నవంబర్ 29, 2011

సోలో

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:29 సా. by వసుంధర

సినిమాకు కథ ప్రాణం. కథనంతో కూడా ప్రాణం పోయగలగడం దర్శకత్వ ప్రతిభ. ఆ ప్రతిభకు మచ్చుతునక ఈ నవంబర్ 25న విడుదలైన సోలో చిత్రం. కథనంలో బయటపడే కథేమిటంటే-
గౌతమ్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు హోదాకి ఎదిగిన అనాథ. సోలో బ్రతుకంటే విసిగిపోయిన అతడికి ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకుని- ఆ కుటుంబంలో ఒకడిగా తనూ జీవించాలని కల. కేవలం కుటుంబం పెద్దది కాదన్న కారణంగా కొన్ని సంబంధాలు కాదన్నాడు. కేవలం కుటుంబం పెద్దదన్న కారణంగా వైష్ణవి అనే అమ్మాయిని ప్రేమించాడు. చతురోపాయాలతో ఆమె తనని ప్రేమించేలా చేసుకున్నాడు.
వైష్ణవి తండ్రికి తన అక్కంటే పంచప్రాణాలూను. ఆమె ప్రేమించినవాణ్ణి పెళ్లి చేసుకుని అష్టకష్టాలూ పడుతోంది. అతడి బావని అదుపు చెయ్యడానికి వేరే పెద్దలు లేరు. తన కూతురి విషయంలో అలాంటి పొరపాటు చెయ్యకూడదనీ, ఆమెను పెద్ద కుటుంబంలో ఇవ్వాలనీ గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయం ఎంత గట్టిదంటే అక్కే స్వయంగా అడిగినా ఆమె కొడుక్కి తన కూతురు వైష్ణవిని ఇవ్వనంటాడు. ఈ పరిస్థితుల్లో ఆయన తన కూతుర్ని గౌతమ్ కి ఇస్తాడా? ఐతే గౌతమ్ పై వైష్ణవి ప్రేమ పీకె లోతుకి చేరిందని గ్రహించి ఆయన అట్నించి నరుక్కొచ్చాడు. వైష్ణవిని ఆతడు పెళ్లి చేసుకునే మాటైతే- ఆమెని మిగతా కుటుంబం అంతా వెలి వేస్తుందనీ- గౌతమ్ కి పెద్ద కుటుంబం దొరకదు సరికదా, వైష్ణవి కూడా పెద్ద కుటుంబానికి దూరమౌతుందనీ చెబుతాడు. అదిష్టంలేని గౌతమ్ తనకు తానుగా రంగంనుంచి తప్పుకుంటాడు. అక్కడ విశ్రాంతి. తర్వాత తండ్రి వైష్ణవికి వేరే సంబంధం చూస్తాడు. వియ్యంకుడికి వైష్ణవికి నచ్చింది కానీ ఆమె ప్రేమ గురించీ తెలిసింది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండడానికి- గౌతమ్ కళ్లముందే తన కొడుక్కి వైష్ణవితో పెళ్లి జరగాలంటాడాయన. ఫలితంగా గౌతమ్ తన స్నేహితులతో పెళ్లికి తరలి వస్తాడు. ఆ తర్వాత ఓ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే టైపులో నడిచి కథ సుఖాంతం.
ఈ కథలో పెళ్లిలో- అబ్బాయి, అమ్మాయిల  సంపర్కంకంటే రెండు కుటుంబాల అనుబంధం ముఖ్యమని భావించే హీరో ఆశయం గొప్పది. ఆ ఆశయంతోటే హీరోని దెబ్బతీసిన మామ చాతుర్యం గొప్పది. మొదటి సగంలో వైష్ణవి ప్రేమను పొందడానికి గౌతమ్ చేసిన ప్రయత్నాల గురించి- ఇవి సినిమాల్లో మాత్రమే పనిచేస్తాయి- అన్న హెచ్చరిక అవసరం. వాటిలో ప్రొఫెసర్లని చిన్నబుచ్చడాలూ, ఆడపిల్లని వేధించడాలూ ఉన్నప్పటికీ- సన్నివేశాలన్నీ నవ్వు పుట్టిస్తాయి.
గౌతమ్ పాత్రలో నారా రోహిత్ చక్కగా ఇమిడిపోయాడు. మాట, నడక, నడత- అన్నీ హుందాగా ఉన్నాయి. కొన్నిచోట్ల అభిషేక్ బచన్ లా కనిపించాడు. నటనలో అతి లేకపోవడం విశేషమైతే- కొన్ని సందర్భాల్లో మరీ మితిగా ఉండడం సవరించుకోవాలి. మొత్తంమీద తెలుగు తెరకు ఓ మంచి కొత్త హీరో అనిపిస్తాడు రోహిత్. వైష్ణవిగా నిషా అగర్వాల్ తన పాత్రలో జీవించింది. రూపానికి తగిన నటన, భావాల్ని పలికే అందమైన పెద్ద కళ్లు ఆమెకు మంచి భవిష్యత్తును సూచిస్తాయి. వైష్ణవి తండ్రిగా ప్రకాష్ రాజ్ తనదైన బాణీలో చక్కని నటన ప్రదర్శించాడు. అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని ఆయన ప్రదర్శించిన తీరు అద్భుతం.  ఐతే కూతురి ప్రేమపట్ల స్పందించడంలో సరైన అంతర్యుద్ధం కళ్లలో కనిపించక- ఆయన పూర్తి స్థాయి విలన్ లా అనిపించడం ఆయనదో, దర్శకునిదో చిరులోపం. చిన్నదైన అక్క పాత్రకి జయసుధ ఎంపిక దర్శకుడి పరిణతిని తెలియ జెస్తుంది. వియ్యంకుడి పాత్రలో శాయాజీ షిందేని తప్ప మరొకర్ని ఊహించుకోలేం ఆనిపిస్తుంది. వైష్ణవి సఖిగా నటించిన స్వప్నిక- ఆ పాత్రకే వన్నె తెచ్చింది. శ్రీనివాసరెడ్డి పూర్తిస్థాయి హాస్యనటుడిగా రూపొందాడనడానికి ఈ చిత్రం చాలు. ఆలీ పాత్ర చిత్రానికి అదనపు ఆకర్షణ.
మాటలు బాగున్నాయి. పాటల చిత్రీకరణలో కొత్తదనముంది. ఓ విషాదగీతం 1960-70ల్ని గుర్తు చేస్తుంది.
క్లైమాక్స్ రొటీన్ గా కాక ప్రేక్షకులకు చిక్కని విధంగా తీసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించినా చక్కని కథనంతో చిలికి చిక్కని కథని వెలికి తీసిన దర్శకుడి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. పరశురాంకి అభినందనలు.
హీరోలకి ఉన్నతాశయాలతోపాటు మంచి అలవాట్లు కూడా అవసరమని స్ఫురింపజేయడం కూడా ప్రధానమని గుర్తించి- ఇలాంటి చిత్రాల్ని మరింత సందేశాత్మకం చెయ్యగలరని ఆశిస్తూ- ఈ చిత్రానికి విజయాన్నీ- ఈ చిత్ర దర్శకనిర్మాతలనుంచి మరిన్ని మంచి, మెరుగైన చిత్రాల్నీ ఆశిద్దాం.    

Leave a Reply

%d bloggers like this: