జూన్ 22, 2011

రెండు ధారావాహికలు

Posted in టీవీ సీరియల్స్ at 9:33 సా. by వసుంధర

అడగక ఇచ్చిన మనసు

గతంలో జెమిని టివి లో పది గంటలకు వచ్చేది ఈ సీరియల్‌. దీనిపై అప్పటి మా వ్యాఖ్యానంకోసం ఇక్కడ క్లిక్‌ చెయ్యండి. విభిన్నమూ, ఆసక్తికరమూ ఐన ఈ ధారావాహిక 8 గంటల ప్రాంతంలో వస్తే బాగుండునని వ్రాశాం. 50 ఎపిసోడ్స్‌ తర్వాత ఆగిపోతే బాధపడ్డాం కూడా. ఇప్పుడీ సీరియల్‌ జూన్‌ 13నుంచి మా టివిలో మళ్లీ ప్రారంభమైంది. సంభాషణ ప్రధానమైన ఈ కథనం రసాస్వాదనకు వీలుగా 8.30కి రావడం ముదావహం. చూసి మాత్రమే కాక విని కూడా ఆనందించతగ్గ ఈ సీరియల్‌ సాఫ్ట్‌వేర్‌ జీవితాన్ని పరిచయం చేస్తూ ఆరోగ్యకరమైన వినోదాన్నిస్తుంది.

మళ్లీ చూస్తున్నా సరదాగా అనిపిస్తున్న ఈ సీరియల్‌ గతంలో వచ్చిన ఎపిసోడ్స్‌కై ఇక్కడ క్లిక్‌ చెయ్యండి.

మా పసలపూడి కథలు

ఈ సీరియల్‌ లో కొన్ని భాగాల్ని గతంలో పరిచయం చేశాం. తర్వాత..

మలబార్‌ కాఫీహొటల్‌ (79-83): శివగామి భర్త తాగుబోతు, శాడిస్టు. తన కష్టాలకు జాలిపడే నాయర్‌తో శివగామికి సాన్నిహిత్యం పెరిగి- ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటారు. భర్తని పూర్తిగా మర్చిపోతానని శివగామి మాటిచ్చాక- ఆ దంపతులు తెలుగునాడు చేరి ఓ గ్రామంలో రాజుగారి ఆశ్రయం పొంఉతారు. నాయర్‌ కరెంటు పని చేస్తే భార్య మలబార్‌ హొటలు పెడుతుంది. ఆమెపై మనసుపడ్డ రాజుగారు ఆమె శీలవతి అని తెలిసి ఊరుకుంటాడు. ఈలోగా భర్త కాన్సర్‌ వ్యాధికి గురై ఆమె ఆశ్రయం కొరితే కాదనలేక రహస్యంగా సేవలు చెస్తుంది శివగామి. మాట తప్పిందని నాయర్‌కి కోపమొస్తే, శీలవతి కాదని రాజుగారు అపార్థం చేసుకుంటాడు. శివగామి పెద్ద మనసు తెలిసాక రాజుగారు పశ్చాత్తాపపడతాడు కానీ ఆ దంపతులు ఊరొదిలి వెళ్లిపోతారు.

రొటీన్‌ కథ. శివగామి భర్త విషయం దాచిపెట్టడం, తద్వారా అపార్థాలకి తావివ్వడం- కథకోసం తప్పితే సహజంగా అనిపించదు. సంబాషణలు చాలా బాగున్నాయి. చిత్రీకరణ ఓమాదిరి. గ్రామీణ దృశ్యాలు గొప్పగా ఉన్నాయి. రాజుగారి పాత్ర, నటన అద్భుతం. సంభాషణలు రావు గోపాలరావు తీరులో అంత గొప్పగానూ ఉన్నాయి. ఉత్తరాది విలన్లకోసం తాపత్రయపడే తెలుగు సినీ దర్శక-నిర్మాతలు ఇటువంటివారిని ఉపయోగించుకోకపోవడం దురదృష్టం. మిగతా నటీనటులు సహజంగా నటించారు.  

