డిసెంబర్ 13, 2011

1910లో ఓ గురజాడ కథ

Posted in శాస్త్రీయం at 10:38 ఉద. by వసుంధర

తెలుగులో మొదటి కథ ఎవరిదన్నది వివాదాస్పదం కావచ్చు. కానీ తెలుగు కథకు శ్రెకారం చుట్టిన మహనీయుల్లో శ్రీ గురజాడ అప్పారావు కూడా గణనీయులే! 1910లో వారు వ్రాసిన ఓ కథను శ్రీ టి.వి.ఎన్ శాస్త్రిగారు అందజేశారు. అది అక్షరజాలంకి శ్రెదేవి మురళీధర్ ద్వారా లభ్యం. వారిరువురికీ ధన్యవాదాలు. ఆ కథ, పరిచయం శ్రీ శాస్త్రి మాటల్లో……….
శ్రీ టీ.వీ.ఎస్.శాస్త్రి గారి అమూల్య కానుక!
నాకు నచ్చిన కథ
ఒక విన్నపం –తెలుగు కథకు నూరేళ్ళు నిండినాయి.ఎంతో మంది మహనీయులు,ఎన్నో మంచి కథలు వ్రాశారు.అందులో కొన్ని,నాకు నచ్చినవి, మీకు కూడా(అప్పుడప్పుడూ) పరిచయం చెయ్యాలని నా తపన.(చాలా మందికి ఈ కథలు తెలిసి ఉండవచ్చునేమో కూడా!)రచయిత భావం దెబ్బ తినకుండా,కథను క్లుప్తం గా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను.తప్పకుండా,చదివి ఆనందించ తగ్గ కథలు .మొదటి గా నూరేళ్ళు నిండిన తెలుగు కథ అయిన, శ్రీ గురజాడ వెంకటఅప్పారావు గారి,’మీ పేరేమిటి?’ తో ప్రారంభిస్తాను.కథలకు వ్యాఖ్యానమేమీ వుండదు.

         మీ పేరేమిటి?–శ్రీ గురజాడ వెంకటఅప్పారావు గారు

పంతానికి పోయిన శూద్రులు అర్ధరాత్రి ఆపళంగా నిద్రపక్క మీద వున్న రంగాచార్యుల గారిని రెక్కలు విరిచిపట్టుకొని కోవెల ఎదుట వున్న రావిచెట్టు కింద కుదేసారు. అప్పటికే వూరు రెండు వర్గాలుగా చీలిపోయివుంది.ఒకటి శైవం,మరొకటి వైష్ణవం.ఈ రెండు వర్గాలు యింత కాలం ఎవరి దోవన వారు వున్నా-తాజాగా హైదరాబాద్ రాజ్యం నుండి పదీ పదిహేను మంది శివాచార్లు దిగబడి అర్ధరాత్రుల్లు కూడా శివాలెత్తుతూ  శివునికి పూజలు చేస్తూ వైష్ణవులను బెదరగొట్టి తమ మతం లోకి లాగేస్తున్నారు.ఎవరి మతంలోకి ఎందరిని లాగితే ఆ మతం అంత గొప్ప.శైవులు పంతం కొద్దీ అలా లాగేశారు కూడా.ఇక వూరి పెద్ద –లక్షాధికారి–అయిన సారదినాయుడు ఒక్కడే మిగిలాడు వైష్ణవంలోముఖ్యంగా..అతన్ని కూడా లాగేయాలి.అందుకోసమే ఆ రోజు రాత్రి భయంకరమైన అగ్నిగుండం తొక్కటానికి సిద్ధమయ్యారు శైవులు.అదే జరిగితే శైవుల ఆధిపత్యం ఖాయం.వాస్తవానికి ఏది పోయినా ఎవరికీ లెక్కలేదుగాని,ఈ రెంటి చుట్టూ డబ్బు ముడిపడటం వల్లనే వచ్చింది తకరారంతా.సారధి నాయుడు వేలు ఖర్చుపెట్టి ప్రతి ద్వాదశికీ ఉత్సవాలు చేయిస్తుంటాడు.అప్పుడు ఎవరికి కావలసిన చిల్లర వారికి దక్కుతుంది.అతనే కనుక శైవం లోకి మారిపోతే దధ్యోజనం వుండదూ,చక్కర పొంగలీ వుండదు.ఇది వైష్ణవులలో వున్న కొందరు శూద్రులకు నచ్చలేదు.శైవానికి తగిన ఎత్తు వెయ్యాల్సిందే అని తెగబడి కొందరు ముందూ వెనకా చూడకుండా వైష్ణవ అర్చకుడు అయిన రంగాచార్యులు గారిని యెత్తుకొచ్చారు.శైవులకు పోటీ గా గుండం తొక్కాలని వీరి పథకం.
రంగాచార్యులు గారికి ఈ విషయం తెలిసి హడలిపోయారు.’ఓరి మూర్ఖుల్లారా.. వైష్ణవంలో గుండం తొక్కటం లేదురా..దానికి విధీ మంత్రాలు లేవు’ అని అడ్డం కొట్టారు.శూద్రులు వినలేదు.’సామీ…గుండం నువ్వు తొక్కుతావా…నీ కొడుకు చేత తొక్కించమంటావా’అని మొండి పట్టు పట్టారు.మూర్ఖత్వం వున్మాద స్థాయికి చేరి,ఒకరిని మతం పేరిట అగ్నికి ఆహుతి యిచ్చేలా వుంది పరిస్థితి.ఇక గుండం వెలిగించాలి.రంగాచార్యులు గుండం తొక్కాలి.బలి ఖాయం.సరిగ్గా ఆ సమయానికే జుట్టు విరబోసుకొని,ఖడ్గం చేత పట్టుకొని,ఉగ్ర రూపం తో రంగాచార్యుల కోడలు నాంచారమ్మ వచ్చేసింది.బాకును శూద్రుల ఎదపై గుచ్చి గుడ్లురిమి చూస్తూ…మూర్ఖుల్లారా…వదలండి నా మామను అని బొబ్బరిచింది.ఆమెను చూసి జనం జడిసి,రంగాచార్యులు గారిని వదిలిపెట్టారు.’ఇంతకూ మీకేం కావలి?’అని ఆమె అడిగింది.’గుండం తొక్కే మనిషి కావాలి ,వైష్ణవ ఆధిపత్యం నిలబడాలి’అని శూద్రుల సమాధానం.’సరే నేను నా మామ గారి పేరు తలుస్తూ గుండం తొక్కుతాను.నా వెనుక వచ్చే మగవాళ్ళు ఎవరూ?’అని ఆమె వారిని ప్రశ్నించింది.
ఎవరూ మాట్లాడలేదు.అక్కడ కోరుకుంటున్నది ఎదుటవాడి  బలి,తమది కాదు..నాంచారమ్మ,గుంపులో దూరం గావున్న పీరు సాయెబు ను చూసి’పీరు సాయెబూ? గుండం తొక్కుతావా?’ అని అడిగింది.’తమరు సెలవిస్తే తొక్కు తాను తల్లీ!’యిదీ పీరు సాయెబు సమాధానం.ఆ జనాన్ని వుద్దేశించి నాంచారమ్మ యిలాగా అన్నది’పట్టణాలలో పీర్ల పండుగకు హిందువులు కూడా పీర్లు కట్టి గుండం తొక్కుతారు.పీరు సాయెబు, సాయెబే!
అయినా కబీరంతటి భక్తుడు.రాముణ్ణి ధ్యానిస్తాడు.కనుక నేను రాముడి పేరు  మీద పీరు కట్టి అతడి చేత గుండం తొక్కిస్తాను.మీరంతా అతడి వెనక నడవండి.’ అని ఆమె చెప్పేటప్పటికి ,ఆ సలహా అందరికీ నచ్చింది.ధైర్యం సడలిన వైష్ణవుల సేనకు పీరుసాయెబు నాయకుడు! 
ఆ రాత్రి శైవులు వుగ్రరూపాలతో ,ప్రభలతో ,హర హర మహాదేవ శంభో అంటూ గుండం తొక్కి జనాన్ని భయ భ్రాంతులను చేస్తుండగా…’అల్లా-రాం ‘అని పెనుకేక వేస్తూ రాముడి పీరు ధరించిన పీరు సాయెబు గుండం లోకి మహా పరాక్రమంగా రంగ ప్రవేశం చేశాడు.అతడి వెనుకే వైష్ణవులంతా రణ నినాదాలు చేస్తూ నిప్పుల మీద పాదాలు పెట్టారు.జనం హడలిపోయారు.శైవులు కకా వికలులయ్యారు.పంతాలకు పొతే ఎవరి దమ్ము ముందు ఎవరు తక్కువా?
ఇరువర్గాల మధ్య సంధి కుదిరింది.ఎవరి మతాల్లోకి వారు ముడుచుకున్నారు.
కాని–ఆ నాడు –అందరినీ ఒక దారికి తెచ్చిన ఆ రాముడి పీరు మాత్రం రచ్చ సావిట్లోకి చేరి సగర్వం గా పూజలు అందుకుంటోంది.కారణం?అది వైష్ణవులది అని వైష్ణవులు అనుకుంటారు.అది త్రిశూలంగా  వుంటుంది కనుక దానిని శైవామ్సే అని శైవులు అనుకుంటారు.అది పీరు కనుక తమ మతానిదే అని ముస్లింలు అనుకుంటారు.ఇంతకూ దాని పేరేమిటీ?ఎవరికి తెలుసు?
(కథ ముగిసింది—–వందేళ్ళ క్రితం-1910లో –మహాకవి గురజాడ వెంకటఅప్పారావు గారు వ్రాసిన కథ యిది.దీనిని గురించి నాలాంటి సామాన్యుడు వ్యాఖ్యానించటం దుస్సాహసమే!)
భవదీయుడు,
టీ.వీ.ఎస్.శాస్త్రి.  

1 వ్యాఖ్య »

  1. తాడిగడప శ్యామలరావు said,

    జేజేలు గురజాడ చెప్పిన కథకు
    వ్యాఖ్యాన నిరపేక్షమైనట్టి కథకు
    అగ్నిలో దూకిన వన్ని మతాలు
    భగ్నమై పోయిన వన్ని పంతాలు


Leave a Reply

%d bloggers like this: