ఏప్రిల్ 24, 2011

సత్యసాయి పరమపదం

Posted in సాంఘికం-రాజకీయాలు at 3:38 సా. by వసుంధర

దేవుడు మనిషి రూపంలో అవతరించాడని నమ్మవచ్చు. అవతరిస్తాడని నమ్మవచ్చు. కానీ మన మధ్యనున్న మనిషి దేవుడని నమ్మడం కష్టం. దైవాంశ సంభూతుడని కిట్టనివారికి కూడా అనిపింపజేసే గాంధీని- దేవుడు కాదనుకోవడంలోనే ప్రయోజనముంది. ఆయన చేసినవి మనమూ చెయ్యడానికి ప్రయత్నించే అవకాశం  అప్పుడే కదా మరి.
మా దగ్గరి బంధువుల్లో, ప్రాణస్నేహితుల్లో- శ్రీ సత్య సాయిబాబాని దేవుడని కొలిచేవారూ ఉన్నారు, మోసగాడని ఈసడించేవారూ ఉన్నారు. ఎవరి మాట వారు నెగ్గించుకుందామనే తప్ప- వారిలో ఎవ్వరూ తర్కాన్ని అనుసరించినట్లు మాకు తోచలేదు. ఇక ఆయన భక్తుల్లో అన్ని రంగాల్లోనూ మనని మించినవారున్నారు. క్రికెట్లో ప్రపంచానికే అగ్రగణ్యుడిగా పేరుకెక్కి, నేటి యువతకు ప్రేరణగా ఉన్న సచిన్ తెండూల్కర్ ఆయన భక్తుడు. ఆయన అస్వస్థతకు విచలితుడై తన పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకున్నాడు. ఇంతకీ సచిన్‌ని దేవుడిగా భావించేవారు కూడా ఉన్నారు.    
శ్రీ సత్యసాయివల్ల సమాజానికి ముప్పు వాటిల్లనున్నదని అనిపించక- మాకు సంబంధించి ఆయనపట్ల అంతగా ఆసక్తి కలుగలేదు. మేము బాబాని కొలువలేదు, నిరసించలేదు. రచనల్లో మాత్రం ఈ తరహా అవతార పురుషుల్ని వివిధ కోణాల్లో తార్కికంగా విశ్లేషించాం.
ఈ రోజు సత్య సాయిబాబా పరమపదించారు.  వారివారి నమ్మకాల్ని బట్టి- ఆయన అంతం విశ్లేషణ జరుగుతోంది.  ఆయన దేవుడా కాదా అన్న చర్చను పక్కన పెట్టి- అంతర్జాతీయంగా మానవాళిని ప్రభావితం చేసిన ఆ మహా పురుషుడికి నివాళులు అర్పిద్దాం.
మేము బొమ్మరిల్లు పత్రికను నిర్వహించే కాలంలో- గత శతాబ్దంలో ఎన్నదగినవనిపించిన విశేషాల్ని-  ఈ శతాబ్దపు చివరి దశాబ్దం శీర్షికలో నెలనెలా విశ్లేషించేవాళ్లం. ఏప్రిల్ 1996 సంచికలో నీరు పోసినవాడు గా జరిగిన శ్రీ సత్యసాయి ప్రస్తావనను ఈ సందర్భంగా ఇక్కడ అందజేస్తున్నాం.  (వ్యాసంలో అవగాహనకు ప్రతిబంధకం కాని అచ్చుతప్పులు అక్కడక్కడ ఉన్నాయి. మన్నించగలరు)

3 వ్యాఖ్యలు »

  1. చక్కగా చెప్పారు అనురాధ గారు! నెసర్లు 🙂

    • మీకు థాంక్స్ ఎవరైనా గొప్పవారిని చూసినప్పుడు..వారికింది నీడనే చూడడం దాన్ని ఇష్టం వచ్చినట్లు చిత్రించి సంతోషపడడం రాక్షస ప్రవృత్తి.వారు చేసిన మంచిని గ్రహించడం మనిషి కనీస ధర్మం.

  2. తిక్క వాగుదు వాగే వారికి సమాధానం చెప్పనవసరం లేదు.అడ్డదిడ్డంగా వాదించి ఆయన దేవుడు కాదని నిరూపించాలనే తాపత్రయమే తప్ప ఆయన చేసిన మంచి పనులతోనైనా ఆయన మానవులలో మాధవుడని ఒప్పుకోవడానికి వాళ్ళ మనసొప్పదు.ఇంతకూ ఆయన చేసిందేమిటి..గాల్లోంచీ విభూదీ..లింగాలూ..చైనులూ తీసి మ్యాజిక్ చేసాడని జనాలని బుట్టలో వేసుకున్నాడనీ వీరి గోల.చేస్తే ఏమిటట..?తర్వాత గొంతెండుకు పోతున్న అనంతపురం ప్రజలకు నీటి దాహం తీర్చాడు..విద్య వైద్య..అవసరాలను సామాన్యునికి ఉచితంగా ఇచ్చాడు.ఇవి ఏ ప్రభుత్వమన్నా చేసిందా..?వీళ్ళ రాజకీయాలతో కొట్టుకుచావటం తప్ప.
    నా దృష్టిలో ఆయన జీవితమంతా..దైవధ్యానంలో గడిపాడు భక్తుల మధ్యనే వున్నాడు.పెళ్ళి పిల్లలు లేరు.. తాము సంపాదించిందంతా దోచిపెట్టాలని తన పీఠంపై తన వారినే కూచో పెట్టాలనే తపన పైనించీ కిందిదాకా అందరు రాజకీయ వెధవలూ చేస్తూ..జన్మంతా పునీతంగా గడిపిన ఆయనను విమర్శించటమొకటి..ఏ గొప్ప వాడినీ బ్రతికుండగా కాల్చుకుతిందిలెండి ఈ లోకం


Leave a Reply

%d bloggers like this: