మార్చి 4, 2011

గతజన్మ రహస్యం

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 7:49 సా. by వసుంధర

ఒకప్పుడు విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేశాడు. ఆ రోజుల్ని గుర్తు చేస్తూ అంతర్జాలంలో మిథ్యాప్రపంచం మొదలైంది. అక్కడ పొలాలు కొనొచ్చు, అమ్మొచ్చు, పంటలు పండించొచ్చు, వ్యాపారం చెయ్యొచు. ఆడొచ్చు, పాడొచ్చు. తార్కికంగా ఉన్నంత కాలం ఏదీ నిజం కాదని తేలిక చెయ్యలేం.  భూమ్మీద మన ఈ జీవితం కూడా మిథ్యే కదా!

ఇది వేదాంత చర్చ కాదు. మాటివిలో కొనసాగుతున్న గతజన్మ రహస్యం కార్యక్రమం మిథ్యాప్రపంచానికి చెందినదనిపిస్తుంది. ఒక మనిషిని పడుకోబెట్టి మాయలో పడేసి గతజన్మలోకి తీసుకెళ్లడం సీదా సాదా వ్యవహారంలా చూపడంవల్ల అలా అనుకోక తప్పదు. ఇంత పక్కాగా మనిషిని పూర్వజన్మలోకి తీసుకు వెళ్లడం సాధ్యమైతే- అది ప్రపంచానికే సంచలన వార్త.  సాధ్యమని ఋజువు చెయ్యడానికి నిర్వాహకులు ప్రయత్నించడం లేదనడానికి కొన్ని సూచనలు: మొదటి ఎపిసోడ్‌లో ఒకామె గత జన్మలో తను లంబాడీ యువతిననీ, మగడు బాగా కొట్టేవాడనీ అంది.  ఇలాంటి కార్యక్రమమే ఒకటి హిందీలో వచ్చిందనీ అందులోనూ ఒకామె గతజన్మకు సంబంధించి ఇవే విశేషాలు చెప్పిందనీ విన్నాం. అంటే ఇది మన తారలతో వచ్చిన పరభాషా చిత్రమనుకోవాలి. ఐతే ఆమె చెప్పింది కొన్ని వందల ఏళ్ల కథ కాబట్టి తార్కికంగా కొంత నిలబడుతుంది.

అదలాగుంచితే 3వ ఎపిసోడ్‌లో నిర్వాహకులు మరింత ధైర్యం చేశారు. ఓఎన్‌జిసిలో ఫైనాన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి తన గతజన్మ రహస్యాన్ని తెలుసుకుందుకు వచ్చాడు. చూడ్డానికాయన రిటైర్మెంటుకు దగ్గిరపడ్డట్లు కనిపించాడు. వయసు తప్పక 55కి పైనే ఉంటుంది. ఆయనకి గతజన్మలో 1932లో 42 ఏళ్లు. అమెరికావంటి దేశంలో స్వర్ణ పతకాలు సాధిస్తున్న బాక్సర్. పేరు మైకేల్. 75 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అంటే 1965లో చనిపోయాడు.  వెంటనే ఆకాశంలో కొందరు ఋషులు కిందకి తోసేస్తే ఓ తల్లి  గర్భాన పడి  పునర్జన్మ ఎత్తాడు. అంటే ఇప్పుడాయనకి 46 సంవత్సరాలు ఉండాలి.  చూస్తే అలా అనిపించరని ముందే చెప్పాం. ఇక మైకేల్, బాక్సర్, 1932, 1965 వగైరాలనుపయోగిస్తే గూగుల్‌లో వివరాలేం దొరకవు.
ఇవన్నీ ఎవరికైనా చెబితే- ఇది తెలుసుకుందుకు ఇంత ఆలోచించాలా, ఇంత ప్రయత్నం చెయ్యాలా అని మనని చూసి నవ్వుతారు. కార్యక్రమాన్ని మళ్లీ మామూలుగా చూసి వినోదం పొందుతారు.
తాజా కార్యక్రమంలో నటి రోజా గతజన్మలో వేల సంవత్సరాలక్రితం పురుషుడని తెలిసింది. నిజానికిది కూడా వినోదమే. ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించడానికి పటిష్టమైన కథ, ప్రతిభ కల నటులు కావాలి.
సినీ నటుడు నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి కథకి బొత్తిగా ప్రాధాన్యం లేదు. కథనమెప్పుడూ ఒకేలా కొనసాగుతుండడంవల్ల- కథాబలం లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూడ్డం క్రమంగా కష్టం కావచ్చు. అలాంటప్పుడు దీన్ని రక్తి కట్టించగలిగినది- నటనాప్రతిభ. చిత్రమేమిటంటే ఈ కార్యక్రమంలో ఇంతవరకూ ఒక సినీ హీరో (రాజా), సినీ హీరోయిన్ (రోజా), ఇద్దరు సాధారణ పౌరులు పాల్గొన్నారు. నటనలో రాణించినది సాధారణ పౌరులే కావడం గమనార్హం.
మిథ్యా ప్రపంచంలో గతజన్మ రహస్యం మున్ముందు కనీసం ఆసక్తికరంగా రూపొందగలదని ఆశిద్దాం.

8 వ్యాఖ్యలు »

  1. గంగ said,

    అబ్బో , బలే చెప్పారు.

    మరి అలాగైతే, ఒక శవానికి గాలి కొట్టి, ఆక్సీజన్ మాస్కు తగిలిస్తే (ఊపిరి) మళ్ళీ
    అది లేచి తిరగాలిగా…జన్మ అంటే, శరీరం, గాలి మాత్రమే అయినప్పుడు, అలా మీరు చేయించగలరా డాక్టర్ గారూ?

    చేయించలేకపోతే, మనిషి బ్రతుకుతున్నాడంటే కారణం, ఈ గాలీ, శరీరం కాకుండా ఇంకోటేదో ఉండుంటుంది కదూ? దాన్ని ఏమంటారు? కాస్త ఆలోచించి చెప్పండి చూద్దాం..?


Leave a Reply

%d bloggers like this: