మే 12, 2011

సభికులు-జూదరులు

Posted in సాహితీ సమాచారం at 4:09 సా. by వసుంధర

మా భువనేశ్వర్‌ మిత్రులు సామవేదం మురళీకృష్ణ వ్రాసిన వెంకటేశ్వర భక్తిరత్న గీతాలు కలగా కృష్ణమోహన్‌ సంగీత దర్శకత్వంలో ఆడియో సిడిలుగా మార్చి 7న విడుదలయ్యాయి. ఆ సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన సభలో నేను ఆత్మీయ ఆతిథిగా వేదికపై కూర్చోవలసి వచ్చింది. నాలుగు ముక్కలు చెప్పాల్సి వచ్చినపుడు వేదకనలంకరించినవారికి వందనం, సభకు నమస్కారం చెప్పడం నా అలవాటు. మధ్యలో పొరపాటున సభికులు అన్న పదం నోట వెలువడిందేమో తెలియదు. నా పక్కనే ఉన్న ముఖ్య అతిథి సి. నారాయణరెడ్డి గారు నా పలుకుల్ని మెచ్చుకుని ‘సభికులు’ అన్న పదాన్ని తప్పుపట్టారు. సభికులు అంటే జూదగాండ్రు అనీ సభాసదులు అనడం ఒప్పనీ సభాముఖంగా అన్నారాయస. పదిమంది వాడినదే వాడాను కాబట్టి చిన్నబుచ్చుకోలేదు కానీ పదుగురాడు మాట పాటి కాదని తెలిసినప్పుడు సంతోషించి పాఠకులతో ఈ విషయం పంచుకోవాలికదా. ఆర్యుల మాట గ్రాహ్యమైనా ప్రామాణికత కోసం శబ్దరత్నాకరం తిరగేస్తే- ‘సభికుడు’ అన్న పదానికి- సభలో ఉండే ధర్మజ్ఞుడు, జూదగాడు, న్యాయవాది అని నానార్థాలున్నాయి. ‘సభాసదుడు’ అంటే సభలో ఉండే ధర్మజ్ఞుడు అని ఒకే ఒక అర్థం ఉంది. అంటే నిర్ద్వంద్వంగా సభలోనివారిని సంబోధించడానికి సభాసదుడే ఉత్తమ పదమని సినారె ఆంతర్యమై ఉంటుంది. అది సబబు. ఐతే హరి అన్న పదానికి కోతి, కప్ప, చిలుక వగైరా నానార్థాలున్నప్పటికీ విష్ణువును హరిగా సంబోధించడం వర్జనీయం కాదు కాబట్టి సభికులు అన్న పదం కూడా అభ్యంతరకరం కాకూడదు. అదీకాక స్టాక్‌ మార్కెట్లూ, కాసినోలూ, లాటరీలూ వర్థిల్లే నేటి రోజుల్లో జూదం సభ్యం కూడా. కేవలం ధర్మజ్ఞులకే పరిమితం చేస్తే సభికులన్న పదం ఎవర్నీ ఉద్దేశించకపోయే ప్రమాదం నేటి సభల్లో ఉంది. సభికులు అంటే- అంతా ధర్మజ్ఞులమని సంబరపడొచ్చు. అందర్నీ ఉద్దేశించామని తృప్తిపడొచ్చు. ఉభయతారకంగా ఉంటుంది. ఏదేమైనా నిర్ణయం మీది.  

5 వ్యాఖ్యలు »

  1. mahaacharya said,

    సాధారణంగా వాడుకలో ఉన్న అర్థం కాక మరొకటి ఉన్న విషయాన్ని తెలియజేసినందుకు సంతోషిస్తున్నాను. మా తెలుగు మాస్టారు నెరయనూరి హనుమంతరావు గారు ఈ విషయం చెప్పారు నాకు. దీనిని వ్యాఖ్యానించడం ముదావహం. సమయాను సందర్బంగా పదాలు వాడవల్సి వస్తుంది. పండితుల సభలో సభాసదులు అనడం సముచితమనిపిస్తుంది. నాకు సభికులు అని పంఫితులు సంబోధించడం భాషావగాహన లోపంగా తోస్తుంది.

    • నిఘంటువుల్ని ప్రామాణికంగా తీసుకుంటే – సభికులు అన్న పదం సబబైనదే తప్ప భాషావగాహన లోపం అనిపించుకోదు. సభాసదులు అన్న పదం వివాదాలకు తావివ్వనిది. వాడుక వారి వారి అభిరుచుల్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఆలోచన అన్న పదాన్ని thought కి పర్యాయపదంగా వాడుతున్నాం. ఆ పదానికి చర్చ అన్నది అసలు అర్థమని మాకు మా తెలుగు మాస్టారు చెప్పారు. కానీ వాడుకలో ఉన్న అర్థాన్ని ఇప్పుడు నిఘంటువులు కూడా ఆమోదించాయి. వ్యావహారికంలో పాండిత్యం కూడా పామర ప్రయోగంబులు గ్రాహ్యంబులు అంటుందేమో!


Leave a Reply

%d bloggers like this: