అక్టోబర్ 26, 2011

ఊసరవెల్లి- చిత్రసమీక్ష

Posted in బుల్లితెర-వెండితెర at 5:48 సా. by వసుంధర

రామారావు, నాగేశ్వరరావు, చిరంజీవి తెలుగులో. రాజేష్‌ఖన్నా, అమితాబ్‌ బచ్చన్‌ హిందీలో. హీరొలుగా సూపర్‌స్టార్స్‌ కావడానికి ముందు వారు మామూలు పాత్రలెన్నో ధరించి నటనలో పరిణతి చెందారు. ఆపైన వారు చేసిందే నటన అని అభిమానులు ఆనందపడ్డారు కానీ- వారి పరిణతి సూపర్‌స్టార్‌ కావడంతోనే ఆగిపోయింది. సినీరంగంలో సూపర్‌స్టార్‌కి ఉన్న పరిమితుల కారణంగా- హీరోలకి ఆ హోదా నటన పరంగా పతనావస్థ అని చెప్పొచ్చు. మరి నేడు కొత్త తారలు ఆరంభంనుంచే సూపర్‌స్టార్స్‌గా ఆవిర్భవిస్తున్నారు. ఇక నటనపరంగా వారికి పతనమే తప్ప పరిణతికి అవకాశమెక్కడిది?

తెలుగునాట యువతరం నటుల్లో తనదంటూ ఓ ముద్ర వేసుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ సహజప్రతిభకి సూపర్‌స్టార్‌ పదవి ముళ్లకిరీటం అనే చెప్పాలి. అతణ్ణి మానవాతీతుడిగా చూపిస్తూ, అతడికో గొప్ప హిట్‌నివ్వడమే ఆదర్శంగా తీసిన చిత్రం ఈ అక్టోబర్‌ 6న విడుదలైన ఊసరవెల్లి.

కథలో హీరో టోనీ ఒక గూండా. తలచుకుంటే ఏమైనా చెయ్యగలడు. నీహారిక అనే అమ్మాయిని ప్రేమించి ఆమె ప్రేమని అందుకోవడానికి ఏమైనా చెయ్యగలగడం మొదటి భాగం. నీహారికని అతడెందుకు ప్రేమించాడూ అన్నది రెండవ భాగం. కథగా అర్థవంతం అనలేం కానీ- అల్లికలో జిగిబిగి ఉంది. మూసలో లేకపోవడంవల్ల ప్రేక్షకులకి కొంత తృప్తినీ ఇస్తుంది. అందుకు దర్శకుడు సురేందర్‌రెడ్డిని అభినందించాలి.

నటన పరంగా చూస్తే ఈ పాత్రలో ఎన్టీఆర్‌ని తప్ప వేరొకర్ని ఊహించుకోవడం కష్టం. చాలా సన్నివేశాల్లో అతడి ఉనికి, ఉరుకు, చురుకు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. ఐతే ఎన్టీఆర్‌ పాత్రలో లీనమైనట్లు తోచదు. క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్‌ ద్రవిడ్‌లా బాట్‌ చేసినట్లు అనిపిస్తుంది. డైలాగ్‌కి అంతగా ప్రాధాన్యం లేకపోవడం ఎన్టీఆర్‌కి నెగెటివ్‌ ఐనా- చిత్రానికి వాటిల్లిన నష్టం లేకపోవడం విశేషం. స్టెప్స్‌ ఎన్టీఆర్‌ ప్రత్యేకతే కానీ- అన్ని పాటల్లోనూ ఒక్కలాగే అనిపించి కాస్త విసుగు పుట్టించాయి. సూపర్‌స్టార్‌ లక్షణాలుండి ఆ భావనకు దూరం చేసే గొప్ప పాత్ర టోనీ. ఇలాంటి పాత్రల్లో జీవించ గలిగితే ఎన్టీఆర్‌ని పండితులూ, పామరులూ కూడా సమంగా అభిమానించగల్గుతారు.

కథానాయిక తమన్నా ఈ చిత్రంలో రూపకల్పనలో ఎక్కువగా మాధురీ దీక్షిత్‌ని తలపుకి తెస్తుంది. నటనకి ప్రాధాన్యమున్న ఈ పాత్ర ఆమె అదృష్టం. ఐతే అందానికి తగ్గ నటనా ప్రతిభ ఆమెకి లేదనిపిస్తుంది. ఆమె చెలిగా పాయల్‌ ఘోష్‌ అపూర్వంగా రాణించింది. మిగతావారిలో రఘుబాబుని ప్రత్యేకంగా చెప్పాలి. కామెడీకి తానొక్కడు చాలనిపించే దిశలో ఎదుగుతున్నాడీ నటుడు. ప్రకాష్‌రాజ్‌ పాత్ర, నటన కూడా చెప్పుకోతగ్గవి కాకపోవడం ఈ చిత్రం ప్రత్యేకత.  

మాటలు బాగున్నాయి. పాటలు లయబద్ధం. పాటల గొప్పతనం కోరియోగ్రాఫర్‌, కెమేరామన్‌లకి చెందుతుంది.  

అశ్లీలతకీ, అసభ్యతకీ తావివ్వకపోవడం విశేషం. పిల్లలు దడుసుకునేలా, పెద్దలకు జుగుప్స పుట్టేలా హింస. ఐతే రఘుబాబు బృందంతో ఫైటింగ్సు దర్శకుడి హాస్యస్ఫూర్తికి నిదర్శనం. హీరోకంటె ఎక్కువగా దర్శకుడి ముద్రని చూపించే ఈ చిత్రం ఆరంభం కొత్తగా ఉంది. ప్రేమకథ తమాషాగా కొనసాగింది. సస్పెన్సు ఊహకి అందదు. చాలా చోట్ల దర్శకుడికి జోహారనాలనిపిస్తుంది. ఐతే ఆసక్తికరమైన శాయాజీ పాత్ర క్లుప్తం కావడం, ప్రేమకథ సాగతీత, హీరోయిజానికి విలన్ల తలవంపు, తుస్సుమన్న క్లైమాక్సు- అసంతృప్తిని కలిగిస్తాయి. హీరోని ఊసరవెల్లితో పోల్చడానికి చిత్రం పొడుగునా తాపత్రయం కనిపిస్తుంది. సాహితీపరంగా ఊసరవెల్లిని నయవంచకులకి వాడతారని రచయితకీ, దర్శకుడికీ స్ఫురించినట్లు తోచదు.  కథని మరింత పకడ్బందీగా చేసుకుని, సన్నివేశాల్లో బలం చొప్పించి, క్లైమాక్స్‌ గొప్పగా ప్లాన్‌ చేసి ఉంటే- ఈ చిత్రం సిప్పీల షోలే లా అలరించి ఉండేది.

ఏదె ఏమైనా దూకుడుతో సమంగా నడవాల్సిన చిత్రమిది. దూకుడుకి మహేష్‌ ఇచ్చిన ఊపు- ఊసరవెల్లిగా ఎన్టీఆర్‌ ఇవ్వలేకపోయినా- అది చిత్ర విజయానికి ఆటంకం కాదు. కొంత అదృష్టం కూడా కావాలి.

కొత్తదనానికి తోడు మాటల్లో, పాటల్లో, ఆటల్లో తెలుగుతనపు తావికి తావిచ్చే చిత్రాలపై మన నిర్మాతలు, దర్శకులు దృష్టి పెట్టే మంచి రోజుకోసం ఎదురు చూస్తూ- ప్రస్తుతానికి ఏదో ఒకలా వినోదానికి సరిపెట్టుకుందుకు- ఊసరవెల్లి తప్పక సహకరిస్తుంది. 

Leave a Reply

%d bloggers like this: