మార్చి 15, 2011

రెండు ధారావాహికలు

Posted in టీవీ సీరియల్స్ at 5:59 సా. by వసుంధర

అడగక ఇచ్చిన మనసు

ఇంకా మిగతా సీరియల్స్‌కి భిన్నంగానే ఉందనిపిస్తూ కథ, చిక్కబడుతూ కథనం- కొత్తదనాన్ని కొనసాగిస్తున్నాయి. నటన, ప్రాముఖ్యం పరంగా భైరవమూర్తి పాత్ర గొప్ప ఆకర్షణ. నటన పరంగా మంగమ్మత్త అభినందనీయం. మిగతా పాత్రధారులు నటనలో అంతగా జీవించకపోయినా- కనపడగానే పాత్రల్ని స్ఫురింపజేస్తున్నారు. యువతారల్లో నటి అలేఖ్య (మహామహా మాస్‌ ఫేమ్‌) అందంగా, ముచ్చటగా, ముద్దుగా ఉంది. మిగతా పాత్రల్లో అబ్బాయిలు ముచ్చటగానూ, అమ్మాయిలు ముద్దుగానూ ఉన్నారు. ఆనంద్‌ పాత్రచిత్రణ వాస్తవికంగా, హృద్యంగా ఉంది. ఎక్కువమంది సంభాషణలు అరిచి చెవుతున్నారా అనిపిస్తుంది. సంభాషణల్లో తెలివుంది కానీ అన్ని పాత్రలూ మాటల్లో ఒకే తెలివి చూపిస్తున్నాయి. ఎక్కువ సంభాషణలు ఇంగ్లీషు వాక్యాలకి తెలుగు అనువాదంలా ఉంటున్నాయి. ఏదేమైనా సీరియల్‌ ఆసక్తికరం. అందరూ తప్పక చూడాలి. మిస్సైతే చూడ్డానికి అనువుగా పాత ఎపిసోడ్స్‌ని యు ట్యూబ్‌ వంటి వెబ్‌సైట్‌ ద్వారా (మిగతా ఛానెల్స్ లా) అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది.

మంచి సీరియల్ అందిస్తున్న జెమిని చానెల్‌కి అభినందనలు.

మా పసలపూడి కథలు

ఇతివృత్తపరంగా కథలు గొప్పవి అనిపించవు. పాత్రలు, పేర్లు, వాతావరణం, భాష, యాసల్లోని తెలుగుతనం- ఆ పైన వంశీ ముద్ర. రచనని ఉత్తమ సాహిత్యంగా మలిచింది. సీరియల్‌ ఎపిసోడ్స్‌ తెలుగుతనం నింపుకున్నా కథనంలో ఇతివృత్తపు చప్పదనాన్ని అధిగమించలేక- ఆరంభంలో అభిరుచికీ, శీర్షిక గీతానికీ మాత్రమే ప్రశంసలందుకుంది. క్రమంగా కథనం పుంజుకుంది. తెలుగుతనం కన్నుల పండువౌతోంది.

గొల్లపాలెం గురువుగారు మూఢనమ్మకాలతో అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకున్న ఓ పాల వ్యాపారి కథ. కథ వాస్తవానికి అద్దం పట్టినా, ముగింపు విషాదం కావడం సహజమే ఐనా రొటీన్‌గా అనిపించింది. ఇలాంటి కథలు అంతిమ విజయం కష్ట జీవులకు లభించేలా ముగించడం ఆవశ్యకం.

దూళ్ల బుల్లియ్య పాత్ర గొప్పది. సంతలో దూళ్ల బేరాలకు సహకరించడమనే పెట్టుబడి లేని గొప్ప వ్యాపారం బుల్లియ్యది. తెచ్చిన డబ్బునంతా భార్య దోసిట్లో పోసే బుల్లియ్య వేశ్యా వ్యామోహంలో పడి- పెళ్లాంబిడ్డల్ని నిర్లక్ష్యం చేసిన తీరు అద్భుతంగా చిత్రీకరించారు శంకు. బుల్లియ్య పతనం వేశ్యని అనుమానించడంవల్లనే కానీ వేశ్యవల్ల కాదనిపించడం వంశీ ప్రత్యేకత. మన సీరియల్స్‌- ఇల్లాళ్లనే తీవ్రవాదుల్ని మించిన హింసావాదులుగా  చిత్రిస్తున్న నేపథ్యంలో- వేశ్యని మనిషిగా, తగుమాత్రం స్వార్థమున్న అదీ మామూలు మనిషిగా చూపడం- ప్రేక్షకుల అవగాహనకెంతో ప్రయోజనం. ఎక్కువమంది పాత్రధారులు నటనలోకంటే యాసలో ఎక్కువ రాణించారు. ముఖ్యపాత్రధారి దూళ్ల బుల్లియ్యగా హరి అద్భుతంగా నటించాడు. యాస పెట్టిన ఇబ్బందో ఏమో- మాట మాత్రం సహజంగా లేక అరిచినట్లు అనిపించింది. ప్రీతి  నిగమ్‌ యశోధర (చంద్రముఖిలో) ప్రభావం పడకుండా వేశ్య పాత్రని ఒప్పించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

మేరీ కమల కథ ప్రయోజనం తెలియదు కానీ విలక్షణ ప్రేమకథ. కమలగా వహీదా పాత్రకి నటనతో ప్రాణం పోస్తే ఆమె ప్రియుడిగా నటించిన యువకుడు అత్యంత సహజంగా అనిపించాడు. కమల ప్రేక్షకుల సానుభూతిని పొందుతుంది.

ప్రేమకీ, వ్యామోహానికీ ఉన్న తేడాని చమత్కారంగా చెప్పే సందేశాత్మక కథ ప్రేమించడం ఎందుకంటే. ముగింపుపై పట్టు దొరకనివ్వకుండా ఆద్యంతం ఆసక్తిభరితంగా కొనసాగిన ఈ సీరియల్లో పాత్రధారుల ఎన్నిక సమంజసంగా ఉంది. పల్లెటూరి నాటకాలెలా ఉంటాయో చూపడంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండుననిపించింది.

రామభద్రం చాలా మంచోడు వాస్తవానికి అద్దం పట్టే ప్రయోజనాత్మక కథ. నిస్వార్థంగా నలుగురికి మంచి చేసే రామభద్రం పాత్ర జీవితంలో ఇంచుమించు ప్రతి ఒక్కరికీ తటస్థపడే ఉంటుంది. దోపిడి చేసేవారిని కూడా చిన్నబుచ్చని మంచితనానికి గౌరవమేతప్ప అవమానముండదన్న ముగింపు అభినందనీయం. సినిమాల్లో హాస్యపాత్రలకి పరిమితమైన జెన్నీ (పోలాప్రగడ జనార్దనరావు)- రామభద్రం పాత్రకి ప్రాణం పొసిన తీరు చూస్తే- మూసకి ప్రాధాన్యమిచ్చే సినీరంగం నటులనే తప్ప నటనని ఎదగనివ్వదని సుస్పష్టమౌతుంది. ఆ పాత్రకి ఆయన్ని ఎంపిక చేసిన శంకు అభినందనీయులు.

ఈ సీరియల్‌ పాత ఎపిసోడ్స్‌ యు ట్యూబ్‌లో లభిస్తున్నాయి. కొన్నింటికి ఇక్కడ లంకె ఇస్తున్నాం. వాటిననుసరిస్తే అన్నింటికీ లంకెలు దొరుకుతాయి.

మంచి సీరియల్ అందిస్తున్న మా టివి చానెల్‌కి అభినందనలు.

2 వ్యాఖ్యలు »

  1. subhadra said,

    పసలపూడి కధలు చూస్తూ ఉంటే అవి చదివేటప్పు కలిగిన అనుభూతులన్నీ మాయమయిపోతున్నాయి. చాలా బోర్ గా ఉన్నాయి, మాండలీకం సరిగ్గా పలకాలనో, మరే ఇతర కారణం వల్లనో చాలా మంది కళాకారులకి డబ్బింగ్ చెప్పిస్తున్నారనుకుంటా, అది అస్సలు బావులేదు. చాలా నిరాశ కలిగిస్తున్నాయి.

  2. bonagiri said,

    పసలపూడి కథలు చదివి ఊహించుకున్నంత గొప్పగా ఈ సీరియల్ లేదండీ.
    ఒకో ఆదివారం ఒకో కథ విసుగు అనిపించకుండా చూపిస్తే బాగుండేదేమో.


Leave a Reply

%d bloggers like this: