నవంబర్ 11, 2011

అవసరాల రామకృష్ణారా​వు సంతాప సభ

Posted in సాహితీ సమాచారం at 5:21 ఉద. by వసుంధర

సాహితీ మిత్రులకు నమస్కారం
శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు ఈ మధ్యనే మరణించిన విషయం సాహితీ లోకానికి తెలిసిన విషయమే.
లెక్కలతో లెక్కలేనన్ని మేజిక్కులు చేసి ఎందరో పిల్లలతో పాటు పెద్దల మనసులను కూడా దోచుకున్న రామకృష్ణారావు గారు లెక్కల మేష్టారని అందరూ అపోహ పడడం సర్వ సాధారణం. వాస్తవానికి ఆయన ఇంగ్లీష్ లో రీడర్ గా పదవీ విరమణ చేశారు. వందల సంఖ్యలో కథలు రాశారు. వారి కథా సంపుటాల్లో రామకృష్ణ కథలు, అర్థమున్న కథలు, అయిదు రకాల ఆత్మహత్యలు, మనం మనుషులం, మోహన రాగం, నాకు నువ్వు నీకు నేను, పేక ముక్కలు మొదలైనవి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వీటిలో అర్థమున్న కథలు సంపుటికి 1969 లో ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డ్ వచ్చింది. శ్రీ రామకృష్ణారావు గారు కథలకు పేర్లు పెట్టడం చాల గమ్మత్తుగా వుంటుంది. తప్పించుకు తిరుగువాడు, ఎవడితో నైనా లేచి పోరాదూ, వాళ్ళాయన కామా సూత్రాలు, జై కు బహు వచనం జైలు.
 ఇలా ….. తన ప్రతి రచనలోనూ చమత్కారానికి పెద్ద పీట వేసి చదువరుల మనసులు దోచుకున్న ఆహ్లాద రచయిత రామకృష్ణారావు గారు. ఆయన రచనల్లోనే కాదు మాట్లాడిన ప్రతి మాటా, చమత్కార భూయిష్టంగా వుండి హాస్యరస స్ఫోరకంగా వుండేదని ఆయనతో పరిచయం వుండి ఆయనతో మాట్లాడిన  ప్రతి వారికీ  అనుభవైక విషయమే! ఆయన చనిపోవడానికి నాలుగు రోజుల ముందు కూడా “ఎందుకు మేష్టారు హైదరాబాదు వచ్చారని?” అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాదానం: “ నా గుండెకు రెండు చిల్లులు పడ్డాయట ఇక్కడ డాక్టర్లు పూడుస్తారని వచ్చాను. వాళ్ళు పూడిస్తే సరే సరి లేదంటే మా అబ్బాయిలు నన్ను పూడ్చేస్తారు.” మృత్యు ముఖంలో కూడా చమత్కారమే!
తన రచనా ప్రస్థానంలో రామకృష్ణా రావు గారు బాలసాహిత్యంలో చేసిన కృషి విశేషమైనది. అరవై ఏళ్ల క్రిందట ఆంద్రప్రభలో గణిత విశారద పిల్లల నవల సీరియల్ గా వస్తున్నప్పుడు చదివిన వారు జీవితాంతం దానిని మరువ లేరని తర్వాత్తర్వాత రుజువైంది. అంతే కాదు. 65 ఏళ్ల క్రితం తెలుగు పిల్లల మనుసులు దోచుకున్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చందమామ పిల్లల పత్రిక మొదటి సంచిక జులై 1947 లో కథ ప్రచురించబడి, వివరాలు లభించినంత వరకు ఆ సంచిక రూప కల్పనలో పాలు పంచుకొన్న వారిలో చివరి వ్యక్తీ. అనేక పిల్లల పత్రికల్లో ఆయన నిర్వహించిన మెదడుకు మెత పెట్టి, పిల్లల నాకట్టుకున్న శీర్షిక లెన్నో.
ఆయన మరణం బాలసాహిత్యానికి తీరని లోటు. ఈ సందర్భంగా బాలసాహిత్య పరిషత్తు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తూ ఆయన స్మృత్యర్థం సంతాప సభ ఏర్పాటు చేసింది.
తేది: 13-11-2011, ఆదివారం ఉ: 10 గంటలకు.వేదిక శ్రీ త్యాగరాయగానసభ మినీ హాలు. అవసరాల రామకృష్ణారావుగారి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరికీ ఈ విషయాన్ని తెలియ చేయ వలసినదిగా కోరుతూ ….. ఆనాటి  సభలో మీ మీ అనుభవాలను, స్పందనను, అవసరాల తో మీ అనుబంధాన్ని అందరితో  పంచుకో వలసినదిగా మనవి.

Dasari Venkata Ramana
General Secretary
Balasahitya Parishat
Ph: 04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

Leave a Reply

%d bloggers like this: