ఫిబ్రవరి 26, 2011

మృత్యులోయ

Posted in పుస్తకాలు at 2:50 సా. by వసుంధర

మనోహరమైన భూప్రపంచముండగా శాస్త్రజ్ఞులు మరో ప్రపంచం అన్వేషణకు తమ జీవితాల్ని ధారపోస్తారు. మరపురాని అనుభూతులుండగా మహాకవులు మరో ప్రపంచం కోసం పరితపిస్తారు. కారణాలు మారినా ప్రతి మనిషీ ఎందుకో ఒకందుకు మరో ప్రపంచాన్ని కాంక్షించడం రివాజు. బహుశా పొరుగింటి పుల్లకూర రుచి అన్నది- అన్ని సామెతల్లోకీ గొప్ప సామెతేమో!

ఇంత గొప్ప సామెతా అమ్మకి వర్తించదు. ఎందుకంటే ఎవరి అమ్మ వారికి గొప్ప! అందుక్కారణం అమ్మతనం బాల్యంతో ముడివడి ఉండడం. బాల్యకౌమారయౌవనవృద్ధాప్య దశలన్నింటిలోనూ మనిషి అమ్మనూ, బాల్యాన్నీ ప్రేమిస్తూనే ఉంటాడు. మరా బాల్యం అభిలషించేదీ మరో ప్రపంచాన్నే!

మానవార్చిత మహిమాజాలంతో మరో ప్రపంచం. మానవాతీత మంత్రజాలంతో మరో ప్రపంచం. మానవేతర యంత్రజాలంతో మరో ప్రపంచం. ఇలా మనిషిలోని బాల్యావస్థకు అనుగుణంగా- మన ప్రపంచ సాహిత్యంలో ఎన్నో మరో ప్రపంచపు కథలు. మనిషిలోని బాల్యావస్థకు నిదర్శనంగా- ఆ కథలకు లభించే అనూహ్య ఆదరణకు తాజా ఉదాహరణలు- ఆంగ్లంలో హారీ పోటర్‌ పొత్తం, అవతార్‌ చిత్రం. తెలుగులో అటువంటి ఉదాహరణలు గుణాఢ్యుని కాలంనుంచీ ఉన్నప్పటికీ- మూడు దశాబ్దాలుగా నవతరం ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యమివ్వడంవల్ల- తాజా రచనలకు గుర్తింపు లేదు. చిత్రమేమిటంటే- గతంలోని మన మరో ప్రపంచం కథల గుర్తింపుకి- ఆంగ్లంలోని ఈ తాజా ఉదాహరణలే ప్రేరణ కావడం!

1954లో చందమామలో ‘తోకచుక్క’తో ప్రారంభమైన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం నవలల పరంపర- ఈ మరో ప్రపంచపు కోవకు చెందినది. ఆధునిక దృక్పథం, సర్వకాలీనత, తర్కం, ఉత్కంఠ, విజ్ఞానవినోదాలు, సందేశం- సమపాళ్లలో మేళవం కావడం ఆ రచనల ప్రత్యేకత.  భాష, సంస్కృతి, సంప్రదాయం- ఎల్లలు కాకపోవడం ఆ రచనల విశిష్టత. కథనంతో దృశ్యకావ్యం అనిపించే ఆ రచనల్ని- బొమ్మలతో ‘చిత్ర’కావ్యం చేసారు చిత్రకారుడు చిత్ర. ఆ రచనల గొప్పతనానికీ, ప్రాచుర్యానికీ ఆ ఇద్దరిలో ఎవరు కారణమన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే ఐనా- సమాధానం కొంతవరకూ ‘మృత్యులోయ’లో లభించవచ్చు.

‘మృత్యులోయ’ నవల 1971-74 మధ్యలో బొమ్మరిల్లు మాసపత్రికలో ధారావాహికంగా వచ్చింది. దాసరి పేరిట రాకపోయినా ఆరంభంనుంచి అంతందాకా ఆయన ముద్ర కనిపించే ఈ నవల బొమ్మరిల్లును బాలల పత్రికగా చందమామ సరసన నిలబెట్టిందనడం అతిశయోక్తి కాదు. ఈ ధారావాహిక కూడా చిత్రకావ్యంగా రూపొందినా- ‘చిత్ర’కావ్యం కాకపోవడం గమనార్హం.

పుస్తక పరిచయంగా వసుంధర ముందుమాట
పుస్తకం పొందే వివరాలు

Leave a Reply

%d bloggers like this: