డిసెంబర్ 4, 2011

శ్రీరామరాజ్యం- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:04 సా. by వసుంధర

1967లో తెలుగు తెరకు బాపు-రమణ అనే ఒక కొత్త జంట జతపడింది. వారు తీసిన సాక్షి చిత్రం మనకా సంవత్సరాన్ని సాక్షి నామ సంవత్సరం చేసిందని వారే ప్రచారం చేసుకున్నా అది ప్రేక్షకులు, విమర్శకులు కూడా ఔనౌనని ఆ ప్రచారాన్ని తామూ కొనసాగించారు. ఫలితంగా ఆ జంటనుంచి బుద్ధిమంతుడు, అందాలరాముడు, సంపూర్ణరామాయణం, సీతాకల్యాణం, ముత్యాలముగ్గు వగైరా వగైరా అద్భుత చిత్రాలెన్నో ఎన్నెన్నో తెలుగువారికి మహత్తర కానుకలయ్యాయి.
బాపు-రమణ దైవభక్తులు. మీదుమిక్కిలి రామభక్తులు. రాముడి పేరిట ఏంచేసినా- వారిలో భక్తి, ఆరాధన, పరవశం ప్రస్ఫుటమౌతాయి. రామభక్తితో త్యాగయ్య గానం చేస్తే, వీరు చిత్రాలు తీశారు. త్యగయ్య గానంలాగే వీరి చిత్రాలూ అజరామరం.
1963లో  ప్రముఖ సినీ దర్శకుడు సి. పుల్లయ్య ఉత్తర రామాయణాన్ని నభూతో నభవిష్యతి అన్న రీతిలో చలనచిత్రంగా మలిచారు. ఆ చిత్రాని ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులు మరువలేదు. ఆ చిత్రంలో పాటలు తెలుగునాట ఇప్పటికీ ప్రతిరోజూ ఏదో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి.
అలాంటి లవకుశ చిత్రాన్ని శ్రీరామరాజ్యం పేరిట 21వ శతాబ్దం ప్రేక్షకులకు అందించాలని నిర్మాత యలమంచిలి సాయిబాబు సంకల్పించడం సాహసం అని చాలామంది అనవచ్చు కానీ- అందులో భక్తి, అభిరుచి ఉన్నాయని మాకు అనిపిస్తుంది. ఆ అభిరుచికి న్యాయం చేకూర్చగలవారు బాపు-రమణలు తప్ప ఇంకెవరుంటారు? తనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్నట్లు సూచనలందుతున్నా- రమణ చిత్తశుద్ధితో ఆ ప్రయత్నానికి సహకరించి తనకు మాత్రమే సాధ్యమనిపించే శైలిలో- కథ, చిత్రకథ, మాటలు సమకూర్చారు. ఆపైన బాపు తనదైన అసాధారణ విశిష్ట ముద్రతో చిత్రీకరణకు పూనుకున్నారు. అలా శ్రీరామరాజ్యం వెలసింది. ఈ నవంబర్ 17న కనులపండువగా వీనులవిందుగా జనాళి మధ్య నిల్చింది.
ఇది పాత లవకుశ చిత్రానికి పోటీ కాదనడానికి నిదర్శనంగా- ఈ చిత్రం ఆరంభంలో పాత చిత్రంలో మాటలే వినిపిస్తాయి. “లేరు కుశలవుల సాటి” అన్న పాట పల్లవి అదే వరుసలో స్మృతిగా వినిపిస్తుంది. కొన్ని పత పద్యాలు మాటలుగా రూపొందాయి.
పోటీ కానప్పుడు- మళ్లీ మరో చిత్రమెందుకూ అనడం- దేవదాసు, డాన్ లాంటి చిత్రాల్ని పునర్మిస్తుంటే ఆదరిస్తున్న ఈ తరానికి అసందర్భం. ఆయా చిత్రాల విషయం ఏమో కానీ- ఈ చిత్రం గురించి మరో మాట చెప్పక తప్పదు. ఇప్పటికే చాలా రామాయణాలున్నాయి కదా అని- విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం వ్రాసి ఉండకపోతే- తెలుగు సాహితికి ఎలాంటి లోటు కలిగేదో- అలనాటి లవకుశ- బాపు ముద్రతో శ్రీరామరాజ్యంగా రాకపోతే- తెలుగు తెరకూ అలాంటి లోటే సంభవించేది. 
ఈ చిత్రంలో బాలకృష్ణ రాముడుగా తండ్రి రామారావుకి సాటి రాకపోవచ్చు. ముఖంలో వృద్ధాప్యపు ఛాయలు ఉన్నాయనిపించొచ్చు. ఐనా పాత్రోచితంగా కనిపించి, అనిపించి కథనానికి భంగం రానివ్వలేదు. అక్కినేని సంభాషణలు భావస్ఫూరితం కాక, అప్పజెబుతున్నట్లు అనిపించొచ్చు. కానీ ఆయన రూపం, హావభావాలు- వాల్మీకిని సజీవంగా మనముందు నిలబెట్టాయి. నయనతార కనులు ఆరంభంలో సీత పాత్ర భారానికి తట్టుకోలేకపోతున్నాయా అనిపించవచ్చు. కానీ క్రమేపీ ఆమె సీతగా మారి మన కంట తడి పెట్టిస్తుంది. మన్ననలందుకుంటుంది. కేఅర్ విజయ ముఖంలో ఒకనాటి దివ్యతేజస్సు లోపించవచ్చు. కానీ పుత్రశోకంతో విలపించి విలపించి- చివరికా పుత్రుడు కళత్రవియోగంతో పరితపిస్తుంటే కుమిలిపోయే తల్లిగా ఆమె ఆ పాత్రలో జీవించింది. మిగతా పాత్రలు కూడా నటుల పేర్లతో కాక- పాత్రలుగానే ప్రేక్షకుల మనసుల్లో నిలచిపోతాయి. కొద్ది క్షణాలే కనిపించిన బ్రహ్మానందం కూడా ఈ చిత్రం స్థాయికి అనుగుణంగా తన్నుతాను మలచుకోవడం విశేషం.
బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా జంటగానూ ఒంటిగానూ రాణించిన ఈ చిత్రంలో పాటలు- ఈ శతాబ్దానికి అనువుగానూ, చిరస్థాయికి తగినవిగానూ ఉన్నాయి. సెట్టింగులు, కెమేరా, ట్రిక్సు- మనని రామాయణ కాలానికి తీసుకుపోతాయి. 
“లేదు లవకుశకు సాటి” అని పాడుకోతగ్గ పాత సినిమా లవకుశ. ఆ చిత్రం ఎన్‌టీఆర్ ది. ఆంజలిది. సముద్రాలది. లీల, సుశీల, ఘంటసాలలది. సి.పుల్లయ్య-సిఎస్ రావులది. ఇంకా మరెందరో మహానుభావులది.
గొప్ప కళాఖండంగా రూపొందిన శ్రీరామరాజ్యంలోనూ మహామహులెందరో ఉన్నారు. కానీ ఈ చిత్రం వారెవ్వరిదీ కాదు- కేవలం బాపు-రమణలది. అదే ఈ రెండు చిత్రాలకూ తేడా.
హింస, అపహాస్యం, అసభ్యత, కుసంస్కారం- రాజ్యమేలుతూ వేడెక్కిపోతున్న తెలుగు చలనచిత్రసీమకు మలయమారుతం శ్రీరామరాజ్యం. 2011 తెలుగు  సినీ శకంలో శ్రీరామరాజ్యనామ సంవత్సరం.     

నాటి లవకుశకి దీటుగా, విభిన్నంగా జొన్నవిత్తుల పాటలు, సీత  పాత్రకి ప్రాణం పోసిన సునీత డబ్బింగు గురించి ప్రత్యేకంగా చెప్పకపోతే ఆ సమీక్ష పూర్తి కాదని మనవి. జయప్రదంగా యాబై రోజులు పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న ఈ చిత్ర విజయం ముళ్లపూడికి తెలుగు సినీ ప్రేక్షకుల నివాళి. ఈ చిత్రంపై అర్థవంతమైన మరో వ్యాఖ్య డా. జొన్నలగడ్డ మార్కండేయులు పంపారు. మీ స్పందనకై ఇక్కడ పొందుపరుస్తున్నాం.

2 వ్యాఖ్యలు »

  1. M.V.appaRao said,

    అవునండి ! బాపు రమణల శ్రీరామరాజ్యానికి లేదు సరిసాటి! ఆ నాటి మహత్తర చిత్రం లవకుశ కాదు పోటి !…యమ్వీ.అప్పారావు(సురేఖ)

  2. వేణు said,

    విమర్శలనూ, లోపాలను కూడా ప్రస్తావిస్తూ రాసిన మీ సమీక్ష సమతూకంగా ఉంది. లవకుశ కూ, శ్రీరామ రాజ్యానికీ తేడాను రెండు ముక్కల్లో చక్కగా చెప్పారు!


Leave a Reply

%d bloggers like this: