మే 12, 2011

సభికులు-జూదరులు

Posted in సాహితీ సమాచారం at 4:09 సా. by వసుంధర

మా భువనేశ్వర్‌ మిత్రులు సామవేదం మురళీకృష్ణ వ్రాసిన వెంకటేశ్వర భక్తిరత్న గీతాలు కలగా కృష్ణమోహన్‌ సంగీత దర్శకత్వంలో ఆడియో సిడిలుగా మార్చి 7న విడుదలయ్యాయి. ఆ సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన సభలో నేను ఆత్మీయ ఆతిథిగా వేదికపై కూర్చోవలసి వచ్చింది. నాలుగు ముక్కలు చెప్పాల్సి వచ్చినపుడు వేదకనలంకరించినవారికి వందనం, సభకు నమస్కారం చెప్పడం నా అలవాటు. మధ్యలో పొరపాటున సభికులు అన్న పదం నోట వెలువడిందేమో తెలియదు. నా పక్కనే ఉన్న ముఖ్య అతిథి సి. నారాయణరెడ్డి గారు నా పలుకుల్ని మెచ్చుకుని ‘సభికులు’ అన్న పదాన్ని తప్పుపట్టారు. సభికులు అంటే జూదగాండ్రు అనీ సభాసదులు అనడం ఒప్పనీ సభాముఖంగా అన్నారాయస. పదిమంది వాడినదే వాడాను కాబట్టి చిన్నబుచ్చుకోలేదు కానీ పదుగురాడు మాట పాటి కాదని తెలిసినప్పుడు సంతోషించి పాఠకులతో ఈ విషయం పంచుకోవాలికదా. ఆర్యుల మాట గ్రాహ్యమైనా ప్రామాణికత కోసం శబ్దరత్నాకరం తిరగేస్తే- ‘సభికుడు’ అన్న పదానికి- సభలో ఉండే ధర్మజ్ఞుడు, జూదగాడు, న్యాయవాది అని నానార్థాలున్నాయి. ‘సభాసదుడు’ అంటే సభలో ఉండే ధర్మజ్ఞుడు అని ఒకే ఒక అర్థం ఉంది. అంటే నిర్ద్వంద్వంగా సభలోనివారిని సంబోధించడానికి సభాసదుడే ఉత్తమ పదమని సినారె ఆంతర్యమై ఉంటుంది. అది సబబు. ఐతే హరి అన్న పదానికి కోతి, కప్ప, చిలుక వగైరా నానార్థాలున్నప్పటికీ విష్ణువును హరిగా సంబోధించడం వర్జనీయం కాదు కాబట్టి సభికులు అన్న పదం కూడా అభ్యంతరకరం కాకూడదు. అదీకాక స్టాక్‌ మార్కెట్లూ, కాసినోలూ, లాటరీలూ వర్థిల్లే నేటి రోజుల్లో జూదం సభ్యం కూడా. కేవలం ధర్మజ్ఞులకే పరిమితం చేస్తే సభికులన్న పదం ఎవర్నీ ఉద్దేశించకపోయే ప్రమాదం నేటి సభల్లో ఉంది. సభికులు అంటే- అంతా ధర్మజ్ఞులమని సంబరపడొచ్చు. అందర్నీ ఉద్దేశించామని తృప్తిపడొచ్చు. ఉభయతారకంగా ఉంటుంది. ఏదేమైనా నిర్ణయం మీది.  

5 వ్యాఖ్యలు »

 1. ఈనాటి ఈ సమావేశానికి..
  సమావేశితమైన మన సమ ఆవేశానికీ..
  సభాసదుల సమరస భావానికీ..
  సాభిజ్ఞులైన శ్రోతలకూ..
  వినయ పూర్వకంగా నమస్సులర్పిస్తున్నాను..

  నేనిలా వేదికను సంభోధించేదాన్ని..

  అయినా చెప్పే విషయం ముఖ్యం గానీ..తప్పు లెన్నుతూ పోతే..దానికి అంతం వుంటుందా..? దూషణ భూషణ తిరస్కారాలను..చూసీ చూడనట్లు..వదిలేయటం ఉత్తమం..

  • తప్పులెన్నడం తప్పు కాదు. పెద్దలు తప్పులెన్నితే పిన్నలు సవరించుకోవాలి. అది జ్ఞాన, మానసిక వికాసాలకి ముఖ్యం. ఐతే ఇక్కడ చర్చనీయాంశం- సభికుడు అన్న పదం వర్జనీయమా, కాదా అన్నది మాత్రమే. ఆ పదం వాడుకలో ఉంది. నిఘంటువు ఆమోదించింది. ఐతే ఆ పదానికి జూదరి అన్న మరో అర్థం కూడా ఉంది. అదీ విషయం.

 2. తెలుగు సాహిత్యం పై మమకారం చావక ప్రతి సభలో ఆవిష్కృతమయ్యే ప్రతి పుస్తకంలొ ఏదో వుంటుందని “ఆశించి”, కొంత డబ్బు పెట్టి “కొని”, చదివి అందులొ ఏమీ లేదని “నిరాశ” పడే వాడు కూడా జూదగాడే కదా… ఆ లెక్కన చూసినా మీ పదం తప్పు కాదులెండి…


Leave a Reply

%d bloggers like this: