జూలై 28, 2011

ఆరంజ్- చిత్ర సమీక్ష

Posted in బుల్లితెర-వెండితెర at 5:01 సా. by వసుంధర

ప్రేమకి కథ లేకపోయినా ఫర్వాలేదు- రంగుంటే చాలుననుకున్న నాగబాబు (నిర్మాత), భాస్కర్ (దర్శకుడు- బొమ్మరిల్లు ఫేం) తెలుగు ప్రేక్షకులకిచ్చిన కానుక ఆరంజ్ (ప్రేమ వర్ణం).
ప్రేమ ఎక్కువ కాలం కొనసాగితే- ప్రియురాలికి అనుగుణంగా తన ఇష్టాయిష్టాలు మార్చుకోవాలనీ, తద్వారా వ్యక్తిత్వం కోల్పోవాల్సి వస్తుందనీ హీరో భయం. ఆందుకని అతగాడు ఎవరినైనా కొంతకాలమే ప్రేమించాలని నిర్ణయించుకున్నాడు. అలా తొమ్మండుగురు అమ్మాయిల్ని ప్రేమించాడు. ప్రేమ దాహం ఇంకా తీరలేదు. జీవితంలో అబ్బాయి తోడు కావాలనీ- ఆ ప్రేమ జీవితాంతం ఉండాలనీ కోరుకునే హీరొయిన్ ఆతడికి తటస్థపడుతుంది. ఇద్దరికీ తొలిచూపులోనే ప్రేమ పుడుతుంది. కానీ అది కొన్నాళ్లే అంటాడు హీరో. అలా కుదరదంటుంది హీరొయిన్.
ఇదీ కథ. దీన్ని సినిమాగా తియ్యాలంటే బలమైన సన్నివేశాలు కావాలి. అద్భుతమైన నటన అవసరం. ప్రకాష్ రాజ్ వంటి అసాధారణ నటుడు కూడా బలమైన పాత్రలో జోకర్‌లా అనిపించిన ఈ చిత్రంలో జెనీలియా- తాను బొమ్మరిల్లు పరిధుల్ని దాటి నటించలేనని మరోసారి ఋజువు చేసింది. అతడు, పోకిరి లాంటి సినిమాల్లో మహేష్‌బాబు తరహా నటన అవసరమైన ఈ సినిమాలో రాం చరణ్ తేజ నటనలో తనకింకా పరిణతి రాలేదని ఋజువు చేశాడు. బ్రహ్మానందం తన ప్రయత్నం తాను చేశాననిపించాడు. నాగబాబు పాత్ర, నటన చిత్రానికి అందాన్నిచ్చింది.
సంభాషణలు అర్థవంతం అనలేము కానీ బాగున్నాయి. పాటల్లో తెలుగుతనం లేకపోయినా వినడానికి బాగున్నాయి. చూడ్డానికి ఫర్వాలేదు.
కథ లేకున్నా, నటనలు సుమారైనా- చిత్రాన్ని మరీ ఎక్కువగా విసుక్కోకుండా ప్రేక్షకులు చూడగలిగితే అది దర్శకత్వపు ప్రతిభ అనవచ్చు. అంతమాత్రాన ఈ చిత్రం దర్శకత్వపు ప్రతిభకు మచ్చు అనలేము.
ఆ మధ్య మాటివిలో వచ్చిన ఈ సినిమా చూస్తే రామ చరణ్ తేజను ఒకందుకు అభినందించాలి అనిపించింది. అది మగధీర హిట్ అయిందని- ఆ రేంజ్ కి పోక ఆరంజ్ కి పోక విభిన్న పాత్రను ఎన్నుకోవడం.
ఈ సినిమా హిట్ ఐతే ఖుషి చిత్రం పవన్ కళ్యాన్ కి చేసిన కీడు రామ చరణ్ తేజకు చేసేది. చిత్ర పరాజయం హీరోపై అభిమానంతో- ప్రేక్షకులు ప్రదర్శించిన  దూరదృష్టికి నిదర్శనం.             
 

Leave a Reply

%d bloggers like this: