ఫిబ్రవరి 25, 2011

ముళ్లపూడి వెంకటరమణ హాస్యాంతం

Posted in మన కథకులు at 11:04 ఉద. by వసుంధర

హాస్యమంటే ఇది అని కొందరు. హాస్యమంటే ఇదా అని కొందరు. హాస్యమంటే ఇదే అని కొందరు. అందరూ మెచ్చేలా సరికొత్త పంథాలో తనకెవ్వరూ సరిలేరనిపించే విధంగా తెలుగునాట హాస్యాన్ని మలిచిన అపురూప హాస్యశిల్పి ముళ్లపూడి వెంకటరమణ. ఆయన ఇక లేరు.
హాస్యం అలరించే విధాలు పలు రకాలు. పిల్ల గాలిలా హాయిగా తాకొచ్చు. మృదువుగా గిలిగింతలు పెట్టొచ్చు. స్థిమితపడనీకుండా వళ్లంతా కుదిపేయొచ్చు. హాస్యాన్ని నటనలో చేతలతో ఒప్పించినట్లు కాగితంపై మాటలతో ఒప్పించే ప్రతిభ అరుదైనది. తెలుగునాట హాస్యంతో మెప్పించి ఒప్పించగల రచయితలు అరుదు కావడం సాధారణ విశేషమే. వారి పేర్లు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడంలేదు. కానీ- తన హాస్య రచనలతో నాటి పాఠకుల్ని- నేటి యువతని బార్స్ కంటే- ఎక్కువగా ఆకర్షించిన ఒకే ఒక్కరు రమణ-బాపు. రాత-గీతల అనుబంధం ఆ ఇద్దర్నీ ఒకరు చేసింది. వారి హాస్యం గిలిగింతల కిక్ ఇచ్చేది. మధురంగా మత్తు గొలిపేది. ఆ జంట హాస్యానికీ ఒకేఒక్కరు. నిన్నటితో (ఫిబ్రవరి 24, 2011) ఆ ఒకే ఒక్కరు సగమైనారు.
సినీమాయలో బుద్ధిమంతుడు. మనోగతానికి సినీగతంగా అందాలరాముడు. సంపూర్ణ రామాయణానికి జగదభిరాముడు. సీతాకళ్యాణానికి విశిష్టుడు. ఆంధ్రపత్రికలో సినీ సింహాసనానికి విక్రమార్కుడు. ఆంధ్రప్రభలో రాజకీయ బేతాళుడికీ విక్రమార్కుడు. జ్యోతికి వెలుగిచ్చిన ఉదయభానుడు.  నిన్నటితో అస్తమయ భానుడు.
మేమభిమానించే సాహితీపరులెందరో ఉన్నారు. ఆరాధించే అతికొద్దిమందిలో బాపు-రమణలు ఒక్కరు (ఇద్దరు?). చదువుకునే రోజుల్లో వారి రచనలున్నాయని పత్రికలకోసం తహతహలాడేవాళ్లం. చదివి పరవశించి ఊరుకోలేక మిత్రులతో పంచుకునేవాళ్లం. ఋణానుబంధంతో బుడుగు చిచ్చరపిడుగుని మా పిల్లలకి పరిచయం చేశాం. మా పిల్లల పిల్లలతో కూడా అనందంగా పంచుకుంటున్నాం. నిన్నటితో రమణకి ఋణానుబంధం తీరిపోయింది.
పండుటాకులు రాలిపోవడం ప్రకృతి సహజం. సాహితీపరులు భౌతికంగా మనమధ్య లేకపోయినా తమ రచనల ద్వారా చిరంజీవులు. ఐతే రమణది నిత్య వసంత ప్రతిభ. స్వాతి బలరాం ప్రేరణతో పండుటాకుగానే ఇటీవల తెలుగు పాఠక లోకాన్ని ఉర్రూతలూగించిన “‘కోతికొమ్మచ్చి” కథనం- వారి ఊటకలమొక తీనీటి ఊటబావి అని ఋజువు చేసింది. ఆ బావి మూతపడితే- తీనీటి సాంగత్యమెలా అన్న ఆవేదన సహజం. ఆత్మీయుని కోల్పోయిన ఆవేదన అందరికీ అపారమైనా- అర్థరమణీశ్వరుడైన బాపు దు:ఖ సముద్రంలో అదొక నీటిబొట్టు.
రమణ జీవితం భగవద్గీత అంత క్లిష్టం, విశిష్టం. దాన్ని వ్యాఖ్యానించడం ఇతరులకి అసాధ్యం. అది తెలిసే వారు కోతికొమ్మచ్చిని స్వీయచరిత్రగా వ్రాసారు. అది చదవడం తెలుగువారి కర్తవ్యం. ఆ పుస్తకం చదివినప్పటి మా అనుభూతుల్లో వారి పూర్తి ప్రస్తావనా ఉంది. వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మరణమెప్పుడూ విషాదాంతమే. హాస్యానికి మారుపేరు కావడంవల్ల రమణాంతం హాస్యాంతం.
బాపుకి మా సానుభూతి. రమణకు మా నివాళి.

3 వ్యాఖ్యలు »

 1. TVS SASTRY said,

  మీరన్నట్లు బాపు రమణలు ఒక్కటే,కాకపొతే ‘జోకో’దరులు.

  భవదీయుడు,

  టీవీయస్.శాస్త్రి

  • ‘జోకో’దరులు పదప్రయోగం కొత్తగా వింటున్నాను. చాలా బాగుంది. అభినందనలు

 2. Satyanarayana said,

  Sri Mullapudi Venkata Ramana to Telugu Literature is what P.G.Wodehouse is to English Literature. His works truly reflect Telugu humour. He will remain immortal with his writings.


Leave a Reply

%d bloggers like this: