సెప్టెంబర్ 14, 2011

కందిరీగ- చిత్ర సమీక్ష

Posted in బుల్లితెర-వెండితెర at 7:39 సా. by వసుంధర

 సినిమాకి కథేంటీ అంటారు కొందరు. సినిమా కథకి కొత్తదనమేంటీ అంటారు కొందరు. ఐనా ఎంత బాగుందో అనాలి అందరూ. అదీ కందిరీగ.
అనగనగా ఓ శీనుగాడు. వాదికి చదువూ సంధ్యా లేకపోయినా పెళ్లి కావాలి. తనకి పెళ్లయ్యేదాకా ఊళ్లో పెళ్లిళ్లన్నీ చెడగొట్టాలని కంకణం కట్టుకున్నాడు. ఆ బాధ చూడలేక మేనమామ తన కూతుర్నే ఇస్తానన్నాడు. కానీ చదువుకున్న మరదలు ఛీకొట్టింది. పౌరుషమొచ్చి చదివేందుకు పట్నం వచ్చి శృతిని చూసి ప్రేమలో పడ్డాడు. శృతినిష్టపడ్డ పెద్ద గూండా భవానీని ట్రిక్ చేయడం సినిమా మొదటి సగం. భవానీ కంటే పెద్ద గూండా కూతురు సంధ్య శ్రీనుని ప్రేమించడం, శ్రీను ఆ సమస్యని పరిష్కరించుకోవడం సినిమా రెండవ భాగం.
ఈ సినిమాకి ప్రాణం పోసింది ఇద్దరే ఇద్దరు. ఒకరు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. రెండు హీరో రామ్. అదర గొట్టడానికి నిర్వచనం ఈ ఇద్దరి ప్రతిభ.
రామ్ ఆడినా, పాడినా, మాట్లాడినా, ఫైట్లాడినా- ఆ వేగం, టైమింగు, భావప్రకటన- అన్నీ సుపర్బ్. నవ్విస్తూ భయపెట్టిన సోనూ సూద్ (భవానీ) ఆ తరహా పాత్రను నభూతో నభవిష్యతి అన్నట్లు ఒప్పించాడు. ఇంచుమించు అలాంటి పాత్రలో జయప్రకాష్ రెడ్డి (రాజన్న) తనదైన శైలిలో రాణించాడు. బొద్దుగుమ్మ అనిపించే హంసిక (శృతి) ఐనా బాగుంది. తెలంగాణ యాసలో సహజత్వాన్ని నింపిన అక్ష (సంధ్య) నటన, మాట కూడా అభినందనీయం. పాత్ర చిన్నదైనా మెరుపై మెరిశాడు బ్రహ్మానందం. పాత్ర పెద్దదైనా ఓ వెలుగు వెలిగాడు రఘుబాబు. ఇక ఈ చిత్రంలో ఎక్స్‌ట్రాలతో సహా నటీనటులందరూ తమ పాత్రల్ని ఒప్పించిన తీరు అపూర్వం.
ఉండాలి కాబట్టి ఉన్నాయనిపించే ఈ చిత్రంలో పాటల్ని ఏ చిత్రానికైనా వాడుకోవచ్చు. చిత్రీకరణలో కొంత సృజనాత్మకత  లేకపోలేదు.
మాటలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. “ఏయ్- ఆంధ్రా బాంకూ- నీ కూతురు నా ఫిక్సెడ్ డిపాజిట్టు. మెట్యూరైంది- తీసుకుపోతున్నా” వంటి చమత్కారం- సినిమా మొత్తం వినిపిస్తుంది. చివరి సన్నివేశం వరకూ వినోదాన్ని పంచిపెట్టిన ఈ చిత్రాన్ని- హింసలో శృతి మించకపోతే- అలనాటి పెళ్లి చేసి చూడు, మిస్సమ్మల సరసన ఉంచొచ్చు. ఆగస్ట్ 12న విడుదలైన ఈ సినిమా బాగా హిట్టైంది. ఈ చిత్రంలో హింసను అందుకు కారణంగా భావించవద్దనీ, మున్ముందు ఈ సంస్థ, దర్శకులనుంచి హింస రహిత వినోదాత్మాక చిత్రాలు రాగలవనీ ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: