మే 15, 2011
మా పసలపూడి కథలు
ఈ సీరియల్ లో కొన్ని భాగాల్ని గతంలో పరిచయం చేశాం. తర్వాత..
సత్యభామ ఎవరనుకున్నారు (58-62): రుక్మిణి, సత్యభామల తల్లి పురిట్లోనే చనిపోయింది. తండ్రి సత్యభామని తీసుకుని ఎటో వెళ్లిపోతే- పన్నెండేళ్ల మేనమామ రుక్మిణిని కళ్లలో వత్తులు వేసుకుని ప్రాణంకంటే మిన్నగా పెంచాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం. అది ప్రేమగా పొరబడ్డ రుక్మిణి అమ్మమ్మ వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలనుకుంది. ఆమెకి గుండెపోటు వచ్చి తగ్గడంతో తల్లి మాట కాదనలేక మేనమామ రుక్మిణిని పెళ్లి చేసుకుంటాడు. కానీ తన చేతులతో పెంచిన మేనకోడల్ని భార్యగా దగ్గిరకి తీసుకోవడానికి మనస్కరించక దూరంగా ఉంటాడు. ఆ పరిస్థితిని జీర్ణించుకోలేని రుక్మిణి చివరికి ఆత్మహత్య చేసుకుంటుంది. కృంగిపోయిన మేనమామ దగ్గిరకి అచ్చం రుక్మిణిలా ఉన్న సత్యభామ తిరిగొస్తుంది. అతణ్ణి తనవాణ్ణి చేసుకుందుకు- తామిద్దరూ ఒకటి కావడం రుక్మిణి కోరిక అనీ, అప్పుడు రుక్మిణి తిరిగి తమ కడుపున పుడుతుందనీ నమ్మిస్తుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నాక ఆడపిల్ల పుట్టడం కథకి ముగింపు.
కథగా అతి సాధారణం. వంశీ కథనం-సంభాషణలు, బాపు బొమ్మలు దీనికి కొంత విలువనాపాదించాయి. చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ, గ్రామీణ దృశ్యాలు, మేనమామగా వాసు నటన గొప్పగా ఉన్నాయి. మిగతా నటీనటులు సహజంగా నటించారు. సీరియల్ చూస్తే ఈ కథ వల్ల ప్రయోజనమేమిటీ అనిపిస్తుంది.
చంటినాన్నగారి కళ్లు మనకెలాగొస్తాయి (63-67): ఊరందరికీ తీర్పులు చెప్పే చంటినాన్నకి ఇంటా బయటా చెప్పలేనంత గౌరవం. ఉన్నట్లుండి ఆయన ఓ ఆడమనిషిని తెచ్చి తోటలో ఉంచాడు. పుకార్లు గుప్పుమని బయటా ఇంటా అంతా ఆయన్ని ఏవగించుకుంటారు. గతంలో ఆయన ఆ యువతిని ప్రేమించాట్ట. పరిస్థితులు కలిసిరాక వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా వేరే పెళ్లి చేసుకుని భర్త పెట్టే కౄరహింసలు భరించింది. ప్రస్తుతం దిక్కులేనిదైన ఆమెకి ఆశ్రయం కల్పించడం తన కర్తవ్యంగా భావించాడు చంటినాన్న. ఆయన కళ్లు మనకెలాగొస్తాయంటూ కథ ముగుస్తుంది.
మొదటి నాలుగు ఎపిసోడ్సూ కథనంలో బిగి అభినందనీయం. ఐతే చంటినాన్న తన కథని పిల్లలకి చెప్పి ఆమెకి ఆశ్రయం కల్పించే ఏర్పాటు చెయ్యకుండా- రహస్యంగా తోటలో దించి- నలుగురూ చెవులు కొరుక్కునేలా ఎందుకు చేశాడూ అన్న అనుమానానికి జవాబు దొరకదు. గాలీవానా వస్తే కథేలేదు అని సరిపెట్టుకోవాలేమో. రంగనాథ్ నటన గొప్పగా ఉంది. ఆదిలో రంగనాథ్ ప్రియురాలి దృశ్యాలు రాజ్‌కపూర్ సత్యం శివం సుందరం చిత్రాన్ని తలపుకి తెస్తాయి. గ్రామీణ వాతావరణం అద్భుతం. కథలో కొత్తదనం, ప్రయోజనం కనిపించవు.
దీపాలవేళ దాటేకా వెళ్లిపోయింది (68-72): బూబమ్మ అతిమంచిది. భర్త తాగుబోతై వేధించినా అతణ్ణి ఏవగించుకోదు. ఆమె భర్త మనుగడ కూడా ఆమె మంచితనంమీదనే ఆధారపడి ఉంది. ఐనా అతడు వేరే పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటాడు. చివరికామె అనారోగ్యంతో చనిపోతే- భర్తలో పరివర్తన వస్తుంది. భార్య ఆత్మ ప్రోద్బలంతో అతడు రెండో పెళ్లి చేసుకుంటాడు.
పాత్రచిత్రణ అద్భుతం. గ్రామీణ వాతావరణంలో మత సామరస్యం నాగరికులకి కనువిప్పుగా ప్రదర్శితం. నటీనటులు పాత్రల్లో జీవించారు. కథనం కూడా బాగుంది. యాస కృతకంగా అనిపించినా- సంభాషణలు బాగున్నాయి. ఎటొచ్చీ- ఈ కథలో కూడా కొత్తదనం, ప్రయోజనం కనిపిచంచవు.
పిచ్చి వీర్రాజు (73-78): శేషు-మహాలక్ష్మి ప్రేమించుకున్నారు. మహాలక్ష్మిని ప్రేమించిన ఆమె బావ- అచ్చం మహాలక్ష్మిలాగే ఉండే కవల సోదరిని ఉపయోగించి- శేషులో భ్రమలు సృష్టిస్తాడు. శేషు సున్నిత మనస్కుడు. మహాలక్ష్మి తన్ను మోసం చేస్తోందని నమ్మి ఆ భావనకు తట్టుకోలేక పిచ్చివాడైపోతాడు. ఆమె ఫొటోనీ, ఉత్తరాల్నీ మూటగట్టుకుని ఇంట్లోంచి పారిపోయి పసలపూడి చేరుకుంటాడు. అక్కడివారతణ్ణి పిచ్చి వీర్రాజుగా ఆదరిస్తారు. తన మూటని దొంగిలించబోయిన వాళ్లని పిచ్చిబలంతో తరిమేస్తే- వాళ్లతడిమీద పగబట్టి- మంటల్లోకి విసిరేస్తారు. తను కాలిపోతూ కూడా ప్రేమ మూటని కాపాడుకుంటాడు పిచ్చి వీర్రాజు.
శేషు మనస్తత్వం చిత్రీకరణ, ఆ పాత్రధారి నటన మెచ్చుకోతగ్గవి. మిగతా నటీనటులు ఫరవాలేదు. సెంటిమెంటు, ఏడుపు పాళ్లు కాస్త ఎక్కువే. దర్శకత్వం చప్పగా ఉంది. అందువల్లనేమో, ఈ కథ ప్రయోజనమేమిటీ అనిపించింది.
మా పసలపూడి కథలు స్వాతిలో ఆర్జించిన ఘనకీర్తిని- బుల్లితెరపై కూడా మున్ముందైనా నిలబెడతాయని ఆశిద్దాం.
M.Srilatha said,
మే 19, 2011 at 2:24 సా.
ee kathalu chaala bgunnayee