నవంబర్ 28, 2011

మొగుడు- చిత్రసమీక్ష

Posted in బుల్లితెర-వెండితెర at 11:15 ఉద. by వసుంధర

ఓ ఇంట్లో ఓ కుక్క, గాడిద ఉన్నాయి. రాత్రిపూట అ ఇంట్లో ఓ దొంగ దూరాడు. యజమాని తనని సరిగ్గా ఆదరించడం లేదన్న కోపంతో కుక్క మొరగలేదు. యజమానిమీద అభిమానం ఉన్న గాడిద కుక్కని మందలించి మొరగమని హెచ్చరించింది. కుక్క వినకపోతే తనే ఓండ్రపెట్టింది. దొంగ భయపడి పారిపోయాడు కానీ యజమానికి నిద్రాభంగమైంది. కోపంగా లేచి గాడిదని చావబాదాడు. నీతి: ఎవరి పని వాళ్లే చెయ్యాలి.
మన తెలుగు సినిమా దౌర్భాగ్యం ఇదే. ఎవరూ తెలుగు సాహిత్యం చదవరు. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు వగైరా వగైరాలు కథలు చెబుతారు. వాటికి ఆహా ఓహో అనే వందిమాగధులు. తెలుగు సాహిత్యానికి దూరంగా అదో కూపస్థ మండూక ప్రపంచం. వాళ్లకి కథలంటే హాలీవుడ్ చిత్రాల్లో పుట్టి మన వాతావరణానికి అనుకూలంగా మలచబడేవి. వారి అభిరుచి మన సినిమాల్లో కథ, మాటలు, పాటలు, చిత్రీకరణ వగైరాలపై ప్రతిఫలిస్తోంది. కథల జన్మస్థానం సాహితీపరుల మేధస్సు అనీ, దర్శకుడి ప్రతిభ వటిని తెరకి ఎక్కించడంలోనే బయటపడుతుందనీ మన సినీ పండితులు భావించరు. ఐనా మనకి చాలా మంచి దర్శకులున్నారు. వారిలో కృష్ణవంశీ ఒకరు.
ఓ గులాబి, ఓ నిన్నేపెళ్లాడతా, ఓ సిందూరం, ఓ అంత:పురం, ఓ మురారి, ఓ ఖడ్గం, ఓ రాఖీ, ఓ చందమామ- ఆయన ప్రతిభకు పట్టం కడతాయి. వాటిలో సిందూరం అపజయం పాలైనా ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. కుటుంబ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, అర్థవంతంగా ప్రదర్శించడంలో ఆయన అందె వేసిన చేయి. అలాంటిది ఆయన కేవలం ఉమ్మడి కుటుంబం విలువల్ని ప్రతిబింబించేలా ఓ చిత్రం తీస్తున్నాడంటే ప్రేక్షకుల ఆశలు మిన్నంటుతాయి. ఇదీ ‘మొగుడు’ నేపథ్యం. కథేమిటంటే-
రాజేంద్రప్రసాద్ ఓ ఉమ్మడికుటుంబం యజమాని. తన కూతుళ్లకోసం ఆయన దూరపుటాలోచనతో చిన్నప్పుడే అనాథ బాలుర్ని చేరదీసి పెంచి పెద్దచేసి గొప్పవాళ్ళని చేసి అల్లుళ్లుగా చేసుకున్నాడు. కొడుకు గోపీచంద్ కోసం అలాంటిదేం చెయ్యలేదు. ఆ కొడుక్కేమో- వచ్చే పిల్ల ఉమ్మడి కుటుంబంలో ఇముడుతుందా అని భయం. అందుకే పెళ్లి వాయిదా వేస్తున్నాడు. చివరికి అతడికి తాప్సీ నచ్చింది- అదీ తాగి మైకంలో ఉన్న ఆడపిల్లగా కనబడి.  తాప్సీ తల్లి రోజా రాజకీయ నాయకురాలు. ఆమె భర్త నరేష్ భార్యచాటు మొగుడు.  పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి కార్యక్రమం పూర్తయ్యాక- చిన్నదే ఐనా మన సంప్రదాయంలో మామూలే అనతగ్గ ఓ కారణంవల్ల రెండు కుటుంబాలకూ గొడవౌతుంది. తాప్సీ తాళి తెంచి మొగుడి మొహాన కొడుతుంది. మనసు చెడిన గోపీచంద్ మారిషస్ వెడతాడు. మనసు పడిన శ్రద్ధాదాస్ అతడి వెంటపడిందని గ్రహించి తాప్సీ కూడా వెంట పడుతుంది. మారిషస్ లో భార్యాభర్తలు గొడవ పడుతూనే దగ్గిరౌతారు. మళ్లీ పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగొస్తే- రెండు కుటుంబాలూ వీధి గూండాల్లా కొట్టుకునే స్థితికి చేరుకున్నాయి. మొగుడూ పెళ్లాలు ఒకర్నొకరు అమితంగా ఇష్టపడ్డంతో- రెండు కుటుంబాలూ మళ్ళీ ఒక్కటై కథ సుఖాంతం.
ఈ కథలో ఉమ్మడి కుటుంబం బాగుంది. రోజాని రాజకీయనేతగా చేసిన పరిచయం బాగుంది. ఇలా బాగున్నవి కొన్నే. బాగోలేనివి ఎన్నో. మచ్చుకి గోపీచంద్ కి చూసిన పెళ్లిసంబంధాలు. దర్శకుడి టెక్నిక్ బాగున్నా- వధువుల విభిన్న తత్వాల్లో హాస్యం కంటే అపహాస్యం ఎక్కువైంది. కుటుంబవ్యవస్థను సమర్ధించే చిత్రంలో కుటుంబాలే విలన్సు కావడంలోని ఆంతర్యం తెలియదు. తాళి తెంచి మగడిమీదకి విసిరికొట్టిన తాప్సీ మగడి వెంటపడడానికి తార్కికమైన కారణం లేదు. మొగుడు అన్న పేరు పెట్టిన ఈ సినిమాలో మొగుడి పాత్ర ఏమిటో తెలియదు. భర్తను పొందడానికి తాప్సీ చేసిన ప్రయత్నాలకు సహకరించడమే అతడి పాత్ర ఐతే సినిమాకు ‘పెళ్లాం’ అన్న పేరు బాగా సరిపోతుంది. మధ్యతరగతి పెద్దమనుషులు కత్తులు తీసుకుని బయల్దేరడంలో కుటుంబకంటే అంత:పురం వాసన ఎక్కువ అనిపిస్తుంది. ఆరంభంలో ఎంతో హుందాగా కనిపించిన రోజా- చౌకబారు అనిపించే నటన, ప్రవర్తన- నేటి రాజకీయవాదుల్ని ప్రతిబింబించడానికి ఐతే ఓకే; కథాపరంగా కాదు. మారిషస్ సన్నివేశాలు వేడివేడిగా బాగున్నాయి. ఐతే అవి అసహజమేకాక పాత సీసాలో పాత సారా.
నటీనటుల్లో రాజేంద్రప్రసాద్ కొన్నిచోట్ల బాగా రాణించాడు. ఆప్యాయత, సెంటిమెంటు గొప్పగా పండించిన ఆయన- ఆవేశంలో మాత్రం విసిగించాడు. ఆవేశం అర్థవంతం కాకపోవడం అందుకు కారణం కావచ్చు. ఏ మాత్రం అర్థవంతం కాని పాత్రలో రాణించి నటుడిగా మరికాస్త ఎదిగాడు గోపీచంద్. తాప్సీ తెలుగు ఇబ్బందికరంగా అనిపించినా, నటనకంటే కాదు. నటిగా ఆమె ఇంకా ప్రాథమిక దశలో ఉందనిపిస్తుంది. నాజూకుతనం తగ్గి కొన్నిచోట్ల మగరాయుడిలా అనిపించింది. శ్రద్ధాదాస్ ఆమెకంటే ఆకర్షణీయంగానూ, బాగా నటించినట్లూ అనిపించింది. రోజా అక్కడక్కడ తాను మాజీ హీరోయిన్ అన్న విషయం మర్చిపోకపోవడంవల్ల హుందాతనం కొంత తగ్గింది. తానిప్పుడు ‘మా’జీ అనుకోగలిగితే- అమ్మ పాత్రలకు మనకు జయసుధ స్థాయి మంచి నటి దొరికిందనుకోవచ్చు. మిగతా నటీనటులు తమ పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు. కొందరు పేరున్నవారు చిన్న పాత్రల్లో కనిపించినా ఆహుతిప్రసాద్ పాత్ర ఆయన స్థాయికి మరీ చిన్నదనిపించింది.
మాటలు సహజంగా వినసొంపుగా ఉన్నాయి. పాటలు విసుగనిపించవు. చిత్రీకరణ బాగుంది.
పదవిలో ఉన్న రాజకీయవాదులు మేమేం చేస్తే అదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు. వారిని పదేపదే ఎన్నుకుంటున్న ఓటరు మహాశయులకు జోహార్లు.
అంతోఇంతో పేరు సంపాదించుకున్న దర్శకులు- మేమేం తీస్తే అదే సినిమా అనుకుంటే- సినిమాలు ప్రేక్షకుల పాలిటి ‘మొగుడు’ ఔతాయి. మొదట్నించి చివరిదాకా ఎందుకు చూస్తున్నామా అనిపించే చిత్రమిది. ఇది హిట్టైతే ప్రేక్షక మహాశయులకు జోహారు. బహుశా వారీ జోహారుకు సుముఖంగా ఉన్నట్లు లేదు.
కృష్ణవంశీ మంచి కథలు ఎన్నుకుని తన అసమాన ప్రతిభకు న్యాయం చేకూర్చి తెలుగు సినీ ప్రేక్షకుల మనసులు రంజింపజేసే మరో రోజుకోసం ఎదురు చూద్దాం.   

1 వ్యాఖ్య »

  1. p.kusumai said,

    మన తెలుగు చిత్రసీమలో ఉన్న
    కొద్దిమంది మంచి దర్శకుల విధిని
    జాగృతం చేసే ఇలాటి
    విమర్శనా వ్యాఖ్యాన వ్యాసాలు లకు ఆహ్వానం!


Leave a Reply

%d bloggers like this: