Site icon వసుంధర అక్షరజాలం

బాడీగార్డ్- చిత్రసమీక్ష

‘మా ఊళ్లో ఇద్దరు బార్యాభర్తలుగా చెలామణీ ఐపోతున్నారండి’ అంటాడు మాడా ముత్యాలముగ్గు సినిమాలో. అది మన చిత్రపరిశ్రమ విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. మన సినిమాల్లో చాలామంది నటులుగా, దర్శకులుగా, కవులుగా, గాయకులుగా, సంగీతదర్శకులుగా చెలామణీ అయిపోతున్నారు. సృజనాత్మకత లేక, ఆట-పాట-మాట-చిత్రం ఏది ఎందుకు హిట్టయిందో అర్థంకాక, హిట్టు కొట్టడమే ఆదర్శంగా ఎన్నుకునే వారు కోట్లానుకోట్లు చిత్రనిర్మాణంపై వెచ్చిస్తూంటారు. అలాంటివారు ఎన్నుకున్న ఓ కథ బాడీగార్డ్‌.    
చిన్నప్పుడు వెంకటేష్‌ బ్రతికి బట్ట కట్టడానికి కారణం ప్రకాష్‌రాజ్‌. అందుకని వెంకటేష్‌ ప్రకాష్‌రాజ్‌ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం. పెద్దయ్యేసరికి వెంకటేష్‌ చదువుమీద శ్రద్ధ వహించడు. కండబలాన్నే నమ్ముకుని అన్యాయాన్ని ఎదిరించడమే పనిగా పెట్టుకున్నాడు. అతడి బాగు కోరిన మేనమామ అతణ్ణి ప్రకాష్‌రాజ్‌కి బాడీగార్డ్డ్‌గా పంపుతాడు. ఐతే బాడీగార్డ్‌ అవసరం ప్రకాష్‌రాజ్‌కంటే ఆయన కూతురు త్రిషకే ఎక్కువ. బాడీ గార్డ్‌గా వెంకటేష్‌ త్రిషని ఎవన్నంటే ఉండడం ఆమెకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అతడి దృష్టి మళ్లించడానికి- బంగారం అనే పేరుతో సెల్‌ఫోన్లో ప్రేమ సందేశాలు పంపుతూంటుంది. మొదట్లో నిర్లక్ష్యం చేెసినా క్రమంగా వెంకటేష్‌ బంగారంతో ప్రేమలో పడతాడు. కొన్నాళ్లు అతగాడినో ఆట ఆడించినా చివరికి య్రిష కూడా వెంకటేష్‌తో ప్రేమలో పడుతుంది. ఆమె ప్రకాష్‌రాజ్‌ కూతురని తెలిస్తే వెంకటేష్‌ ఆమెను పెళ్లి చేసుకోను కాక చేసుకోడు. కానీ త్రిషకి అతడు లేకుండా బ్రతకలేననిపించే పరిస్థితి. ఇదీ మూడొంతులు కథ. ఈ కథ చాలా రొటీన్‌గా నడిచిపోతుంది. చివరి నాలుగో వంతు కథ రొటీన్‌కి కాస్త భిన్నంగా నడుస్తుంది. ముగింపు ఊహకందినా బాగానే ఉందనిపిస్తుంది.
బాక్సాఫీసుకి ఏ రాయైతేనేం పళ్లూడగొట్టడానికి అనిపించే ఈ కథ- అవార్డు చిత్రాలకి పేరొందిన మళయాళీ చిత్ర పరిశ్రమనుంచి రావడం విశేషం. దీనికోసం హిందీతో సహా పలు భాషల నిర్మాతలు పోటీ పడడం చిత్రసీమలో సృజనాత్మకతకి ఏర్పడిన కరువుకి నిదర్శనం. నిరాయుధుడైన హీరో- సాయుధులైన వందలాది గూండాల్ని- ఒక్క చేతితో కొట్టి చంపడం ఎంత మామూలైపోయిందంటే- ఆ సాధ్యాసాధ్యాల చర్చ హాస్యాస్పదం. ఇక ఊరందరిచేతా గౌరవించబడే ప్రకాష్‌రాజ్‌- తాని బాడీగార్డ్‌ అవసరం ఏమాత్రం లేదని నమ్మిన ప్రకాష్‌రాజ్‌-      బాడీగార్డ్‌ రాకపోతే ఏమై పోయేవాడో అనిపిస్తుంది ఆరంభంలోనే. ఆ మాత్రం అంచనా లేని అసమర్ధుడు- ఆ ఊళ్లో అన్నాళ్లు మకుటంలేని మహారాజు కావడం ఒక చిత్రం.
ఇక త్రిషను తీసుకుంటే- ఆమెకి అడుగడుగునా ప్రాణభయమే. బాడీగార్డ్‌ ఆమెను మృత్యువు అంచులోంచి రక్షించిన సందర్భాలున్నాయి. ఐనా ఆమె బాడీగార్డ్‌ని తప్పించుకుని తిరగడమే ప్రధానం అనుకుంటుంది. అదింకో చిత్రం. కానీ ఆమె అలా అనుకోకపోతే ఈ కథ కూడా ముందుకెళ్లదు మరి.
చదువులో అంతంతమాత్రంగా ఉండే హీరో- ఆస్తిపాస్తులు బొత్తిగా లేని హీరో- ఆస్ట్రేలియాలో ఉద్యోగం సంపాదించి- ఆరేడేళ్లలో కోట్లకి పడగెత్తి రావడం మరో చిత్రం. 
మొదటి సగం అంతా వెంకటేష్‌, చిత్రల కాలేజి సన్నివేశాలతో నత్త నడక నడుస్తుంది. హాస్యానికి రెండర్థాల మాటలు, అసభ్యతని సూచించే సంభాషణలు- ఆలీకీ, వేణుమాధవ్‌కీ కొంత ఓకే కానీ- వెంకటేష్‌ని ‘నువ్వు నాకు నచ్చావ్‌’ అనగలమా అనిపింపజేస్తాయి. సినిమా రెండో సగంలో వేగం పుంజుకుని- ‘కుఛ్‌ కుఛ్‌ హోతాహై’కి దగ్గిర్లో కొత్త తరహా ముగింపుకి ప్రయత్నిస్తుంది. ఈ ముగింపుని దృష్టిలో ఉంచుకుని- మొత్తం సినిమా అంతా కొత్తదనాన్ని నింపితే- న్యాయం చేసే సత్తా తనకి ఉన్నదని ఈ చిత్రంలో వెంకటేష్‌ తన నటనతో నిరూపించాడు. ఈ సినిమాకి అతడి నటనే బలమూ, ప్రాణమూ. సినిమా కథలో బలం, ప్రాణం లేకపోతే అది వేరే సంగతి.
అమాయకత్వాన్నీ, మూఢభక్తినీ, ప్రేమనీ, హాస్యాన్నీ అద్భుతంగా ప్రదర్శించిన హీరో వయసు ముఖంలో అంతగా కనిపించకపోయినా, ఆటపాటల్లో సుస్పష్టం. కాళ్లూ, చేతులూ, వళ్లూ సహకరించినప్పుడు ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించకుండా పాత సినిమాల్లో దిలీప్‌ కుమార్‌, రాజేంద్ర కుమార్‌లని అనుసరించడం మంచిది.    
త్రిష వయసు మరీ ఎక్కువేం కాదు కానీ- ఈ చిత్రంలో ఎక్కువేనేమో అనిపించింది. అక్కడక్కడ అందంగా అగుపించినా, నటనలో సహజత్వం లేదు. ఒకే సన్నివేశంలో వెంకటేష్‌ ప్రేమ, బాధ ప్రేక్షకుల సానుభూతికి అర్హంగా అనిపిస్తే- భావప్రకటన లోపంవల్ల- త్రిష అనుభూతులు ఏ స్పందనా కలిగించవు. ఈ చిత్రం చూస్తే నటిగా త్రిషకు కాలం చెల్లిందా అనిపిస్తుంది.
మిగతా వారిలో సుబ్బరాజు పాత్ర నిండుగా కనిపిస్తుంది. కానీ ఆటలో అరటిపండు. ప్రకాష్‌రాజ్‌ పాత్రకి టివిలో చక్కగా రాణిస్తున్న వారెవరైనా ఉంటే సరిపోయేది. కోట శ్రీనివాసరావుది చాలా చిన్న పాత్ర. మహా రొటీన్‌ అనొచ్చు. తనికెళ్ల భరణి పాత్రని ఉత్తరాల్లో సూచించినా సరిపోయేది. జయప్రకాష్‌రెడ్డి కనిపించింది కాసేపే ఐనా ఆహ్లదకరంగా గిలిగింతలు పెడతాడు.  వేణుమాధవ్‌, ఆలీలు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. త్రిషకి సఖిగా సలోని ఎన్నిక బాగుంది. చివరివరకూ ఆమెకు నటనావకాశం లేకపోవడం ఆశ్చర్యం.
అన్ని సినిమాల్లో లాగే ఈ సినిమాలోనూ కెమేరా పనితనం బాగుంది. సంగీతం బాగుంది కానీ, గుర్తుండిపోదు. సంభాషణలు బాగున్నాయి. కథ-స్క్రీన్‌ప్లే చతికిలబడకపోతే- దర్శకుడి చిత్రీకరణ నేర్పు గమనార్హం.
మంచి కథను గుర్తించి, మంచిగా చిత్రీకరించే- మంచి అచ్చ తెలుగు సినిమాకోసం మనమింకా ఎదురుచూడాల్సి ఉంది. ఐతే బాడీగార్డ్‌ థియేటర్లో కూర్చున్నవారిని మరీ నిరయత్సాహపర్చదు. దానికి తోడు బిజినెస్‌మాన్‌ పక్క థియేటరల్లలోనే విడుదలవడంవల్ల అక్కడ టికెట్లు దొరకని జనాలందరూ- ఈ చిత్రానికి ఎగబడుతున్నారు- అదీ వెంకటేష్‌ కారణంగా. వెంకటేష్‌ ఆ ఇమేజ్‌ని కాపాడుకుంటాడని ఆశిద్దాం.
 
Exit mobile version