ఫిబ్రవరి 28, 2011
నెలనెలా చందమామ
ఆకాశంలో చందమామ అందరిదీ కావచ్చు. కానీ పత్రికల్లో చందమామ తెలుగువారికి ప్రత్యేకం. అది తెలుగునాట పుట్టి తెలుగుతనాన్ని నింపుకుని జాతీయంగా అంతర్జాతీయంగా విస్తరించిన ఓ అపురూపం. పిల్లలకోసం వెలసి వారి వికాసానికీ, పెద్దలనాకర్షించి వారి సంస్కారానికీ సహకరించే చందమామ తెలుగువారికి బంధం, అనుబంధం. అనూహ్య పరిణామాలతో 1998లో చందమామకు గ్రహణం పడితే- మత సంప్రదాయానికి అనుగుణంగా ఆవేదనతో స్పందించారు. గ్రహణం విడుపు కాగానే దీపావళిలా సంబరాలు జరుపుకున్నారు. పునర్జన్మలో బాలారిష్టాలతో చందమామ సతమతమైతే విలవిలలాడారు. కాలానుగుణంగా మార్పులు సంతరించుకుంటే అనంగీకారసూచకంగా తలలాడించారు.
చందమామకు అందరూ కోరేది కథల్లో జానపద సరళి. ఆరంభంలోని పుస్తకం కొలతల్లో మార్పు ఉండరాదని. పాఠకుల స్పందనకు విలువనిచ్చి, విన్నపాన్ని మన్నించి ఈ జనవరినుంచి పూర్వపు కొలతలతో చందమామను మనకందిస్తోంది యాజమాన్యం. కథల స్థాయినీ, సరళినీ, సంఖ్యనూ పాఠకుల అభిరుచికి అనుగుణంగా ఉంచడానికి దీక్ష పూనారు సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్న రాజశేఖరరాజు.
చందమామ ధర ప్రస్తుతం 20 రూపాయలు. ధర ప్రియమైనా విలువలు సంతరించుకున్న చందమామ మనకి అంతకంటే ప్రియమైనది. కొని చదవడం ప్రతిఒక్కరూ కర్తవ్యంగా భావించాల్సినంత ప్రియమైనది. మన సంస్కృతి, సంప్రదాయం, విలువలు, భాష వగైరాలను కాపాడుకునే కార్యక్రమంలో చందమామ మనుగడ కూడా ఒక అంశం. అందుకే అక్షరజాలం నెలనెలా చందమామను విశ్లేషించే కార్యక్రమం చేపట్టింది.
ఇటీవల మాకందిన జనవరి, ఫిబ్రవరి సంచికలను ఆ దృష్ట్యా పరిశీలిద్దాం.
చందమామ జనవరి 2011
పాత సైజు అలరించింది. ముఖచిత్రం పాత తరహాలో లేకపోయినా కొత్త సంవత్సరానికి శుభాలాంక్షలు పలికే చిత్ర పాత చిత్రం. ఆకర్షణీయంగా ఉంది. శీర్షికల్లో యువ విజేతలు బాలలకి ప్రేరణాత్మకం. అభినందించాల్సిన శీర్షిక. కెరీర్‌కి సంబంధించిన శీర్షికలో హొటల్ మానేజ్మెంటు కోర్సు గురించి తెలియజేయడం ప్రయోజనాత్మకం. లోకజ్ఞానం క్విజ్, సుడోకు పజిల్, బొమ్మకు రంగులు వేయండి, బొమ్మల కథ– రొటీన్ ఐనా బాగున్నాయి. నవ్వులపువ్వులు నవ్వించాయి. వైజ్ఞానిక ప్రయోగాల యురేకా, భారత దర్శిని, 13 దేశ భాషలు నేర్చుకుందాం, భిన్న ప్రాంతాల వస్త్రధారణ (మాకు తెలిసి కొన్ని అనుమానాస్పదం)- కొత్తగానూ ఆసక్తికరంగానూ ఉన్నాయి. హాస్యచిత్రం తమాషాగా ఉంది. పుస్తకం పొడుగునా బొమ్మలు బాగున్నాయి. ముద్రణ చదువుకుందుకు వీలుగా బాగుంది. శీర్షికల్లో అక్షరాలు మాత్రం రంగులతో కలిసిపోయి అస్పష్టం అనిపించాయి. ఇక కథలకు వస్తే- 15 కథలు, రెండు సీరియల్స్ సంఖ్యాపరంగా చందమామకే అపూర్వం. కథల్ని టూకీగా పరిశీలిస్తే-
తెలివి తేటలు, బలవత్తరమైన ఆయుధం, దొంగకు ఉద్యోగం, అనుభవం, స్వర్గ ప్రాప్తి: ఒక రాజుకి తన పళ్లన్నీ ఊడిపోయినట్లు కలొచ్చిందిట. జ్యోతిష్కుడినడిగితే నీ కళ్లముందే బంధువులంతా చనిపోతారన్నాట్ట. పక్కనున్న విదూషకుడది సవరించి- మీ బంధువర్గంలో అందరికంటే నీకు ఆయువెక్కువని జ్యోతిష్కుడి అంతర్యం- ఆన్నాట్ట. ఏ అంశమైనా చెప్పే తీరులో రాణిస్తుందని చెప్పే ఈ కథ చిన్నప్పుడు చందమామలో చదివాం. ఈ కథల్లో అంశం పాతది. చెప్పిన తీరు సామాన్యం. కొన్ని తిరగవ్రాస్తే మెరుగుపడొచ్చుననిపించింది.
జ్ఞాన దీపం: సందేశం ప్రయోజనాత్మకం. చమత్కారం జోడిస్తే ఇంకా బాగుండేది.
పేదవాడి వంశం: బేతాళ కథ. బాగుంది.
బైరాగి-రాక్షసుడు: ఇది వసుంధర కథ.
లౌక్యం: చమత్కారమున్న ప్రయోజనాత్మక కథ. కల్పనతో పెంచి బేతాళకథగా మలచడానికి అవకాశమున్న కథ.
శ్రీనివాస కళ్యాణం: తిరుపతి వెంకన్న పెళ్లి గురించిన ధారావాహిక. కథనం, శైలి మనోహరం.
పంచతంత్ర కథలు: కథనం, శైలి మనోహరం.
కసి తీర్చుకున్న నౌకరు: చమత్కారం చాలా బాగుంది.
మానవసహాయం: తర్కానికందక పోయినా చిన్నపిల్లలని బాగా అలరించే ప్రతిభావంతమైన చమత్కార కల్పన.
శిథిలాలయం: అలరించే పాత సీరియల్. రచయితగా దాసరి సుబ్రహ్మణ్యం పేరు వేయడం కొత్తదనం.
సుతిమెత్తని మొట్టికాయలు: చమత్కార కథ. చాలా బాగుంది.
వీరనారి అనూరాధ: సినీ కథలా ఉంది. కొన్ని అంశాలు అసమగ్రం.
వ్యక్తి వికాసం: పాతకథను ఇమిడ్చి కొత్త సందేశాన్ని అందించిన ప్రయోజనాత్మక కథ.
చందమామ ఫిబ్రవరి 2011
పాత సైజు కొనసాగింది. 1950లలో చందమామలో ఆట్టమీదబొమ్మకీ, అట్ట వెనుక బొమ్మకీ లోపలి పేజీల్లో కథలుండేవి. చాలాకాలం తర్వాత ఆట్టమీద, వెనుక పురాణ కథల బొమ్మలుండడం ముదావహం. రెంటికి రెండూ అద్భుతం. వాటి వివరణ మాకు లోపలి పేజీల్లో కనబడలేదు. ఇవ్వాలని స్వాభిప్రాయం. శీర్షికలు గత సంచికలోలాగే కొనసాగాయి. చందమామతో నా జ్ఞాపకాలు కొత్త శీర్షిక. పాఠకులని పరిచయం చేసే ఈ శీర్షికలో ఈ నెల అంశం పాఠకుల లేఖలు కి మించి ప్రత్యేకంగా అనిపించలేదు. పుస్తకం మొత్తం బొమ్మలు బాగున్నాయి. ముద్రణ చదువుకుందుకు వీలుగా బాగుంది. శీర్షికల్లో అక్షరాలు మాత్రం రంగులతో కలిసిపోయి అస్పష్టం అనిపించాయి. ఇక కథలకు వస్తే- 17 కథలు, రెండు సీరియల్స్ సంఖ్యాపరంగా చందమామకే అపూర్వం. కథల్ని టూకీగా పరిశీలిస్తే-
నీతివంతుడు: చిన్నప్పుడు చదివిన శాంకోపాంజా (ఆంగ్ల) కథ. శీర్షిక కూడా ఆంగ్లానికి అనుసరణ. ఇలాంటివి బయటివారుకాక సంపాదక సభ్యుల వ్రాయడం మంచిది. లేకుంటే పంపేవారు తెలిసిన కథలు కూడా ప్రచురణకు పంపవచ్చనుకునే అవకాశముంది.
మౌనం విలువ, వ్యాపారంలో కిటుకు, సొంత ఇల్లు, సాధువు వైద్యం, అనుభవం: ఒక రాజుకి తన పళ్లన్నీ ఊడిపోయినట్లు కలొచ్చిందిట. జ్యోతిష్కుడినడిగితే నీ కళ్లముందే బంధువులంతా చనిపోతారన్నాట్ట. పక్కనున్న విదూషకుడది సవరించి- మీ బంధువర్గంలో అందరికంటే నీకు ఆయువెక్కువని జ్యోతిష్కుడి అంతర్యం- ఆన్నాట్ట. ఏ అంశమైనా చెప్పే తీరులో రాణిస్తుందని చెప్పే ఈ కథ చిన్నప్పుడు చందమామలో చదివాం. పై కథల్లో అంశం చెప్పిన తీరు సామాన్యం. తిరగవ్రాస్తే మెరుగుపడే అవకాశముంది.
అపాత్రదానం: సందేశం ప్రయోజనాత్మకం. కథ బాగుంది.
నిజమైన గురువు: కథ ప్రయోజనాత్మకం. బాగుంది. బేతాళకథగా కంటే నేరుగా మామూలు కథగా ఎక్కువ బాగుంటుందనిపించింది.
నీతిపరులు: ప్రయోజనాత్మకం. చాలా బాగుంది.
శ్రీనివాస కళ్యాణం, పంచతంత్ర కథలు, శిథిలాలయం: గత సంచికలోలాగే కొనసాగాయి.
బంగారయ్య ఆస్తి: సందేశాత్మకం. చమత్కారం చాలా బాగుంది.
స్వయంవరం: ప్రతిభావంతమైన కల్పన, చమత్కారం. బేతాళకథకు ఎన్నుకోవలసిన కథ.
ఇంటింటికో పువ్వు: ఆధునిక వాతావరణంలో నడిచిౖనా ఇలాంటి కథ నెలకొకటైనా ఉండాలి. శైలి మనోహరం. కథనం మెచ్చుకోతగ్గది. కథ సందేశాత్మకం, ప్రయోజనాత్మకం. చాలా బాగుంది.
హరిదాసు బుద్ధి: ఆలోచింపజేసే మంచి కథ. చాలా బాగుంది.
అజ్ఞాత పండితుడు: సందేశాత్మకమైన ఈ కథలో కాస్త గజిబిజి ఉంది.
తాయెత్తు మహిమ: సందేశం, కొసమెరుపు ప్రతిభావంతంగా ఇమిడిన ఈ కథ నాణ్యమైన కల్పనా చాతుర్యానికి మచ్చుతునక. ముగింపు ముసిముసిగా నవ్విస్తుంది.
రెండు నగరాలు: ప్రయోజనాత్మక సందేశమున్న ఈ కథ చాలా బాగుంది.
చందమామను విశిష్టంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతులౌతున్న సంపాదకవర్గానికి అభినందనలు.
దాసరి వెంకట రమణ said,
మార్చి 6, 2011 at 11:18 సా.
‘వసుంధర’ గారికి నమస్కారం
సమయ పాలనలో మిక్కిలి నిక్కచ్చిగా చరించి ఆచంరించే మీరు ఉపిరీ సలపని పనుల జాబితాతో సతమత మౌతూ కూడా మనసు కు ఇష్టమైన చందమామ ను విశ్లేషించే పని పెట్టుకున్నందుకు ముందుగా హ్రిదయ పూర్వక ధన్యవాదాలు అనంతరం అభినందనలు.
ప్రారంభంలో చందమామను ప్రశంసించిన పదజాలం చందమామ అభిమానుల గుండెల్లో పన్నీటి జల్లు కురిపించే విధంగా వుంది. విశ్లేషించిన విధానం బాగుంది. ఈ ప్రక్రియ ఆ చందమామ తారార్కం కొనసాగాలని అభిలషిస్తూ…..
వసుంధర said,
మార్చి 7, 2011 at 10:16 ఉద.
చందమామనే పరిశోధనాంశం చేసుకున్న మీ స్పందన మా విశ్లేషణకు ప్రోత్సాహం. ధన్యవాదాలు. మీనుంచి, మీవంటివారినుంచి చేర్పులు కూర్పులు ఆశిస్తున్నాం. అవి చందమామకు విలువైనవి, ప్రయోజనకరం.