మార్చి 3, 2011

బుల్లితెరపై మాట్లాటలు

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 2:15 సా. by వసుంధర

హిందీలో కాఫీ విత్ కరణ్ బహుళ జనాదరణ పొందిన మాట్లాట (టాక్ షో). అదే మూసలో జీ టివి కొంతకాలం క్రితం లక్ష్మీ ప్రసన్నతో ఓ మాట్లాటను ప్రారంభించింది. తెలుగు నాట పుట్టి పెరిగినందుకూ, డైలాగ్ కింగ్ గా ప్రసిద్ధికెక్కిన నటుడు మోహన్ బాబు కుమార్తె ఐనందుకూ- తగినవిధంగా చక్కని తెలుగు మాట్లాడుతోందామె. చాలాకాలం అమెరికాలో ఉండి, అక్కడి మీడియాతో అనుబంధం పెంచుకోవడంవల్లనేమో- అమె యాస అల్లూరి సీతారామరాజు చిత్రంలో రూథర్‌ఫర్డ్‌ని స్ఫురింపజేస్తుంది. ఐనా జగదేకవీరుడు, శ్రీకృష్ణార్జునయుద్ధము వంటి జానపద, పౌరాణిక చిత్రాల్లో బి సరోజాదేవి మాటల్లా ముద్దుగా అనిపించడం విశేషం. కానీ ఒకోసారి వేషధారణలో అమె తెలుగు పిల్ల అని ఏమాత్రం అనిపించదు. మేకప్‌లో పాశ్చాత్య ధోరణులను అనుకరించడంనుంచి కనీసం బుల్లితెరకైనా విముక్తి కలిగించడం అవసరం.  ఐతే ఆమె మాటలో తీరులో సహజత్వం, సౌలభ్యం ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తూ ఆకర్షణీయం చేశాయి. ఇప్పుడామె ఈటివిలో ప్రేమతో మీ లక్ష్మీ పేరిట కొత్తగా ప్రారంభించిన మాట్లాట దానికి కొనసాగింపు అనిపిస్తుంది. పెద్దగా ప్రయోజనం లేకపోయినా- పేరుపడిన సాంఘిక, రాజకీయ, సినీ ప్రముఖులతో నడిచే ఈ కార్యక్రమం కాలక్షేపానికి బాగానే ఉంది.  ఇటీవల చంద్రబాబు నాయుడుతో మాట్లాట ఐతే సత్కాలక్షేపం అని కూడా అనిపించింది. మిగతావి కాసేపు ఫరవాలేదు కానీ పూర్తిగా చూడ్డానికి విసుగనిపించింది.
ఇలాంటిదే చాలాకాలంగా మాటివిలో జయప్రదం పేరిట ప్రముఖ సినీతార జయప్రద నిర్వహణలో వస్తోంది. అక్కినేని. జయసుధ, దాసరి వంటి సినీ ప్రముఖులతో ముచ్చట్లు అభిమానుల్ని సంతృప్తి పరుస్తాయి. జయప్రద వేసే ప్రశ్నలు- లబ్దప్రతిష్ఠులైన ఆయా ప్రముఖుల గొప్పతనాన్ని తెలుసుకుందుకు మినహా- ఆసక్తికరమైన విసేషాలు బయటపడడానికి సహకరించవు. ఆమె తీరు, మందహాసం నటిస్తున్నట్లే తప్ప మాట్లాటలా అనిపించవు. అందం ఆమెకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఇప్పటికీ ఆమెది అప్పటి అందమే! ఆ అందాన్ని వేషధారణ దారుణంగా హరించిందని స్వాభిప్రాయం. మేకప్ తగ్గించినా, అసలు లేకపోయినా ఆమె మరింత హుందాగానూ, అందంగానూ అగుపిస్తుందని కూడా మాకు అనిపించింది. వస్తువు అనాసక్తికరం కావడంవల్ల- ఈ కార్యక్రమం కాసేపు చూసేక విసుగనిపిస్తుంది. నిర్వాహకులీ విషయమై ష్రద్ధ వహించాలి.
ప్రముఖులని పొగడ్తలతో ముంచెత్తే ప్రక్రియగా కాక- మాట్లాటలు సరికొత్త విశేషాల్ని బయటపెడుతూ, చర్చావేదికలంత ఆసక్తికరంగా మారి కాలక్షేపంతోపాటు ప్రయోజనాన్నీ ఇస్తాయని ఆశిద్దాం.

ఈ సందర్భంలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో వస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె మాట్లాటలో ఆర్కె తీరు కొంతవరకూ ఆదర్శప్రాయం అని చెప్పాలి. ఎటొచ్చీ ఈ ఫిబ్రవరి 27న ప్రకాష్‌రాజ్‌తో ముఖాముఖీ మాత్రం కొంత నిరాశ కలిగించింది. మనసు విప్పి మాట్లాడాల్సిన ఈ కార్యక్రమంలో ప్రకాష్‌రాజ్ మెదడుకే తప్ప మనసుకు పని చెప్పకపోవడం అందుకు కారణం.

5 వ్యాఖ్యలు »

 1. bonagiri said,

  కేవలం గ్లామరుతో టాక్ షో నిర్వహించాలనుకోవడం బాగోలేదు.
  టాక్ షో కి తెలివితేటలు, సమయస్ఫూర్తి కావాలి కదా.
  ఉదాహరణకి రాం గోపాల్ వర్మ తో జయప్రద ఏమీ మాట్లాడలేకపోయింది.

 2. subhadra said,

  ఇందాకా జయప్రదం గురించి రాయడం మర్చిపోయాను. ఈ కార్యక్రమం అస్సలు బాలెదు. ఆవిడ అందం, హుందాతనం గురించీ మీరు చెప్పినది చాలా కరక్ట్. ఆవిడ ఏం ప్రశ్నలు వేస్తారో, ఎందుకు అక్కరలేకుండా నవ్వుతారో ఆవిడకే తెలియాలి. తెలుగూ, ఇంగ్లీష్ కాకుందా ఆవిడ మాట్లాడే భాష కూడా భరించడం కష్టమే..

  • మాధ్యమాల్లొ టివి ప్రభావం అన్నింటినీ మించినది. అందులో వచ్చే కార్యక్రమాల్ని తేలికగా తీసుకోకుండా స్పందించడంవల్ల ఎన్నాళ్లకో అన్నాళ్లకి, ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. అర్థవంతమైన మీ స్పందనకు అభినందనలు. మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం.


Leave a Reply

%d bloggers like this: