ఫిబ్రవరి 26, 2011

దాసరి సుబ్రహ్మణ్యం కథలు

Posted in పుస్తకాలు at 2:25 సా. by వసుంధర

ఆహారానికీ, ఆహార్యానికీ ఆలవాలం. ప్రకృతికీ, వికృతికీ నెలవు. అదే అడవి. అప్పటి తన జంతుప్రవృత్తికి అనుగుణంగా ఆది మానవుడి జీవితం అడవిలోనే మొదలైంది. మనిషి  సంఘజీవిగా మారి జంతుప్రవృత్తిలో వర్జనీయాంశాల్ని గుర్తించినా- మనుగడకు అడవి ప్రాముఖ్యాన్ని గుర్తించి- అక్కడే పల్లె నిర్మించుకున్నాడు. క్రమంగా అడవిని దాటి వెళ్లినా- పల్లె అడవి సంప్రదాయాన్నే అనుసరించి- పచ్చని వనాలతో, పాడిపంటలతో- వర్ధిల్లింది. ఆ తర్వాత మనిషి నాగరికుడైనా- ఆలంబనకూ, అవగాహనకూ అవశ్యమైన పల్లె పునాదులపైనే నగరనిర్మాణం కొనసాగుతున్నది. నాగరికులకు పుష్టినిచ్చే- సృష్టిలోని చతుష్షష్టి కళలూ- పల్లెలో పుట్టినవే. నాగరికులకు కూడా- వాటిలో సమగ్రమైన రాణింపుకి- పల్లె వాసం, పల్లె వాసన స్వానుభవం కావాలి.

జ్ఞానానికీ, విజ్ఞానానికీ ఆలవాలం. భుక్తికీ, శక్తికీ హితవు. అదే చదువు. ఆరంభంలో ప్రకృతే మనిషికి గురువు. క్రమంగా కొందరు మనుషులూ గురువులయ్యారు. జిజ్ఞాసతో మొదలై, ఉదర పోషణకూ సాధనమైన చదువు- క్రమంగా జీవనోపాధి మార్గంగా రూపొందింది. చదువుకి కొలబద్దల నిచ్చే విద్యాలయాలు వ్యాపార కేంద్రాలయ్యాయి. ఐతే ఇప్పటికీ ఎప్పటికీ- చదువులో సమగ్రమైన రాణింపు కోరేవారు- ప్రకృతినీ, జీవితాన్నీ గురువులుగా స్వీకరించాలి.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం (దాసు) పల్లెలో పుట్టి ఆ సంప్రదాయాన్ని జీర్ణించుకున్నారు. జీవితాన్నే చదువనుకుని లోకజ్ఞాని అయ్యారు. పరీక్షలకని కాక జిజ్ఞాసతో పలు భాషల సాహిత్యాన్ని ఔపోసన పట్టి పరిజ్ఞాని అయ్యారు. ఆయన తన భావాలకు అక్షరరూపమిస్తే- అవి పరిసరాల వ్యధలై, సుధలై, గాధలై- కథలయ్యాయి. ఆ కథలు ఎప్పుడో పుట్టి ఎక్కడో మెట్టి ఆయన గిట్టేదాకా మరుగున ఉండిపోయాయి. గిట్టనివారు కూడా నిరసించలేని ఆ కథలు వెలుగు చూడాలంటే- గిట్టుబాటును పట్టించుకోనివారి చేతి దీపం కావాలి. అందుకే అజ్ఞాతవాసం పాండవులది పదమూడేళ్లైతే దాసు కథలది అంతకు కొన్ని రెట్లు!

పత్రికల్లో ప్రచురణ కూడా కథకు వెలుగే కానీ- సంకలనం వస్తే తప్ప కథలకీ, పరిచితులుంటే తప్ప సంకలనాలకీ గుర్తింపు లభించని సంప్రదాయం తెలుగు సాహితిది. ఆపైన అజ్ఞాతాన్ని జీవనవిధానం చేసుకున్న శ్రీ దాసరికి- పరిచయాలను గుర్తింపుకి జోడించే తాపత్రయం లేదు. మంచి రచనకు గుర్తింపు లభించడం- సమాజం ప్రగతికి అత్యావశ్యకం అనుకునేవారు ఉన్నారనడానికి 39 కథల ఈ సంపుటి నిదర్శనం.

పుస్తక పరిచయంగా వసుంధర ముందుమాట
పుస్తకం పొందే వివరాలు

Leave a Reply

%d bloggers like this: