ఆగస్ట్ 9, 2011

100% లవ్- చిత్ర సమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 4:03 సా. by వసుంధర

 ఎప్పుడూ క్లాసులో ఫస్టొచ్చే ఓ పట్నం బాలు. చదువంటే అంతగా ఆసక్తి లేని ఓ పల్లెటూరి మహాలక్ష్మి. ఇద్దరూ బావామరదళ్లు. ఒకే కాలేజిలో చేరారు. ఇద్దరికీ పరస్పరం ప్రేమ. కానీ బయటపడ్డానికి అహం. వీళ్లిద్దరూ కలవాలంటే- అమ్మాయి చదువులో, తెలివిలో అబ్బాయిని మించాలి. చదువయ్యాక వ్యాపారంలో దెబ్బతిన్న అబ్బాయికి చెయ్యందించి విజయం సాధించి పెట్టాలి. అప్పటికీ అబ్బాయి అహం దిగకపోయినా మన్నించాలి. తను త్యాగమూర్తి కావాలి. అహంకారంతో విడిపొయిన బాలు తాత, బామ్మ ఒకటవ్వాలి. కలపాల్సింది హీరో హీరోయిన్లని కదా- అన్నీ జరుగుతాయి. అదీ కథ.
కథ వినడానికి అస్తవ్యస్తంగా, అసహజంగా అనిపించొచ్చు. చూడ్డానికి అనిపించదు. కాలేజి దృశ్యాలు వాస్తవానికి అద్దం పట్టవు. కానీ వినోదాన్ని అందిస్తాయి. బాలు, బాలు ప్రత్యర్ధి, మహాలక్ష్మి- ముగ్గురూ ఏదో సందర్భంలో ఫస్టు రాంకర్సు ఔతారు- కానీ వారి పద్ధతులు సినిమాలో చూడ్డానికి బాగున్నా- కాలేజిలో అనుసరణకు సాధ్యం కావు- సాధ్యమైతే ఫలితాన్నివ్వవు. బాలు ఇంట్లో చేరిన అల్లరి పిల్లల చేష్టలు మనింట్లో ఐతే తప్పకుండా ఏవగించుకుంటాం. ఐనా సినిమాలో అన్నీ వినోదాన్నిస్తాయి.
నాగచైతన్యని చూస్తే- ‘నాకొచ్చినవి రెండో మూడో పోజులు- వాటినే నటన అనుకుని సద్దుకుపొండి’- అన్నట్లుంటుంది. కానీ ఎ మాయ చేశాడో- ఈ పాత్రకి అతికినట్లు సరిపోయాడనిపిస్తుంది. ఏ మాత్రం తెలుగమ్మాయిలా లేని తమన్నాని పల్లెటూరి తెలుగమ్మాయిగా చూపించడం- తెలుగువారికే చెల్లింది అనిపించినా- తన ఉనికితో ఆమె ప్రేక్షకులకు ఊపిరాడనివ్వదు. గొప్పగా నటించింది అనిపించదు కానీ కొంచెం గ్లామర్, కొంచెం నటన, కొంచెం చిలిపి, కొంచెం నెమ్మది- అన్నింటినీ సమపాళ్లలో ఇమిడ్చిందామె. ఇతర నటీ నటులు తమ పాత్రల్ని ఒప్పించారు. మిగతా వారిలో కె ఆర్ విజయ, విజయకుమార్ ల జంట హాస్యాస్పదంగా అనిపించారు. కానీ కథ విలువ వారివల్లే పెరిగి ఉండొచ్చు.
దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో జోరుంది. ఐనా అన్ని తరాలవారినీ అలరిస్తుంది.
గతంలో దృశ్యాల్లో నేపథ్యానికి- సరిగమ స్వరాల్ని పలికించడం రాఘవేంద్రరావు ఆరంభించారు. అడుగడుగునా హీరోని (ఛత్రపతిగా) ప్రస్తావించే నేపథ్యాల్లో ప్రేక్షకుల్ని హత్తుకున్నది రాజమౌళి. ఇందులో ఎ స్క్వేర్ బి స్క్వేర్ అంటూ పదేపదే చూపించడం- కొందరికి విసుగనిపించినా ఓ కొత్త ట్రెండు. 
ఈ చిత్రం పూర్తిగా దర్శకుడు సుకుమార్ కి చెందుతుంది. ఏ విధంగా ఎందుకు గొప్పదో చెప్పలేకపోయినా- హాల్లోంచి బయటకు రాగానే కొత్త తరహా మంచి చిత్రాన్ని చూశామన్న తృప్తినివ్వడం సామాన్యమైన విశేషం కాదు. మూడింట నాలుగు ఘనవిజయాలు సాధించిన దర్శకుడు కాబట్టి ఇది కాకతాళీయమూ అనలేం. ప్రేక్షకుల నాడి తెలిసిన వారనుకోవాలి. ఐతే ప్రతి చిత్రం బాగా ఆడ్డమే కాక ఆర్య చిత్రమంత గొప్పగానూ అనిపించేలా వీరి చిత్రాలుండాలని మా కోరిక. ఆ మేరకు వారికి మా శుభాకాంక్షలు.
మే 6న విడుదలైన ఈ చిత్రం ఇంకా కొనసాగుతోంది. ఇంతవరకూ చూడనివారుంటే థియేటర్ కి వెళ్లి తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.

Leave a Reply

%d bloggers like this: