ఆగస్ట్ 1, 2011
మిస్టర్ పెర్ఫెక్ట్- చిత్ర సమీక్ష
కుటుంబ కథలు, సందేశం- దిల్ రాజు నిర్మించే చిత్రాల ప్రత్యేకత. మిస్టర్ పెర్ఫెక్ట్ కూడా అటువంటిదే ఐనా దీనికి మరికొన్ని ప్రత్యేకతలున్నాయి.
కథ: ఆరంజ్ చిత్రానికి దగ్గిర్లో ఉండే కథ. హీరో ప్రభాస్‌కి తనకి తానుగా జీవించడం ఇష్టం. హీరోయిన్ కాజల్ అతడికి బాల్యస్నేహితురాలు, బంధువు, పెద్దలు నిర్ణయించిన వధువు. ఆమె ఆశయాలు అతడికి భిన్నం. ఐనా అతడికోసం అన్నీ వదులుకుందుకు సిద్ధపడుతుంది. తనకోసం అల్లా చెయ్యాలనుకున్న ఆమె వ్యక్తిత్వం అతడికి నచ్చలేదు. ఆమెని నిరాకరించి తను కోరిన లక్షణాలున్న తాప్సీని ఇష్టపడతాడు. తాప్సీ తండ్రి ప్రకాష్ రాజ్‌కి ప్రభాస్ మీద సదభిప్రాయం లేదు. అందుకని ఓ పరీక్ష పెడతాడు. కరణ్ జోహార్ చిత్రాల తరహాలో ఓ ఇంట ప్రకాష్ రాజ్ బంధువులు చాలామంది చేరతారు. వారందర్నీ మెప్పించడానికి హీరో చేసిన ప్రయత్నాలు, చివరికి ప్రభాస్ కాజల్‌నే ఇష్టపడడం- మిగతా కథాంశం.
చిత్రంలో ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. అక్కడి దృశ్యాలకు తీసిపోని తెలుగు గ్రామీణ వాతావరణాన్ని చూపడం హర్షణీయం, గర్వ కారణం. విదేశాల్లో ఎక్కువకాలం మసలిన భారతీయుడిగా ప్రభాస్ ఆహార్యం, నటన చాలా గొప్పగా ఉన్నాయి. ఈ చిత్రం ప్రభాస్‌కి నటుడిగా ఓ మైలురాయి కాగలదు. కాజల్ అందంగా, మనోహరంగా ఉంది. తాప్సీ తన పాత్రలో ఇమిడిపోయింది. బ్రహ్మానందం, రఘుబాబుల కామెడీ ఆసక్తికరం అనిపించదు. కాశీవిశ్వనాథ్-సమీర్ ల కామెడీ బాగుంది. ప్రకాష్ రాజ్, శాయాజీ షిందే తమ పాత్రలకు వన్నె తెచ్చారు. కె. విశ్వనాథ్ మూస పాత్రల నటుడు ఐపోయారు. ఐనా ఆయన సమక్షం చిత్రానికి నిండుతనాన్నిచ్చింది.
తెలుగు వాతావరణంలో కూడా తెలుగుతనం లోపించినా నేటి అభిరుచికి అనుగుణం అనుకుంటే దేవిశ్రీ ప్రసాద్ పాటలు లయబద్ధంగా బాగున్నాయి.
సందేశం గొప్పది. అందుకు తగినంత గొప్పగా లేకపోయినా కథ ఫర్వాలేదు. ఇంటర్వల్ ముందు ప్రేక్షకులకి చిన్న షాకు. ఆ తర్వాతనుంచి ముందేం జరిగిపోతుందో ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంటుంది. ఐనా విసుగు పుట్టకపోవడం దర్శకుడు దశరథ్ ప్రతిభ.
కుటుంబ సమేతంగా చూడగలిగే వ్యాపారాత్మక, సందేశాత్మక, ప్రయోజనాత్మక, వినోదభరిత చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన దిల్‌రాజు, దశరథ్‌లకు అభినందనలు.
karthik said,
ఆగస్ట్ 1, 2011 at 8:21 సా.
http://chitram.maalika.org/%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AB%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95/
వసుంధర said,
ఆగస్ట్ 2, 2011 at 8:48 ఉద.
మీరు పంపిన లంకె బాగుంది. ధన్యవాదాలు.