ఫిబ్రవరి 23, 2011
స్వాతి వారపత్రిక ఫిబ్రవరి 25 2011
‘ప్రస్తుతం చందమామ, స్వాతి వారపత్రిక- ఇవీ ఇంటింటి పత్రికలు’. ఇది మామాట కాదు. మా ఇంటికొచ్చిన ఓ ఆత్మీయ అతిథి అన్నమాట. సాహితీప్రియులైన ఆయన వయసు 75కి పైన. స్వాతి వారపత్రిక అట్టమీద సపరివార పత్రిక అని ఉంటుంది. అట్ట లోపలి విశేషాల్లో సెక్స్ & సైకాలజీ శీర్షికని దృష్టిలో ఉంచుకుని చాలామంది ఆ పత్రికని కుటుంబ పత్రికగా ఆమోదించరు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రపంచ వార్తల పేజినీ, టెన్నిస్ ఆడే మహిళల ఫొటోల్నీ చూసి ఆ దినపత్రికను నిరసించడంలాంటిదే ఇదీనూ. పరిణతి చెందినవారికి స్వాతి సపరివారపత్రిక అన్నది ఉన్న మాట! ఇందులోని ప్రయోజనాత్మక శీర్షికలు అన్ని రకాల అభిరుచులకూ సరిపడతాయి. గతంలో ఆ పత్రికను పరిచయం చేసి ఉన్నాం. వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ప్రస్తుతం ఫిబ్రవరి 25 సంచిక మార్కెట్లో ఉంది. అందులో తప్పక చదవాల్సింది- 8వ పేజిలోని- దుగ్గరాజు శ్రీనివాసరావు వ్యాసం- మా ఇంటి మహాసరస్వతి. తెలుగు భాషను స్వార్థానికి, ప్రాంతానిక, రాజకీయానికిి అతీతంగా ప్రేమించాల్సిన అగత్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఇచ్చిన హెచ్చరిక, పొందిన ఆవేదన, అందించిన సందేశం ప్రతి ఒక్కర్నీ చేరాలి.
మాలతీ చందూర్ నన్ను అడగండి (పేజి 20)- సమాచారాన్ని అందించడమేకాక అంశాలని కూడా ఎన్నిక చేసి గూగుల్ కంటే ఒక అడుగు ముందున్న శీర్షిక. తప్పక చదవాల్సిన ఇతర శీర్షికలు: ఉషశ్రీ ధర్మ సందేహాలు (పేజి 42), కదిలే బొమ్మల కబుర్లు (పేజి 68-69), ఈ శీర్షిక మీదే (పేజి 72). ప్రతీదీ సూపర్‌హిట్ అనిపించేలా చేసే టివి మాయనుంచి బయటపడి సినిమాలెలా ఆడుతున్నాయో తెలుసుకుందుకు (పేజి 69) స్వాతి ఒక సాధనం.
ఈ సంచికలో మూడు కథలున్నాయి. సృజన్ సేన్ రచన జేకేజీ– సరసమైన కథ. పెళ్లయ్యాక ఆమెను ఇంటికి వదిలి- తాము స్నేహితులతో బార్లలో గడపాలనుకునే ఆధునికులకి చురకలు వేస్తుందీ కథ. పరిణతి చెందిన కథకులకి కూడా అవసరమనిపించే సందేశముందీ కథలో. మంత్రవాది మహేశ్వర్ రచన తిరుమల అపార్ట్మెంట్స్– వాచ్‌మెన్‌ని దోపిడి చేసే అపార్ట్మెంట్స్ సంస్కృతిని ఆలోచింపజేస్తుంది. అంశం గొప్పదైనా కథనం మూసలో నడిచింది. ముగింపు పేలవం. ఇదే అంశాన్ని గొలుసు జగదీశ్వరరెడ్డి ‘వాచ్మెన్’ కథలో హృదయాలకు హత్తుకునేలా ప్రదర్శించారు. విశ్లేషణకి మార్చి రచన మాసపత్రి చూడండి. లత కందికొండ రచన గీతోపదేశం కామెడీ కథ. భార్యాభర్తల అనుబంధాన్ని సందేశాత్మకంగా కామెడీకరించిన తీరు ఔత్సాహికులకు ఆదర్శప్రాయం.
మిగతా విశేషాలు మీమీ అభిరుచులకు అనుగుణంగా ఎన్నుకోండి.
Leave a Reply