తెలుకుల రమణ (84-88): రెడ్డి, తెలుకుల రమణ ప్రేమించుకున్నారు. కులం పేరుతో వాళ్ల ప్రేమని తిరస్కరించడం సంస్కారం కాదనుకున్న రెడ్డి తలిదండ్రులు- ఓ ఉపాయం పన్నుతారు. జాతకం ప్రకారం రమణని చేసుకుంటే రెడ్డి చావు తథ్యమని- రమణకి చెబుతారు. దాంతో రమణ రెడ్డిని పెళ్లి చేసుకోనంటుంది. జాతకాన్ని కూడా లెక్క చెయ్యకుండా రెడ్డి తనను పెళ్లి చేసుకోగలడన్న భయంతో- జాతకం విషయం దాచిపెడుతుంది  రమణ. వాళ్ల ప్రేమ ఎంత గొప్పదంటే ఇద్దరూ పెళ్లి మానేస్తారు. రెడ్డి తమ్ముళ్లు రమణని వదినగా గౌరవిస్తారు. ఊరంతా వారి అనుబందాన్ని గౌరవిస్తుంది. చాలా ఏళ్లు గడిచేక అసలు విషయం బయటపడినా- రమణ పెళ్లికి ఒప్పుకోదు. విశాలమైన తమ అనుబంధాన్ని ఇరుకైన దాంపత్యానికి పరిమితం చెయ్యవద్దంటుందామె.

నేరుగా కులాన్ని నిరసించలేక, మూఢనమ్మకాన్ని ఆయుధంగా వాడిన రెడ్డి తలిదండ్రుల సంస్కారం చిత్రమైనది. పెళ్లి కాకున్నా దంపతులుగా చెలామణీ ఔతూ గౌరవించబడిన రెడ్డి-రమణల వ్యక్తిత్వాలు కూడా విశేషమైనవి. రెడ్డి సోదరుల్నీ, ఆ గ్రామపౌరుల్నీ అభినందించాలి. ఆధునిక దృక్పథానికి జాతకం పై నమ్మకం అడ్డుతెర కావడం సిల్లీగా ఉన్నా- మన సమాజానికి దర్పణం. చక్కని గ్రామీణ దృశ్యాలతోపాటు పల్లెటూరి గానుగని కూడా చూపించడం అభినందనీయం. చివరగా తమ అనుబంధాన్ని గురించి రమణ చెప్పిన మాటలు అద్భుతం. నటీనటులు తమ పాత్రలకి న్యాయం చేశారు. యాస లేని మాట పసలపూడికి కొంత అన్యాయం. మానవ సంబంధాలనీ, పల్లె పురోగతినీ ఆదర్శప్రాయంగా ప్రదర్శించిన ఈ కథలో కొత్తదనం కనిపించదు.  

భద్రాచలం యాత్ర- వాళ్లక్క కథ (89-93): అమెరికానుంచి వచ్చిన రవికిరణ్‌ మిత్రబృందంతో భద్రాచల యాత్రకి వెళ్లాడు. అక్కడి గైడ్‌ బోసు ప్రవర్తన రవికి అతిగా అనిపిస్తుంది. ముఖ్యంగా తన స్నేహితురాలు సుశీలపట్ల అతడి ప్రవర్తనని బాగా అనుమానిస్తాడు. ఈ మధ్యలో ఓ అనాథని మాయ మాటలతో అదే యాత్రకి తీసుకొచ్చి అత్యాచారం చేయబోయిన ఓ మోసగాడి ఉపకథ. రవికి బోసుపై అనుమానం పెరగడానికి ఆ కథ కూడా తోడవుతుంది. చివరకు రవి సుశీలలో తన అక్కని చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. తమ్ముడితో విడదీయరాని అనుబంధమున్న ఆ అక్క పెళ్లయ్యాక అత్తింట్లో పడరాని కష్టాలు పడుతుంది. భరించలేక పుట్టింటికొస్తే- ఇరుగుపొరుగుల సూటిపోటి మాటలు. తలిదండ్రులతోపాటు తమ్ముడు కూడా అమెని అత్తింటికి పొమ్మంటాడు. చివరికామె అత్తింట్లోనే కన్ను మూస్తుంది.

బోసు పాత్రదారి చూడ ముచ్చటగా ఉన్నాడు. యాసకీ, నటనకీ అంతగా పొసగలేదు. మిగతా నటీనటులు కూడా ఓ మాదిరి. కథ పేలవం. సన్నివేసాలు పాతవి. భద్రాచలం దృశ్యాలు చూసి తీరాలి. ఒకప్పుడు భద్రాచలం కోనసీమలో భాగమని తెలిపే ఈ సీరియల్‌ కథనం నిరుత్సాహకరం.

దొంగ శీను (94-98): బ్రతుకుతెరువుకి దొంగతనాన్నే నమ్ముకున్న శీను సవరాలమ్ముకునే ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుని ఆమె మాటపై దొంగతనాలు మానేశాడు. అన్యాయంగా అరెస్టై భార్య కోసమే తపిస్తూ రెండేళ్లు జైల్లో గడిపాడు. తిరిగొచ్చి భార్యకోసం అన్వేషిస్తే  ఆమె వేరెవర్నో పెళ్లి చేసుకుంది. శీను పిచ్చివాడైపోయాడు.

శీను పాత్రలో జీవించాడు ఆ నటుడు. అతడి భార్య నటన హృద్యంగా ఉంది. కథలో కొత్తదనం లేకపోయినా సన్నివేశాలు వాస్తవికంగా, బలంగా ఉన్నాయి. మనసుని కలచివేసే దృశ్యాలు ఒకటికి మించి ఉన్నాయి. కథనం, దర్శకత్వం, యాస, గ్రామీణ దృశ్యాలు- ఒకదానికొకటి బాగా కుదిరాయి. ముగింపు వాస్తవానికి దగ్గిర్లో ఉన్నా- విషాదాంతం కాకపోతే ఇంకా బాగుండుననిపించింది.

అందరికంటే గొప్పోడు (99-103): భద్రావతి చదువుకున్నది. రామదాసు డ్రైవర్‌. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మొదట్లో ఏవగించుకున్నా క్రమంగా రామదాసు గొప్ప మనసుని అర్థం చేసుకుంటుంది భద్రావతి. వాళ్లకి ఇద్దరు పిల్లలు కలిగాక ఓ యాక్సిడెంట్లో గతం మర్చిపోతుంది భద్ర. రామదాసు ఆమెకు గతం చెప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకి ఓ అబ్బాయి పుడతాడు. భద్ర అంతకు ముందు తన పిల్లల్ని సవతి పిల్లలని ఈసడిస్తుంది. రామదాసు ఆ పిల్లల్ని వేరేచోట ఉంచి పెంచి పెద్ద చేస్తాడు. ఎదిగిన పిల్లలు జీవితంలో స్థిరపడినా- తల్లిని ఏవగించుకుంటారు. రామదాసు పిల్లల దగ్గిరకి వెళ్లక భార్యనే చూసుకుంటూ ఉండిపోతాడు.

రామదాసు పాత్రధారి నటన చాలా గొప్పగా ఉంది. మిగతావారు కూడా సహజంగా నటించారు. కన్నతల్లి తన బిడ్డల్ని సవతిబిడ్డలుగా భ్రమించడం అపూర్వ కల్పన. చాలా సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. రామదాసు యజమాని చౌదరి పాత్ర మంచితనం అరుదైనది కానీ అసహజం కాదు. యాస సహజంగా ఉంది. సంభాషణలు బాగున్నాయి. దర్శకత్వం ప్రతిభావంతం.   

మా పసలపూడి కథలు స్వాతిలో ఆర్జించిన ఘనకీర్తిని- బుల్లితెరపై కూడా కొనసాగిస్తున్నాయి. అభినందనలు.

ప్రస్తుతం కొనసాగుతున్న కథ లంకలపల్లి కృష్ణవేణి (104)

Leave a Reply

%d bloggers like this: