ఏప్రిల్ 21, 2011

రెండు ధారావాహికలు

Posted in టీవీ సీరియల్స్ at 9:56 సా. by వసుంధర

జెమిని, మా టివిల్లో వస్తున్న రెండు దారావాహికల గురించి గతంలో ప్రస్తావించాం. తదుపరి విశేషాలు ఇలా ఉన్నాయి.

అడగక ఇచ్చిన మనసు

ఈ ధారావాహిక మూసలో లేదని సంతోషించాం. యువత నేపధ్యమని మురిశాం. సంభాషణల్లో తెలివికి ముచ్చటపడ్డాం. క్రమం తప్పకుండా చూడాలనుకున్నాం. అయ్యో రాత్రి పదింటికొస్తోంది- నిద్రకాగగలమా అని భయపడ్డాం. క్రమంగా ప్రైమ్‌ టైమ్‌ చేరుకోగలదని ఆశపడ్డాం. క్రమంగా కథ తెగిన గాలిపటమౌతుంటే కలవరపడ్డాం. చివరికి ధారావాహికే తెగిన గాలిపటమై ఛానెల్‌ నుంచి తప్పుకుంది.
కారణం మూసకి అలవాటు పడ్డవారికోసం- కన్నీళ్ళు, హింస, అపార్ధాలు వగైరాలు లేవు.
కొత్తదనం కోరేవారికి కథ గానుగెద్దులా అక్కడక్కడే తిరుగుతోందనిపించడం.
రెంటికి చెడ్డ రేవడ ఐనా ఈ సీరియల్‌ ఆగిపోవడం- మన అభిరుచికి మచ్చే అనుకోవాలి. ఎందుకంటే- జయప్రదంగా నడుస్తున్న ఎన్నో సీరియల్స్‌కంటే ఇది చాలా బాగుంది.
విభిన్నంగా అనిపించే పాత ఎపిసోడ్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చెయ్యండి.

మా పసలపూడి కథలు

ఈ సీరియల్‌ లో కొన్ని భాగాల్ని గతంలో పరిచయం చేశాం. తర్వాత…

దారుణం కదూ: పుష్ప (పాత్ర పేరు) మేనమామ పెద్ద రౌడీ. ఆమెకు దగ్గిర కావాలనుకున్నవారి కాలో చెయ్యో తీసేసి జైలుకెళ్లి రావడం అతడి హాబీ. అతడి సంరక్షణనుంచి బయటపడ్డమెలాగో తెలియక సతమతమయ్యే ఆమెని ప్రేమిస్తాడు మహర్షి రాఘవ (నటుడి పేరు). ప్రాణాలకి తెగించి ఆమెని తనతో తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. స్వేచ్ఛాజీవితాన్ని ప్రసాదించాడని పుష్ప అతణ్ణి ఆరాధిస్తుంది. కానీ రాఘవ ఆమె పూర్తిగా తనకే స్వంతమనుకుంటాడు. ఆమె ఇతర పురుషులతో మాట్లాడినా సహించడు. మేనమామనుంచి భర్త దగ్గిరకి మారినా పుష్ప జీవితంలో ఏ మార్పూ లేదు. ఇంకా చెప్పాలంటే పెనమ్నుంచి పొయ్యిలో పడ్డట్లైంది ఆమె పరిస్థితి. ప్రియురాలికీ గతి దారుణం కదూ అంటుంది పుష్ప. అది ఆమెదే కాదు- ఆధారపడ్డ పురుషుడి అనుమానానికి గురైన ఎందరో మహిళల ఆవేదన. ఇతివృత్తం మనసుల్ని కలచివేస్తుంది. గోదావరి, లాంచీల రేవు, పల్లెటూళ్లు, మాండలీకం- కథకి అలంకారాలు. శంకు కథనం కూడా హృద్యంగా ఉంది. మహర్షి రాఘవ వయసు ప్రియుడిగా ఎబ్బెట్టు. ప్రియురాల్ని అనుమానించడం సహేతుకం అనిపించదు. నటన అతి. అతడిదే ముఖ్యపాత్ర కావడం దర్శకుడి పొరపాటనిపిస్తుంది.

అసలు కథ: కనిపించినవారికల్లా తన రసికత్వానికి సంబంధించిన కథలు చెప్పే ఓ వ్యక్తి అసలు కథ- అతడి దగ్గిర విషయం లేకపోవడం. మొదటి ఎపిసోడ్‌లోనే ముగింపు స్ఫురించేసే ఈ కథ 4 ఎపిసోడ్స్‌గా సాగదీయడంవల్ల కాస్త విసుగనిపిస్తుంది. ముఖ్య పాత్రధారిని అంతకాలం- అదీ రొమాంటిక్‌ సన్నివేశాల్లో చూడ్డం తీసేవారికి ఇబ్బంది కలగలేదంటే ఆశ్చర్యం. అతడి నటనలో వైవిధ్యం లేకపోవడం కూడా కాస్త ఇబ్బందే. అతడు తప్ప మిగతావారంతా యాసని బాగా పండించడం కొంత ఊరట. పాతబడిన చమత్కారం, సాగదీత- సుస్పష్టమైన ఈ కథ మూలం మేము చదవలేదు. కథగా ఎలా ఉందో చదివినవారు చెప్పాలి.

కుమారి మా ఊరొచ్చింది: పది పన్నెండేళ్ల ప్రాయం బాలుడు. తన ఊరొచ్చిన రికార్డింగ్‌ డాన్సర్‌ కుమారిని అభిమానిస్తాడు. ప్రేమకీ, అభిమానానికీ భేదం తెలియని ఆకర్షణ అతడిది. కుమారికి మొగుణ్ణన్నాడన్న ఒకేఒక్క కారణానికి ఆమె భర్తని అడ్డంగా నరికేసి చంపేస్తాడు. అందువల్ల కుమారికి మేలే జరుగుతుంది. ఇతివృత్తం విలక్షణం, అపూర్వం. గోపి కసిరెడ్డి కథనం విశిష్టం. చిత్రీకరణ అద్భుతం. బాలుడి నటన గొప్పగా ఉంది. మిగతా నటులందరూ కూడా పాత్రల్లో జీవించడం విశేషం. తెలుగునాట ప్రముఖనటులను అనుకరించే రికార్డింగ్‌ డాన్సర్లు- అవకాశమున్నంతమేరకు వినోదాన్నందించారు. యాస, పాత్రచిత్రణ మెచ్చుకోతగ్గవి. కుమారి పాత్రధారిణి చూడ్డానికి బాగున్నా- మాటకీ వేషానికీ పొంతన లేకపోవడం దిద్దుకోతగ్గ లోపం.  

తల్లి గోదారి: తల్లి, తండ్రి లేని అబల మేనమామ ఇంట చేరితే అక్కడ అత్త ఆరళ్లు. కామాంధుల కళ్లు. మేనమామ మద్దతుతో ఎలాగో నెట్టుకు వస్తుంటే రంగడనే మోసగాడి ప్రేమ వల. గొర్రెలా కసాయినే నమ్మినా అంతకంటే ఎక్కువగా ఆమె గోదారిని తల్లిగా నమ్మింది. గోదారి ఆమె నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు. కథ మామూలుదైనా కథనం అద్భుతం. గోపి కసిరెడ్డి దర్శకత్వ ప్రతిభకి అద్దం పట్టే ఈ సీరియల్‌లో యాసకి ప్రాధాన్యం తగ్గడం విశేషం. కథానాయిక ఎన్నిక బాగుంది. అందరి నటనా పండింది.  కథ ఆరంభానికీ ముగింపుకీ అన్వయం గొప్పగా ఉంది.

ప్రస్తుతం సత్యభామ ఎవరనుకున్నారు కథ కొనసాగుతోంది.  పూర్తయ్యాక దాని గురించి మాట్లాడుకుందాం.  

1 వ్యాఖ్య »

  1. padmaja said,

    nakuda e rendu serials nachai kani adagaka ich………………. serial enduku apesaro teleiledu meeku telusa


Leave a Reply

%d bloggers like this: