అక్టోబర్ 31, 2011

నవరసాల అవసరాల అస్తమయం

Posted in సాహితీ సమాచారం at 12:56 సా. by వసుంధర

మానవ జీవితానికి నవరసాలు అవసరాలు. మానవరూపంలో వెలసిన దేవుడి అవతారాలకు సంబంధించి అవి రామకృష్ణులలో నిక్షిప్తాలు. సాహిత్యానికి అవసరాలు నవరసాలు. తెలుగు సాహితికి సంబంధించి అవి అవసరాల రామకృష్ణారావులో నిక్షిప్తాలు.
1960లలో రీసెర్చి చేస్తూ- వారి అందమైన ఆత్మహత్యని జ్యోతిలో అనుభవించి ఓహో అనుకున్నాం. ఆ తర్వాత వారి అయిదు రకాల ఆత్మహత్యలు పరిశీలించి ఓహోహో అనుకున్నాం. 1980లలో వారు ఏదో పనిమీద భువనేశ్వర్ వచ్చి అయినవాళ్లెందరో ఉండగా ఉండడానికి మా ఇంటిని ఎన్నుకున్నప్పుడు ఆహా అనుకున్నాం. వారు మాయింట కొద్ది వారాలుండవలసివస్తే ఆ సత్కాలక్షేపం ఆహా, ఓహోహో. అప్పుడు తెలిసిన మరో విశేషం- బాల్యంలో చెప్పడానికి మాటలు లేనంతగా అలరించిన గణిత విశారద (ఆంధ్రప్రభ వారపత్రికలో పిల్లల సీరియల్) రచయిత వారేనని తెలిసినప్పటి అనుభూతి చెప్పడానికీ మాటలు లేవు. ఆ తర్వాత 2003లో ఆ పుస్తకం అభిమానుల ద్వారా పునర్ముద్రణకు నోచుకున్నప్పుడు ముందుమాట వ్రాసే అవకాశం మా సౌభాగ్యం. మా బంధం అనుబంధమై అత్మీయతగా కొనసాగిన విధం ఒక మధురానుభవం. పలుమార్లు భువనేశ్వర్‌లోనూ, హైదరాబాదులోనూ కలుసుకున్నప్పటికీ- వారింట వారిని ఒకే ఒక్కసారి విశాఖపట్నంలో దర్శించుకున్నాం. ఇటీవల వారి మనుమరాలి వివాహమొక్కటే వారింట జరిగిన వేడుకల్లో మేము పాలు పంచుకున్నది. పిడికెడు అటుకులకు కుచేలుడు పొందిన ప్రతిఫలాన్ని ఆ రెండు అనుభవాలూ స్ఫురింపజేశాయి మాకు. తన భార్య శారద గురించి- నేను మనుషుల్లో పాత్రల్ని చూస్తే ఆమె దేవుణ్ణి చూస్తుంది- అన్న అక్షరసత్యాలు ఆయన అసాధారణ పరిశీలనాశక్తికి మరో నిదర్శనం. వయసుతో కాక కాలంతో నడిచే ఆయన ఆధునిక దృక్పథం ఎందరో కుహనా ఆధునికులకు కనువిప్పు. ఈ అక్టోబర్ 28న హృద్రోగంతో ఆయన కన్నుమూయడం ఎందరి గుండెల్నో బరువెక్కించి తెలుగు సాహితిని సజలనయన చేసింది. ఈ సందర్భంలో ఈనాడు (అక్టోబర్ 29) దినపత్రికలో ఈ కథాకదన భీష్ముడికి డా. అద్దంకి శ్రీనివాస్ అర్పించిన నివాళి అవసరాల వారి అసంఖ్యాక అభిమానుల మనోభావాల్ని అద్భుతంగా ప్రదర్శించింది.
అక్షరజాలంలో పరిచయం చెయ్యాలని వారికి మేము వ్రాసిన ఉత్తరానికి వారిచ్చిన బదులు, పంపిన జీవిత వివరాలు (ఆంగ్లంలో), ప్రతి ఒకడూ సూరీడే అనే వారి కథా ఇక్కడ అందజేస్తున్నాం.
ఆయన గురించి మన వీక్షకులతో పంచుకోవాల్సిన విశేషాలింకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఈ విషాదభారం తగ్గేక……   

Leave a Reply

%d bloggers like this: