డిసెంబర్ 21, 2011

పంజా- చిత్ర సమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:19 సా. by వసుంధర

పవర్ స్టార్ గా అభిమానుల మన్ననలందిన ప్రముఖ హీరో పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ కంటే ఎక్కువగా అభిమానులు- అతడినుంచి పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నారు చాలాకాలంగా. కానీ ఖుషి చిత్రం తర్వాత వచ్చిన పవన్ చిత్రాలు ఇంచుమించుగా అన్నీ అభిమానుల్ని నిరుత్సాహపరిచాయి. వాటిలో చాలావరకూ ఫ్లాప్స్. అన్నవరం, బాలు, జల్సా వంటివి కాస్త ఆడినా చెప్పుకోతగ్గ హిట్స్ కావు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న విడుదలైన పవన్ పంజా పదును చూద్దాం.
జయ్, అక్క, తల్లి బ్రతుకుతెరువుకోసం కలకత్తా వచ్చారు. అక్కడ దుండగుల కిరాతకానికి గురై అక్క, తల్లి చనిపోగా ఒంటరివాడై దిక్కుతోచక విలపిస్తున్న జయ్ కి భగవాన్ ఆశ్రయమిచ్చాడు. పెంచి పెద్ద చేసి గూండాగా తగిన శిక్షణ ఇచ్చి తనకి ముఖ్యానుచరుడిగా చేసుకున్నాడు. భగవాన్ ప్రత్యర్ధి కులకర్ణి వేసే ఎత్తులన్నీ జయ్ మూలంగా చిత్తై పోతూంటాయి. కులకర్ణి జయ్ ని తనవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు.  ఒక్కటీ ఫలించదు. భగవాన్ గారాల కొడుకు మున్నా విదేశంనుంచి స్వదేశం రావడంతోఈ కథ మొదలౌతుంది. మున్నా దుడుకు మనిషి. అనుచరుల్ని బానిసల్లా చూస్తాడు. ఐనా సహించి అతడికి రక్షణగా ఉండాలని భగవాన్ జయ్  తో సహా అనుచరులందరికీ చెబుతాడు. క్రమంగా మున్నా ఆగడాలు అనుచరులకి దుస్సహంగా మారాయి. కొందరు చాటుగా కులకర్ణి వైపు కూడా మళ్లుతారు. భగవాన్ క్లబ్ లో డ్యాన్సులు చేసే జాహ్నవి జయ్ ని ఇష్టపడుతుంది కానీ జయ్ సంధ్య అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని తెలిసి మనసు సరిపెట్టుకుంటుంది. తనని తప్ప వేరెవర్నీ ప్రేమించడానికి వీల్లేదని మున్నా జాహ్నవిని శాసిస్తాడు. ఆమె ఎదురు తిరిగితే చావగొడతాడు. జయ్ మున్నాని వారించబోతాడు. ఆ సంఘర్షణలో జాహ్నవి మున్నా చేతిలోనూ, మున్నా జయ్ చేతిలోనూ చనిపోతారు. భగవాన్ పరిస్థితి అర్థం చేసుకోడు. నమ్మకస్థుడైన జయ్ ని అంతం చెయ్యాలనుకుంటాడు.  ఇంచుమించుగా ఇక్కడ విశ్రాంతి.  తర్వాత జయ్ పారిపోయి సంధ్య గ్రామం పలాస చేరుకుంటాడు. అక్కడ సంధ్యపై పగబట్టిన దుండగీడు సాంబశివుణ్ణి  తెలివిగా అంతం చేస్తాడు. ఈలోగా భగవాన్ నమ్మకద్రోహుల్ని నమ్మి క్రమంగా ఒకొక్క అనుచరుణ్ణే కోల్పోతాడు. జయ్ ఉనికి తెలుసుకుని అతణ్ణి చంపే ప్రయత్నం చేస్తాడు. ఒక పక్క కులకర్ణి కూడా జయ్ ని వేటాడే ప్రయత్నంలో ఉన్నాడు. ఇద్దరు శత్రువుల్నీ ఎదుర్కొని జయ్ తన ప్రియురాల్ని దక్కించుకోవడంతో కథ ముగిస్తుంది.
కథ వినడానికి పాతదిలా అనిపించినా ఇంటర్వల్ దాకా కథనం అద్భుతం. హాలీవుడ్ స్థాయి చిత్రాన్ని చూస్తున్న అనుభూతినిస్తుంది. అందుకు దర్శకుడు విష్ణువర్ధన్ అభినందనీయుడు. ఐతే ఇంటర్వల్ తర్వాత కథ పాత సీసాలో పాత నీరు అనిపిస్తుంది. సారా ఎందుకు అనలేదంటే కిక్ రాదని. సాంబశివుడి కథని అతికించినట్లు కాక మొదట్నించీ అంతర్లీనం చేసి- టెంపో పెంచితే బాగుండేది. చిత్రం రెండో భాగం అర్థరహితంగా, గజిబిజిగా, హడావుడిగా, అనాసక్తికరంగా రూపొందింది. చివరి పెగ్గుతో తన సత్తా చూపిస్తానన్న బ్రహ్మానందం మాటతో ఐదారు సన్నివేశాలు కల్పించి మధ్యమధ్య కొంత గాప్ ఇచ్చి చూపించాల్సింది. రెండో సగంలో ఏక బిగిన చూపడంవల్ల ఓ గొప్ప హాస్య సన్నివేశం సన్నివేశం పండాల్సినంతగా పండలేదు.
పవన్ కల్యాణ్ హుందాగా, ఈ పాత్రకి అతికినట్లు సరిపోయాడు. వయసు ప్రభావంవల్లనేమో కొన్నికోట్ల చిరంజీవిలా, కొన్నిచోట్ల నాగుబాబులా అనిపించాడు. అందువల్ల ప్రేమ సన్నివేశాల్లో ఖుషి తరహా నటన ఎబ్బెట్టుగా ఉంది. రూపానికి తగినట్లు  నటన మార్చుకోవడం అవసరం. అలాగే డాన్సులో కూడా పూర్వపు చురుకుదనం లేదు. పంజా టైటిల్ సాంగ్ లో పవన్ కదలికలకూ ఆ వెంటనే వచ్చిన వెయ్ రా చెయ్  వెయ్ రా పాటలో అంజలి కదలికలకూ సౌలభ్యంలో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సంధ్యగా సారా జేన్ డయాస్ నాజాగ్గా, హుందాగా ఉంది. అందం, నటన అంత తృప్తిగా లేవు. జాహ్నవిగా అంజలి అందంగా, నాజూగ్గా ఉంది. నటన ఫరవాలేదనిపించినా అక్కడక్కడ మోటుగా అనిపించింది. మున్నాగా అడవి శేషు [పాత్రకు తగ్గట్లు విలక్షణంగా నటించాడు. ఇతర తరహా పాత్రల్లో రాణించేదాకా  అతడి ప్రతిభ అంచనా వెయ్యడం కష్టం.  ధృతరాష్ట్రుడి వంటి డాన్ పాత్రలో జాకీ ష్రాఫ్ ఆశించిన మేరకు రాణించలేదు. అతుల్ కులకర్ణి నటించాడు అనడంకంటే కనిపించాడు అనడం సబబు. పవన్ మిత్రుడిగా ఆలీ చిన్నదైన పాత్రలో కూడా జీవించాడు. గొప్పదైనా కుదించబడిన పాత్రలో బ్రహ్మానందం అవకాశం లభించిన మేరకు రాణించాడు. సుబ్బరాజు హుందాగా ఉన్నాడు కానీ అతడి పాత్రకు అర్థం, ప్రాధాన్యం లేవు.  మిగతా నటీనటులు అవధులమేరకు తమ పాత్రల్ని పోషించారు.
యువన్ శంకర్ రాజా సంగీతం విభిన్నంగా బాగుంది. పాపారాయుడు పాట అభిమానూలకోసం పెంచినట్లుంది. అభిమానులు కానివారిని కాస్త విసిగిస్తుంది. పంజా టైటిల్ సాంగ్ టైటిల్స్ లో చూపిస్తే ఎక్కువ బాగుండేది.
పవన్ నటన (రొమాంటిక్ సీన్లలో తప్పించి), పాటలు, కొంతవరకూ సంభాషణలు, విష్ణువర్ధన్ దర్శకత్వం- ఈ చిత్రంలో ప్రత్యేకతలు.
మంచి చేసినవారికి కృతజ్ఞుడై ఉండడం ఎంత గొప్పదో- మంచి చేసినవాడు కృతజ్ఞతను కోరడం అంత తప్పన్న వాక్యంతో చిత్రం ప్రారంభించడం గొప్పగా ఉంది. ఆ సందేశాన్ని ఇముడ్చుకున్న కథని అంత గొప్పగానూ మలచడంలో కృతకృత్యత లేకపోవడం-ఈ చిత్రంలో చెప్పుకోతగ్గ లోపం.
ఇంటర్వల్ దాకా ఒకసారైనా తప్పక చూసి తీరాల్సింది అనిపించే ఈ చిత్రం- ఇంటర్వల్ తర్వాత ఒక్కసారి కూడా చూడడం కష్టం అనిపించింది. ఐతే ఎందుకు చూసామా అనిపించలేదు.
పవన్, యువన్, శేషు, విష్ణువర్ధన్ లనుంచి గొప్ప చిత్రాన్ని ఆశించేలా రూపొందినందుకు వారివారిని అభినందిస్తూ- ఈ బృందం నుంచి మంచి చిత్రాన్ని ఆశిద్దాం.

1 వ్యాఖ్య »

  1. nice

    ?!


Leave a Reply

%d bloggers like this: