జనవరి 31, 2012

శ్రీ కందుకూరి రామభద్రరావు

Posted in సాహితీ సమాచారం at 11:40 ఉద. by వసుంధర

తెలుగు కవితకు నవయుగ వైతాళికుల్లో ఒకరైన కీ.శే. శ్రీ కందుకూరి రామభద్రరావు గారి నూట ఎనిమిదవ జన్మదినం నేడు.
2005లో వారి శతజయంతి సందర్భంగా వసుంధర వారికి అర్పించిన నివాళికై ఇక్కడ క్లిక్ చెయ్యండి.
శ్రీ రామభద్రరావు సమగ్రసాహిత్య గ్రంథం వివరాలకై ఇక్కడ క్లిక్ చెయ్యండి.
తెలుగువారికి చిరస్మరణీయులైన ఆ మహనీయుని గురించి వారి పెద్దబ్బాయి శ్రీ కందుకూరి పుండరీకాక్షుడు అందిస్తున్నసంక్షిప్త సమాచారమిదిః
శ్రీ కందుకూరి రామభద్రరావు 31-01-1905 తేదీన గౌతమీ తీరాన రాజవరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసం- స్వగ్రామంలోను, ఉన్నతపాఠశాల విద్య రాజమహేంద్రవరంలోని వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలోను చేశారు. తరువాత కాకినాడ పిఠాపురం మహారాజా కళాశాలలో బి.ఏ. డిగ్రీ పొందారు. కళాశాల విద్యాభ్యాసంలోనే ఆయనకు రచనా వ్యాసంగం, ఆంగ్ల ఆంధ్ర భాషలలో ఉపన్యాస పటిమ అలవడ్డాయి. పిఠాపురం మహారాజా కళాశాల స్వర్ణోత్సవానికి రవీంద్రనాధ టాగోరు ‘చిత్ర’ నాటకాన్ని తెలుగులోకి అనువదించి ప్రచురించారు.

1930-35 కాలంలో వారి స్వగ్రామంలో పంచాయితీకి సంస్ధాపక అధ్యక్షునిగా పాఠాశాల నిర్మాణం, గ్రంథాలయ స్ధాపన మొదలైన సమాజసేవా కార్యక్రమాలు నిర్వర్తించారు. 1935-39 సం||లలో పిఠాపురం కళాశాల తెలుగు శాఖలో ట్యూటర్‌గా పనిచేశారు. 1939-40 సం||లో రాజమహేంద్రవరంలో ట్రయినింగు కాలేజీలో బి.ఇ.డి. చదువుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయ అంతర్కళాశాల వక్తృత్వ పోటీలలో ఆంధ్ర, ఆంగ్ల భాషలలో ప్రధములుగా నిలిచారు.

 శ్రీ రామభద్రరావు ఉపాధ్యాయవృత్తి చేపట్టి, వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలోను, గొల్లపాలెం, పేరూరు, రాజోలు, అమలాపురం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా, వందల విద్యార్దుల జీవితాలను మలచారు. ఆత్రేయపురం హైస్కూలుకు సంస్థాపక ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండగానే తరంగిణి, వేదన, జయపతాక, నివేదనం గేయమంజరి కావ్యాలను ప్రచురించారు. ఆయనకు ఆంగ్లభాషలో కూడ మంచి పాండిత్యం ఉంది. తన రచనలను కొన్నిటిని

“Searching strains” గా ఆంగ్లంలోకి  అనువదించారు.

  1960 సం||లో అమలాపురం ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ చేసి, 1961 నుంచి సుమారు 10 సంవత్సరములు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో విద్యావిషయిక ప్రయోక్తగా పని చేశారు. ఆ సమయంలో విద్యా కార్యక్రమాలకు వన్నె తీసుకొని రావడమే కాక, అనేక లలిత గీతాలు, దేశభక్తి గేయాలు, సంగీత రూపకాలు, కవితలు రచించి ప్రసారింప చేశారు. ఆయన చేసిన సేవకు గొల్లపాలెం ప్రజలు స్పందించి, ‘వేదన’ అనే పుస్తకాన్ని ప్రచురించి, ఘనంగా సన్మానించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా అమలాపురం ప్రజలు కూడ ఘనంగా సన్మానించారు. ఆంధ్ర జ్యోతిలో వారం వారం రచించిన ఆయన వచన రచనలు ‘ఎందరో మహానుభావులు’ గా రూపు దిద్దుకున్నాయి. శ్రీరామభధ్రరావు మంచి కవిగా ఉత్తమ  ఉపాధ్యాయునిగా గొప్ప వక్తగా కీర్తి నార్జించారు. ఆయన 8-10-1976 న దివంగతు లయ్యారు. 2005 జనవరి నెలలో ఆయన శతజయంతి హైదరాబాద్‌ త్యాగరాయగానసభలో వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో ‘కందుకూరి రామభద్రరావు సమగ్ర సాహిత్యం’, ‘ప్రతిభామూర్తి (జీవిత చరిత్ర), “Searching strains and leaves from a diary”, శతజయంతి ప్రత్యేక సంచిక వెలువడ్డాయి.

రామభద్రరావు రచనలుః

1.  పద్య కావ్యాలు: తరంగిణి, వేదన, నివేదనము, జయ పతాక, కవితా లహరి.

2.  గేయకావ్యాలుః గేయమంజరి, ఆకాశవాణి సంగీత రూపకాలు

3.  అనువాదముః చిత్ర (నాటకము)

4.  ఆంగ్ల గ్రంథాలుః Searching strains and leaves from a diary       

1 వ్యాఖ్య »

  1. Dr.Voolety Parvateesam said,

    dganyavadalu. manchi samacharam,………. Volety


Leave a Reply

%d bloggers like this: