నవంబర్ 23, 2011

పిల్ల జమీందార్- చిత్రసమీక్ష

Posted in బుల్లితెర-వెండితెర at 4:58 సా. by వసుంధర

 ప్రస్తుతం మధ్యతరగతికి కాస్త ఎగువన ఉన్న యువతలో సామాజిక స్పృహ లోపిస్తోంది. ధనబలం పెరిగినకొద్దీ అహం పెచ్చుమీరుతోంది. అది సమాజానికి ప్రమాదకరం.
ఈ విషయమై యువతను హెచ్చరించడానికా అన్నట్లు రూపొందింది ఈ అక్టోబర్ 14న విడుదలైన పిల్ల జమీందార్ చిత్రం.
కథానాయకుడు ప్రవీణ్ జయరామరాజు. ముద్దుగా పిజె. అతగాడు ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైన పిల్లవాడు కాబట్టి పిజె అంటే పిల్ల జమీందారు కూడా. పిజెకి డబ్బుందని గర్వం. ఆ డబ్బుతో సాటి మనుషుల్ని తనకి బానిసల్ని చేసుకోగలనని నమ్మకం. పెద్దల్నీ, గురువుల్నీ గౌరవించాలని తెలియదు. ప్రేమ ఒక గొప్ప అనుభూతి అని తెలియదు. విలాసాలకి అలవాటుపడి అదే గొప్ప జీవితం అనుకుంటాడు. కానీ అతడి తాత చనిపోతూ ఓ వీలునామా వ్రాశాడు. ఆ ప్రకారం  పిజె ఒక పల్లెటూరి కాలేజిలో చేరి మూడేళ్లలో డిగ్రీ పూర్తి చెయ్యాలి. నెలకింతని ఇచ్చిన డబ్బు సరిపెట్టుకోవాలి. అప్పుడే ఆస్తి అతడికి చేజిక్కుతుంది. పిజె డిగ్రీ చదువే ఈ కథ.
అసలైతే చాలా మామూలు కథ. ‘దేవుడు ప్రేమించడానికి మనుషుల్నీ, వాడుకునేందుకు వస్తువుల్నీ సృష్టించాడు. కానీ మనిషి మనుషుల్ని వాడుకుని వస్తువుల్ని ప్రేమిస్తున్నాడు’ అన్న అత్యావశ్యకమైన హెచ్చరిక కారణంగా కథ గొప్పదైంది.
కథంతా పల్లెటూళ్లో జరుగుతుంది. ఆ వాతావరణం కంటికి ఇంపుగా మనోహరంగా ఉంది. పిజెలో మార్పుకి కారణమైన సన్నివేశాలు కొన్ని అలరిస్తాయి. కొన్ని నవ్విస్తాయి. కొన్ని కదిలిస్తాయి. ఏదీ సహజంగా అనిపించదు. ఐనా నటీనటుల ప్రతిభ మనని ఆలోచించనివ్వదు. అన్నీ బాగున్నాయి. ఐతే తాగుబోతు లెక్చరర్‍గా సమీర్ నటన బాగున్నా సన్నివేశాలు మరీ కృతకం అనిపించాయి.
పిజె మిత్రుల విషయంలో కొంత గజిబిజి ఉంది. పేదవారు డబ్బుకంటే స్నేహనికే ప్రాధాన్యమిస్తారని చెప్పాలని దర్శకుడి ఉద్దేశ్యం కావచ్చు. కానీ గతంలో డబ్బుకోసమే అతడి చుట్టూ తిరిగిన మిత్రులు కూడా- పిజె విజయానికి లక్షలు తేవడం మింగుడు పడదు. విజయానంతరం అతడు గొప్ప ఆస్తికి వారసుడై తమని చేరదీస్తాడని వాళ్ల ఆశ ఐతే- అది సరిగ్గా చూపలేదు. వారు కూడా నిస్వార్థులే అన్న భావన కలుగుతుంది. అదే గజిబిజి బిందుమాధవి పాత్రలోనూ కనిపిస్తుంది. ఆమెది ప్రేమా, ధనవ్యామోహమా అన్న విషయంలో దర్శకుడికి స్పష్తత ఉన్నట్లు లేదు. అలాగే పిజెలో మార్పులు క్రమ పద్ధతిలో రావు. మారినట్లే అనిపించి మళ్ళీ మొదటికి వస్తూంటాడు. అందుకు సరైన కారణాలు అగుపించవు. సినిమా ఐపోయింది కాబట్టి కానీ చివర్లో అతడిలో వచ్చిన మార్పు శాశ్వతమనుకుందుకు లేదు.
పిజె పాత్రలో నాని జీవించాడు. ‘అతి’కి పోక ఇదే స్థాయి నిలబెట్టుకోగలిగితే నటుడిగా అతడికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. హరిప్రియ బాగుంది. బిందుమాధవి బాగున్నా- ఆమె పాత్రను కావాలని పొడిగించినట్లు అనిపిస్తుంది. రావు రమేష్ నటుడిగా విజృంభిస్తున్నాడనే చెప్పాలి. ఆరంభంలో రావు గోపాలరావుల మాట్లాడ్డం- ఆ తరహా పాత్రలకూ తను సరిపోతానని సూచించడానికి అనిపిస్తుంది. ఐనా బాగుంది. చనిపోయిన జమీందార్ (పిజె తాతగారు) పాత్ర ప్రాధాన్యం అంతంతమాత్రం. ఆ పాత్రకు నాగినీడువంటి మంచి నటుణ్ణి ఎన్నుకోవడం ఎందుకో తెలియదు.  ఎమ్.ఎస్. నారాయణ తెలుగును ప్రేమించే లెక్చరర్ పాత్రలో  కలకాలం ప్రేక్షకుల మదిలో నిలచిపోతాడు. ముఖ్యంగా ‘ళ్ల’ పదాన్ని ‘ల్ల’ గా ఉచ్చరించడాన్ని ఎత్తి చూపడం అభినందనీయం. ఉచ్చారణ దోషాలను సవరించడానికి సినిమా ఒక గొప్ప మీడియా. మిగతా నటులందరూ కూడా తమతమ పాత్రల్లో చక్కగా రాణించారు.     
సెల్వగణేష్ సంగీతం బాగానే ఉంది. చంద్రశేఖర్ మాటలు బాగున్నాయి. శ్రీరామ్ కెమేరా పనితనం అభినందనీయం. పాత సారాని కొత్త సీసాలో పోసినా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన కిక్ ఇచ్చేలా తీసిన దర్శకుడు అశోక్‍కి ఈ చిత్రం ఓ కలికితురాయి.  
పల్లె నేపథ్యంలో సందేశాత్మకమైన మంచి చిత్రాన్ని నిర్మించిన బుజ్జిబాబుకి ప్రత్యేకాభినందనలు.
ఓ ఐటమ్ సాంగ్ మినహాయిస్తే- ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా తప్పక చూసి ఆనందించతగ్గ చిత్రమిది.
ఈ చిత్రాన్ని ఆన్‌లైన్లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply

%d bloggers like this: