకునే ఉద్దేశ్యం మానుకుంటాడు. అది తెలియని ఆహుతి ప్రసాద్‌- డ్రైవర్లకు మర్యాదనివ్వడం తమ కుటుంబ సంప్రదాయమంటూ- నరేష్‌ని అందలమెక్కించి శ్రీనివాస్‌ని హీనంగా చూస్తుంటాడు. అక్కణ్ణించి మొదలు- గిలిగింతలు పెట్టే హాస్య సన్నివేశాలు. దీనికి సమాంతరంగా  ఆహుతి ప్రసాద్‌ అన్న ఎమ్మెస్‌ నారాయణ కథ. అన్నదమ్ముల్ని విడదీసి తన పబ్బం గడుపుకుంటున్న కృష్ణభగవాన్‌. అతణ్ణి డబ్బుకోసం వేధించే భార్య జయలలిత. వీళ్లందరితో హాస్యభరితమై భయపెట్టే ఓ హత్యాపథకం. ఈ రెంటినీ సమన్వయపరుస్తూ కథ పరుగెత్తి అలసిపోయి ఆగిపోతే దర్శకులు జాలిపడి హడావుడిగా- మంచివాళ్లకి మంచి చేసి, చెడ్డవాళ్లని మంచివాళ్లుగా మార్చి- శుభం కార్డు చూపిస్తాడు.

కథ మంచిదే. సన్నివేశాలకి మాత్రమే ప్రాధాన్యం లభించడంవల్ల ఆహుతి ప్రసాద్‌, కృష్ణభగవాన్‌ల పాత్రలకి మాత్రమే పరిపూర్ణత ఏర్పడింది. మిగతా పాత్రలకి చిత్రీకరణ లేదు. శ్రీనివాస్‌లో అమెరికా అహమే తప్ప తెలివి కానరాదు. నిజానికి ఆమెరికా వెళ్లినవారిలో తెలివి పెరిగి అహం తగ్గాలి. నరేష్‌ తెలివిని- అంతస్తుకి మించిన ఆశ, మోసానికి వెనుకాడని స్వార్థం వగైరాలకి ఉపయోగిస్తాడు. పోనీ అని పాత సినిమాల్లో రాజేంద్రప్రసాద్‌లా తన తప్పు తెలుసుకోడు. జీవానీ, శ్రీనివాస్‌నీ తప్పుపట్టి హీరో ననిపించుకుంటాడు.

నటనలో ఆహుతి ప్రసాద్‌కి పూర్తి మార్కులు. ఎప్పటిలాగే నరేష్‌ డైలాగ్‌ టైమింగ్‌ చాలా బాగుంది. ఐతే రాజేంద్రప్రసాద్‌ తరహా మాడ్యులేషన్‌ లేక- డైలాగ్‌ అప్పచెప్పాడనే తప్ప నటించాడనిపించదు. కృష్ణభగవాన్‌ ముఖంలో ఎక్కువగా ఒకే ఫీలింగ్‌. కేవలం డైలాగ్స్‌ టైమింగ్‌నే నమ్ముకుంటే ఎంతకాలం మనగలడో తెలియదు. అతగాడిక  ధైర్యం చేసి భావప్రకటనకి పాధాన్యమివ్వకపోతే- సామర్ధ్యాన్ని కాక అదృష్టాన్నే నమ్ముకోవాలి. మధురిమ అందంగా ఉంది. అవకాశం అల్పమైనా నటన కూడా ఫరవాలేదు. మిగతా నటీనటులు అవధుల మేరకు పాత్రల్ని పోషించారు.

సంభాషణలు బాగున్నాయి. కొన్ని చోట్ల చాలా బాగున్నాయి. పడాల శిచుబ్రహ్మణ్యంకి అభినందనలు.

పాటలు చక్రివైనా వంశీ ముద్ర కనిపిస్తుంది. గోదావరి దృశ్యాల ఎన్నిక వన్నె తెచ్చినా- చిత్రీకరణ ఓ మాదిరి.

వంశీ కథనం సితారలా సాఫీగా కాక, లేడీస్‌ టైలర్‌లా హడావుడిగా నడిచింది. పాటల చిత్రీకరణ పాత పద్ధతిలో కొనసాగింది. ఊహాతీతంగా కాక అంతా అనుకున్నట్లే కొనసాగడం చిత్రంపట్ల ఆసక్తి కలిగించదు. సరదాగా కాసేపు అన్న టైటిల్‌కి అనుగుణంగా సరదాగా కాసేపే చూడగలిగిన చిత్రంగా రూపొందింది.

1983లో క్రికెట్లో ఇండియా వరల్డ్‌కప్‌ నెగ్గింది. 1984లో వంశీనుంచి సితార వచ్చింది. మళ్లీ ఇండియా వరల్డ్‌కప్‌ నెగ్గాలని ఆశిస్తున్నట్లే వంశీనుంచి ఆయన సామర్ధ్యానికి న్యాయంచేసే సినిమాకోసం ఎదురుచూద్దాం.

Leave a Reply

%d bloggers like this: