అక్టోబర్ 25, 2011

దూకుడు- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 5:19 సా. by వసుంధర

మాఫియానీ, హత్యల్నీ, నేరాల్నీ- హాస్యంతో మిళితం చెయ్యడంలో తనదంటూ ఒక ముద్ర వేశాడు యువ దర్శకుడు శీను వైట్ల. ఢీ చిత్రంతో అద్భుతంగా మొదలైన ఈ సంవిధానం మరిన్ని చిత్రాలలో కొనసాగి- అంత గొప్పగా అనిపించకపోయినా విజయవంతం కావడం విశేషం. ఇతర దర్శకులు కూడా ఈ పద్ధతిని ఆదర్శప్రాయంగా తీసుకుని విజయాలు సాధించడంతో అది హిట్‌ ఫార్ములాగా కూడా మారింది. శీను వైట్ల తన హిట్‌ ఫార్ములాని మరోసారి తనే అనుసరించి ప్రేక్షకులకి అందించిన చిత్రం దూకుడు.

ఈ కథకి మూల పురుషుడు శంకర నారాయణ. ప్రజల మనసుని దోచుకున్న మహా నాయకుడాయన. కొందరు నయవంచకులు, ఒక దుర్మార్గుడు కలిసి ఆయన్ని చంపబోతే ఆ ప్రమాదంలో ఆయన కోమాలోకి వెళ్లిపోతాడు. అప్పుడాయన కొడుకు అజయ్‌ చిన్నవాడు. అతడే కథానాయకుడు. పెరిగి పెద్దవాడై తండ్రి ఆశయానికి విరుద్ధంగా పోలీసు ఆఫీసర్‌ అయ్యాడు. అప్పటికి శంకర నారాయణ కోమాలోంచి తేరుకున్నాడు. ఆయనకు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేవరకూ- అజయ్‌ తాను ప్రజానాయకుడై ప్రజాసేవ చేస్తున్నట్లు తండ్రిని నమ్మించాల్సి వస్తుంది. ఆయన్ని భ్రమలో ఉంచడం కోసం అజయ్‌ ఆడిన నాటకంలో- శత్రువులపై ప్రతీకారం కూడా కలుస్తుంది.

ఒక జర్మన్‌ చిత్రకథ ఆధారమని కొందరంటున్న ఈ చిత్రకథలో ఉత్కంఠ ఉంది. హాస్యం ఉంది. చమత్కారం ఉంది. లేనిది అర్థం ఒక్కటే. ఐనా నిర్మాతకు అపరిమితంగా అర్థం తెచ్చిపెట్టేలా రూపొందింది. దానికి ముఖ్యకారణం హీరో మహేష్‌బాబు. వయసు మూడు పదులు దాటినా చూడ ముచ్చటగా ఉన్నాడు. ప్రేమలో చిలిపితనం, చిరునవ్వులో హుందాతనం, పోరాటాల్లో వేగం, పలుకులో సహజత్వం- మొత్తంమద చిత్రంలో అడుగడుగునా తనే ఆకర్షణగా ఉన్నాడు. చెప్పాలంటే ఇది పూర్తిగా అతడి చిత్రం. డాన్సులు మాత్రం- కేవలం అభిమానులకోసం అనిపిస్తుంది. నడక, కదలిక  మనోహరంగా ఉన్న హీరో- పాటల్లో స్టెప్స్‌ వేసి తీరాలన్న నియమం లేకపోతే- మన హీరోల్లో కొందర్ని స్పాట్‌లెస్‌ అనొచ్చు. ఈ చిత్రంలో తక్కువ స్టెప్స్‌ వేసిన పాటల్లోనే మహేష్‌ అలరించాడన్నది నిజం.

ఈ చిత్రలో కథానాయిక సమంతా పాత్రకి ప్రత్యేకత లేదు. తీగకి చెట్టులా హీరో ఆలంబన లేకపోతే ఆమెకి ఉనికి లేదు. హీరో సరసన కేవలం గ్లామర్‌ కోసమే ఎన్నుకోబడిన కథానాయకి ఆమె. ఐనా కళ్ల్లలో తెలివి, ముఖంలో అభినయం ఆమెని ఇతర కథానాయకిలకి భిన్నంగా రూపొందించాయి. చిత్రంలో ఆమె ఉనికి అభినందనీయం.

బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణలు రొటీన్‌ హాస్యాన్ని ప్రతిభావంతంగా పండించారు. సోనూ సూద్‌ తన పాత్రకి ప్రత్యేక విలువని ఆపాదించాడు. ప్రకాష్‌రాజ్‌ నటనకి అవకాశమున్న పాత్రలో రొటీన్‌గా అనిపించాడు. శాయాజీ సింధే తన ఉనికిని నిరూపించుకుంటాడు. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.

కొన్నిచోట్ల మాటలు రచయితలో పసకంటే పాత్రధారుల టైమింగువల్ల ఎక్కువ రాణించాయి. మైండ్‌ సెట్టైతే బ్లైండ్‌గా వెళ్లిపోతాను లాంటి డైలాగ్స్‌లో- మహేష్‌కోసం పోకిరి తాపత్రయం కనిపిస్తుంది. అక్కడక్కడ మోటుగా అనిపించినా అసభ్యత లేదు. మొత్తంమీద సంభాషణలు బాగున్నాయనే చెప్పాలి.

పాటల్లో చిత్రీకరణ ప్రతిభ తెలుస్తుంది. మీనాక్షి దీక్షిత్‌ దూకుడు ఐటమ్‌గా గుర్తింపు పొందుతుంది. వినడానికి విత్రవిజయంమీద ఆధారపడ్డ వరసలివి. 

అశ్లీలతకీ, అసభ్యతకీ తావివ్వని ఈ కుటుంబ చిత్రంలో మోతాదుకు మించిన హింస అవసరమా అనిపిస్తుంది. చిమ్మే రక్తం, చితకబాదుడు జుగుప్సాకరంగా అనిపించాయి. అవి లేకుండా పోరాటాల్ని ఉత్కంఠభరితంగా తీసే ప్రతిభ మన వాళ్లకి లేదనిపిస్తుంది. ఐతే నేరాన్ని ప్రేక్షకులమీదకి నెట్టెయడం వాళ్లకెలాగూ అలవాటే!

ఈ చిత్రం మహేష్‌బాబుది మాత్రమే కాదు, దర్శకుడు శీను వైట్లది కూడా. హాల్లో కూర్చున్నవారికి చూస్తున్నంతసేపూ చక్కని కాలక్షేపం అనిపించే ఈ చిత్రంలో ప్రేక్షకులకి కాలక్షేపానికీ, నిర్మాతకి కనకవర్షానికీ మించిన ధ్యేయం కనిపించదు. సెప్టెంబర్‌ 23న విడుదలై విజయదుందుభి మ్రోగిస్తున్న ఈ చిత్రం ఆ మేరకి ధ్యేయాన్ని సాధించింది. చక్కని ఒరిజినల్‌ కథనీ, ప్రతిభకు పట్టంకట్టే సంభాషణల్నీ ఎన్నుకుని- అర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా సూపర్‌ హిట్‌ చిత్రాల్ని రూపొందించే గొప్ప చిత్రాలకోసం ఎదురు చూసేవారికి మాత్రం దూకుడు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. తెలుగువారు, తెలుగుతనం గర్వపడే చిత్రాలు తియ్యడానికి సత్తా ఉన్నా సరదా లేదని కొంత ఊరట కూడా దూకుడులో కలుగుతుంది. 

2 వ్యాఖ్యలు »

 1. శ్యామలరావు said,

  ఇతర తెలుగు సినమాలు యింకా చెత్తగా ఉండవచ్చు. అంతమాత్రం చేత ‘దూకుడు’ ఒక గొప్ప సినిమా అయిపోదు. నిర్మొగమాటంగా చెప్పాలంటే చెత్త సినిమాయే.

  ఒక మంచి సినిమా అంటే, ఒక భాషప్రజలు అనేక సంవత్సరాల తరువాతగూడా గొప్ప చెప్పుకొనే సినిమా. ఈ సినిమాకు అంత సత్తా ఉందంటారా? ఒక మాయాబజారు, ఒక గుండమ్మకథలాంటి సినిమాలాగా 50 సంవత్సరాలు గడిచాక గూడా మన తెలుగు సినిమాల్లో ఒక గొప్ప సినిమా అని చెప్పుకోగల సినిమాయేనా యిది?

  కలక్షన్ల గురించి మాట్లాడకండి దయచేసి. 1971లో దసరాబుల్లోడు సినిమాను 21 ప్రింట్లతో విడుదల చేస్తే అప్పట్లో అది రికార్డు. ఈనాడు వేలాది ప్రింట్లు వేసి ఒకవేళ సినిమా సరిగా గుర్తింపు పొందక పోయినా సాధ్యమైనంత తొందరగా సొమ్ము రాబట్టుకుందుకు ప్రయత్నించిపుడు సహజంగానే యేమాత్రం ఆడినా దండిగా డబ్బులొస్తాయని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.

  మంచి సినిమా తీసే ఉద్దేశ్యం, దమ్ము ఉన్న నిర్మాత దర్శకుడూ ఉంటే మూస కథలతో వెఱ్ఱి మొఱ్ఱి సినిమాలు తీసి గొప్పలు చెప్పుకునే దురవస్థ ఉండేది కాదు పరిశ్రమకు.

  • దూకుడు చెత్త సినిమా అనలేం కానీ చాలవరకూ మీ అభిప్రాయమే మాదీనూ. ఐతే సినిమాలు తీసేవాళ్లు పట్టించుకునేటంత మెజారిటీ మనం సాధించాల్సి ఉంది. అంతవరకూ తెలుగు చిత్రసీమకు దూకుడులే స్థితీ, గతీ!


Leave a Reply

%d bloggers like this: