ఆగస్ట్ 8, 2011

రంగం- చిత్ర సమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 4:30 సా. by వసుంధర

 సినిమాకి కథ ఎంత ముఖ్యమో గ్రహించినవారి చేతిలో- కథ ఎంతగా రాణిస్తుందో తెలుసుకుందుకు తప్పక చూడాల్సిన మంచి చిత్రం రంగం.
నేటి వార్త అనే పత్రికలో అశ్విన్ ఫొటో జర్నలిస్టు. రేణుక, సరోలు విలేకరులు. వసంత్ అవినీతి లేని రాజకీయాలకై పోరాడుతున్న విద్యావంతుడైన యువనాయకుడు. అతడికి అశ్విన్, రేణుక, సరోల మద్దతు ఉంది. ఒక బాంబు ప్రేలుడులో సరో మరణిస్తుంది. అప్పుడు వసంత్ స్పందించిన తీరుకి- ప్రజల్లో అతడికి మద్దతు పెరిగి ముఖ్యమంత్రి ఔతాడు. అప్పుడు కథ కొత్త మలుపు తిరుగుతుంది. మధ్యలో అశ్విన్-రేణుక-సరోల్ త్రికోణపు ప్రేమ. అశ్విన్ రేణుకనే ఇష్టపడతాడు.
అశ్విన్‌గా జీవా ఉడుకు రక్తాన్నీ, ఉరకలు వేసే యువ హృదయాన్నీ ప్రదర్శించడంలో అద్భుతంగా రాణించాడు. కొన్నిచోట్ల ప్రముఖ నటుడు సిద్ధార్ధలా అగుపించాడు. రేణుకగా కార్తీక నటించింది. కేవలం గ్లామరుకే పరిమితమయ్యే హీరోయిన్లతో విసిగిపోయినవారికి ఆమె గొప్ప రిలీఫ్. ముఖంలో అందం, కళ్లలో తెలివి ఆమె ప్రత్యేకత. తెలుగు తెరకు ఈ తరహా హీరోయిన్లు లభిస్తే మన సినిమాకు గత వైభవం రావచ్చు. సరో రూపకల్పన, పాత్రచిత్రణ దర్సకుడి సమకాలీనతకు నిదర్శనం. నేటి యువతలో కొందర్ని ప్రతిబింబించే కొత్త తరహా పాత్ర సరోగా పియా- పాత్రను అర్థం చేసుకుని నటించింది. వసంత్‌గా అజ్మల్ బాగున్నాడు. దుష్ట రాజకీయ నాయకులుగా కోట, ప్రకాష్‌రాజ్ తమ పాత్రల్ని ఒప్పించారు.
ఇది తమిళంనుంచి తెలుగులోకి డబ్  చెయ్యబడ్ద చిత్రం. మాటలు, పాటలు ఇది డబ్బింగు చిత్రమని చెప్పకనే చెబుతాయి. హారిస్ జయరాజ్ వరసలు, పాటల చిత్రీకరణ బాగున్నాయి.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- ఆనంద్. ఆ మూడు రంగాల్లోనూ అద్భుతంగా రాణించిన ఆయనకు అభినందనలు. మే 13న విడుదలై ఇంకా నడుస్తున్న ఈ చిత్ర విజయం కథల పరంగా తెలుగు చిత్ర నిర్మాతల్ల్లో మంచి మార్పుకి దోహదం చేస్తుందని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: