ఆగస్ట్ 24, 2011

దడ- చిత్ర సమీక్ష

Posted in బుల్లితెర-వెండితెర at 5:56 సా. by వసుంధర


ప్రపంచాన్నే వణికించే ఓ కెల్లీ. అతడికి అమ్మాయిల్ని అమ్మే మహా గూండా ఆర్డీ. వీళ్లని అవలీలగా ఎదిరించి ఆడుకునే ఓ విశ్వా. అతడి ప్రేమలో పడ్డ ఓ రియా. ఆమె పెళ్లిని కూడా వ్యాపారంగా భావించే తండ్రి. ఆమెని పెళ్లాడ్డానికి సిద్ధంగా ఉన్న ఓ బిలియనీరు. బిలియనీరైనా అతడు రియా కోసం నడి రోడ్డుమీద గూండాలా ప్రవర్తించగలడు. విశ్వాని ప్ర్రాణంకంటే ప్రేమించిన అన్న రాజీవ్. అతడు పరిస్థితుల ప్రభావం వల్ల పిల్లనిచ్చిన మామని చంపి- ఆర్డీ దగ్గిర పని చేస్తున్నాడు. మధ్యలో బ్రహ్మానందం-ఆలీలు నవ్వించదానికి కితకితలు పెట్టే ప్రయత్నాలు. చివరికి మంచివాళ్ళకి మంచి, చెడ్డవాళ్లకి చెడు జ్రుగుతుంది. హీరో హీరోయిన్ల ప్రేమ ఫలిస్తుంది.
ఇదీ ఏ మాత్రం కొత్తదనం లేని దడ చిత్రకథ. ఇలాంటి కథలో ఎలాంటి సన్నివేశాలుంటాయని ఊహించచ్చో అవే ఉంటాయి.
నాగచైతన్యని లవర్ బాయ్ నుంచి మాస్ హీరోగా మార్చాలన్న తాపత్రయం అడుగడుగునా కనిపిస్తుంది. తనకున్నవి రెండో మూడో పోజులే ఐనా నాగచైతన్య ఏమాత్రం విసిగించకపోవడం మెచ్చుకోతగ్గ విశేషం. ఫైట్సులో చాలా బాగా ఒప్పించాడు. కొద్దిగా పెరిగిన లేత గడ్డం కూడా భావప్రకటనలో లోపాల్ని కమ్మడానికి కొంత సహకరించింది. నిజం చెప్పాలంటే అతడు ఈ చిత్రంలో లవర్ బాయ్ కంటే ఫైటింగ్సులోనే ఎక్కువ బాగున్నాడు. ఐతే ఇలాంటి పాత్రలకి బలంగా డైలాగు చెప్పే నేర్పు అవసరం. ఆ విషయమై కృషి చేయడం చాలా అవసరం.
కాజల్ చెప్పుకోతగ్గ అందగత్తె ఐనా ఈ చిత్రంలో ఆధునిక దుస్తులు చాలాచోట్ల ఆమెకు నప్పలేదు. చిరునవ్వుతో యువ హృదయాల్ని ఉర్రూతలూగించగల శక్తి ఆమెకుంది. ఆమె వళ్లు చూపిస్తుంటే అమాయకత్వంపై అత్యాచారం జరిగినట్లు అనిపించింది. ఈ చిత్రంలో చనిపోయే తల్లికోసమూ, బ్రతికున్న తండ్రి ప్రేమ కోసమూ తపించే పాత్ర ఆమెకి లభించింది. ఆమె నటన ఆ తపనని ఏమాత్రం ప్రకటించలేకపోయింది.
రాహుల్ దేవ్, ముఖేష్ రిషిల నటన పాత చిత్రాల సన్నివేశాలకు అనుకరణ అనిపిస్తుంది. సరైన సన్నివేశాలు లేకపోతే- బ్రహ్మానందం, ఆలీ- ఎంత పేలవంగా అనిపిస్తారో ఈ చిత్రం చూసి తెలుసుకోవచ్చు. విశ్వా అన్న, వదినెలుగా శ్రీరాం, సమీక్ష ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తారు. వారిని అభినందించాలి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు– స్టెప్సుకి అనుగుణం. సినిమా హిట్టైతే గుర్తుంటాయేమో మరి. ఏమైనా పాటల డోసు ఎక్కువనిపించింది- ముఖ్యంగా ఇంటర్వల్ తర్వాత.
పూర్తిగా విదేశాల్లో తియ్యబడ్డ ఈ చిత్రం ఎక్కువభాగానికి అమెరికా నేపథ్యం. అది కనుల పండువగా తీశారు. లొకేషన్స్ ఎంపిక అభినందనీయం. నీటి లోపల హీరో, హీరోయిన్లతో చిత్రీకరించిన దృశ్యాలు  పేలవంగా అనిపించాయి.
ఈ చిత్రం అజయ్ భుయాన్ ని మంచి భవిష్యత్తు ఉన్న దర్శకుడిగా పరిచయం చేస్తుంది. మొదటి సగం హాలీవుడ్ చిత్రాల స్థాయిలో అనిపిస్తుంది. కథ లేకపోయినా, క్లైమాక్స్ ఫన్నీగా అనిపించినా కూడా ఈ చిత్రం చూడ్డానికి విసుగనిపించదు. చివరి పది పదిహేను నిమషాలే భరించడం కాస్త కష్టం.
చిత్రం చివర్లో హీరో అన్నయ్యతో, ‘మనం వాళ్లకి భయపడ్డం కాదు. మనమంటే వాళ్లకే దడ పుట్టాలి” అంటాడు. అంత బలమైన డైలాగుని పేలవంగా చెప్పడం నాగచైతన్య లోపమైతే- అది చెప్పిన ఇరవై నిముషాల్లోపల చిత్రం ముగిసిపోవడం దర్శకువి పొరపాటేనని చెప్పాలి. నిజానికి ఆ డైలాగ్ చిత్రం ఆరంభంలో వినిపించి- చిత్రం మొత్తం విలన్లకీ తద్వారా ప్రేక్షకుల్లోనూ దడ పుట్టించేలా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసి ఉంటే- ఇది మరో “కిక్” అయుండేదని స్వాభిప్రాయం.
ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదలైంది. కాలక్షేపానికి ఒకసారి థియేటర్లో చూడాలి- అనుకునేవారు త్వరపడాలి మరి!      

Leave a Reply

%d bloggers like this: