ఫిబ్రవరి 17, 2012

బిజినెస్‍మేన్- చిత్ర సమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:48 ఉద. by వసుంధర

వ్యాపారానికి అమ్మకం ప్రధానం. అమ్మకానికి ఓ ‘ఇరగ దీసేవాడు’ (ఎందుకో మాకీ పదప్రయోగం జుగుప్సగా అనిపిస్తుంది) కావాలి. ఇప్పుడు వివిధ వ్యాపార సంస్థలు ప్రచారానికి సినిమా హీరోల వెంటబడుతున్నాయి. అలాంటివారిలో మహేష్‍బాబు అగ్రస్థానంలో ఉన్నాడు. మరి మనకి సినిమా అంటే వ్యాపారం. ఆ వ్యాపారానికి మహేష్‍బాబుని మించి ఇంకెవరు ఉపయోగపడగలరు? అలా అతడో మంచి బిజినెస్‍మాన్.

సినిమాకి పెట్టుబడి పెట్టేది నిర్మాతే అయినా తయారీ, అమ్మకం బాధ్యతలు దర్శకుడివే. ఆ బాధ్యతా నిర్వహణలో బద్రిగా తనదైన ఒక కొత్త ముద్ర వేసిన పూరీ జగన్నాథ్- అసామాన్యుడైన బిజినెస్‍మాన్‍గా పేరు తెచ్చుకున్నాడు.  అతడు, మహేష్‍బాబుతో కలిసి పోకిరిగా మారి ఊహించని ఎత్తుకి ఎదగడం తెలుగు సినిమాకి చరిత్ర. ఆ చరిత్రని తిరగవ్రాయడానికి జరిగిన కొత్త ప్రయత్నం బిజినెస్‍మాన్.

పోలీసు అధికారి నాజర్, ముంబైలో మాఫియా అంతమైపోయిందని మురిసిపోవడం ఈ సినిమాకి ఉపోద్ఘాతం. ముంబైలో మాఫియాని పునరుద్ధరించడమే ప్రధానాశయంగా హీరో ముంబైలో అడుగు పెట్టడంతో అసలు కథ మొదలౌతుంది. అతడది ఎలా సాధించాడన్నది కథ. ఆ కథలో ఓ హీరోయిన్, ఓ విలన్ ఉంటారు కానీ కమేడియన్స్ ఉండరు. ఈ చిత్రంలో కామెడీ స్థానాన్ని ప్రేమ, పాటలు, కొట్లాటలు, ఇతర సన్నివేశాలు సమర్ధవంతంగా భర్తీ చేశాయి. చిత్రం మొదటినుంచి చివరిదాకా ప్రేక్షకులకు ఊపిరి సలపనివ్వకుండా హాయిగా నవ్విస్తుంది. తెలుగు సినిమాలో పునరుద్ధరించతగిన ఆరోగ్యకరమైన ఈ ధోరణి. అభినందనీయం.

ఆద్యంతం ఆసక్తికరం, వినోదభరితం ఐన ఈ చిత్రానికి మహేష్‍బాబు పెద్ద ఆకర్షణ. అతడు పాత్రలో ఎంతలా జీవించాడంటే తనే ఆ పాత్ర అనిపించాడు. ప్రేమ సన్నివేశాల్లోనూ, ఐటమ్ డాన్సులోనూ కూడా అమ్మాయిలకంటే  కూడా తనే ఆకర్షణ కావడం- బహుశా మహేష్‍బాబుకే చెల్లిందనుకోవాలి. ఐతే ఎత్తుగా, నిండుగా, అందంగా, హుందాగా అనిపించడం వల్లనేమో- మహేష్‍బాబు నోట విచ్చలవిడిగా బూతు మాటలు పలకడం అదోలా, అపస్వరంలా అనిపించింది. ఆవేశపరుడు బూతులు మాట్లాడ్డం ప్రస్తుత సమాజ నియమం అనుకుంటే- మన సమాజానికి ఆవేశం వద్దు అనాలనిపిస్తుంది. మహేష్ ఈ విషయమై ఆలోచించాలి.

ఈ చిత్రంలో కాజల్‍ది నటనకు అవకాశమున్న అందమైన పాత్ర. ఐతే ఈ చిత్రంలో నటనతోపాటు అందంలోనూ తీసికట్టుగానే అనిపించిందామె. పోకిరిలో ఇలియనాలా మహేష్‍కి దీటు కాలేకపోయిందామె. ఇదే ధోరణి కొనసాగితే- చిత్ర విజయానికి ఆమె పాదం మంచిదనుకునే భ్రమలు తొలగిపోయే రోజు ఎంతో దూరం ఉండదు. ఆమె సఖిగా శ్వేతా భరద్వాజ్ తన పాత్రలో బాగుంది, చక్కగా రాణించింది.  మిగతావారిలో శాయాజీ సింధే చెప్పుకోతగ్గ ఆకర్షణ. ప్రకాష్‍రాజ్ చెప్పలేనంత విసుగు. ఇక మీదట అతగాడు ఇలాంటి రొటీన్ పాత్రలకు దూరంగా ఉండడం మంచిదేమో!

ఈ చిత్రంలో మహేష్‍ నటనకి దీటు వచ్చేవి పూరీ జగన్నాథ్ సమకూర్చిన సంభాషణలు. సమర్ధిస్తున్నట్లు కనిపిస్తూనే మాఫియాపై సంధించిన అపూర్వ వ్యంగ్య బాణాలవి. ఎంత ఆలోచిస్తే అంత లోతుకి తీసుకెళ్లి- మేధావుల్ని సైతం అలరిస్తాయి. ‘ఇండియాలో డబ్బుంది. ఎవడికి వాడు కావాల్సింది తీసుకోవడమే’ అన్న అద్భుత వ్యాఖ్యలో- చేదు నిజమే కాదు, అసహాయతతో కూడిన వేదన కూడా ఉంది. సమకాలీన సమాజం తీరు తెన్నులపై నిజాయితీతో కూడిన కసికి అసమాన ప్రతిభ తోడైతే తప్ప ఆ స్థాయి సాధ్యం కాదు. ఐతే అంత గొప్ప డైలాగులకి బూతు అంటించడం- దేవుడి ప్రసాదంమీద సారాయి చిమ్మినట్లుంది. మహేష్-కాజల్‍ల ముద్దు సన్నివేశాన్నే అందమైన పెదవుల కలయికగా మనోహరం చేసిన నేర్పు, ఓర్పు- సంభాషణల్లోనూ చూపితే ఎంతో బాగుండేది. గతంలో- సంస్కారం తెలియని ఓ కంట్రాక్టరు పాత్రచేత- అతడి భాష (యాస)నే పలికించినా, చిన్న బూతు పదం స్ఫురణకు కూడా ఇమడ్చలేదు ముళ్లపూడి. ఇటీవల వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘అతడు’ కూడా చక్కని సంభాషణలకు ఒరవడి. పూరీ జగన్నాథ్ కూడా పోకిరిలో అలాంటి ప్రతిభ ప్రదర్శించాడు. ఈ చిత్రంలోనూ పలుచోట్ల అలాంటి తన సత్తా చూపించినా- కడివెడు పాలలో ఒకటి కాదు, చాలా ఉప్పరాళ్లే ఉన్నాయి. అవి లేకుండానూ చిత్రం ఇంత విజయాన్నీ సాధించి ఉండేది.

పాటల్లో, నేపథ్య సంగీతంలో ఊపుంది. సారొత్తారొత్తారా పాట హమ్మింగుకి అనుగుణం. బాడ్ బాయ్స్ పాట సాహిత్యం సరదాగా ఉంది. పిల్లాచావ్ పాట పాత హిందీ సినిమా పాటలా అనిపించింది (ఇటాలియన్ పాటకి అనుకరణ అన్నారు. ఆ పాట చాలా పాతది కాబట్టి అప్పట్లోనే హిందీలో కాపీ కొట్టి ఉండొచ్చు). ఆడపిల్లల కురచ దుస్తులు, అదోరకం ఊపులు మామూలే. వాటిలో పాతచిత్రాలకు అనుకరణేతప్ప కొత్తగా తోచే సృజనాత్మకత ఏమీ లేదు. మహేష్‍కి డాన్స్ పరంగా కొన్ని పరిమితులున్నాయి. వాటికి అనుగుణంగా డ్యాన్సులు రూపొందించిన కోరియోగ్రాఫర్స్ అభినందనీయులు. ఫైట్స్ బాగున్నాయి కానీ హింస మోతాదు అంత అవసరమా అనిపిస్తుంది.

డైలాగ్స్ నుంచి అల్లితే- డాన్ బ్రౌన్ వ్రాసిన డా విన్సీ కోడ్ అంత గొప్ప నవల తయారౌతుంది. కానీ  చిత్రానికి కథ బొత్తిగా లేదనిపించేలా తయారు కావడం- మన చిత్రాల్లో కథ స్థానాన్ని తెలియజేస్తుంది. చిత్రం చివర్లో ఇచ్చిన మహేష్ నేపథ్యం- కథకుడి భావదారిద్ర్యానికి సూచన. అది ఆ నేపథ్యంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రకాష్‍రాజ్ నటన అంత పేలవంగానూ ఉంది. ఐతే అటు మాఫియా, ఇటు ప్రేమ సన్నివేశాల్లో మహేష్ పోకడలు అలరించాయి. ఆ ఘనత దర్శకుడిదే. హీరోని తొలిసారిగా పరిచయం చేసినప్పుడు ‘యథాయథాహి మాఫియాస్య గ్లానిర్భవతు భారత, మాఫియా సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే’ అనే శ్లోకాన్ని నేపథ్యంగా చూపిస్తూ నాటకీయంగా పరిచయం చేస్తే కథాంశానికి తగినట్లుగా ఉండి హత్తుకునేదనిపించింది.

వినోదభరితం కాబట్టి అభినందనీయం. తృప్తినిస్తుంది కాబట్టి లాభసాటి. మాఫియాపై వ్యంగ్యాస్త్రంగా  చర్చనీయం. అసభ్యతకి గర్హనీయం. బిజినెస్‍మాన్ అంటే అంతే ఆనుకుంటే- పూరీ, మహేష్‍లు ఎల్లకాలం బిజినెస్‍మెన్‍గానే మిగిలిపోతారు. బిజినెస్‍మెన్ ఎల్లకాలం విజయాల్నే సాధించలేరన్న నిజం ఇప్పటికే వారికి స్వానుభవం. స్వానుభవం నేర్పిన పాఠాలతో- మున్ముందు వారు బిజినెస్‍మాన్‍కి కొత్త, మంచి నిర్వచనాన్ని ఇవ్వగలిగితే- తెలుగు చలనచిత్రసీమ కేవలం వ్యాపారంగా మిగిలిపోదు. ఈ ఇద్దరే కాదు- మరెందరో తమ ప్రతిభను ఆ దిశకు మళ్లించగలరని ఆశిస్తూ- జనవరి 26న విడుదలై దేశవిదేశాల్లో ఊహించని లాభాలార్జిస్తున్న ఈ బిజినెస్‍మేన్‍ (వి)చిత్ర విజయాన్ని అభినందిద్దాం.            

8 వ్యాఖ్యలు »

 1. bonagiri said,

  నా చిన్నప్పుడు ఆంధ్రప్రభలో మీ “మొక్కలు పిలుస్తున్నాయి” సీరియల్ నాటి నుంచి మీ రచనలు చదువుతున్నాను.

  నా, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నా, మీలాంటి ప్రముఖ రచయితలు నేను వ్రాసింది చదివి, బాగుందనడం నాకెంతో సంతోషం.

  • అవగాహనతో కూడిన వ్యాఖ్యలు బ్లాగుల విలువ పెంచి ప్రయోజనాత్మకం అవుతాయి.ఆహం, అసహనం బ్లాగుల్ని నిరర్థకం చేస్తాయి. ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని నిస్సంకోచంగా స్వాభిప్రాయాల్ని ప్రకటించడం, వాటికి మీ భాష, శైలి సరైన జోడీ కావడం- మీ బ్లాగు ప్రత్యేకత. మన అభిప్రాయాల్ని ప్రకటించే స్వేచ్హ మనకి ఉన్నప్పుడు- ఇతరుల అభిప్రాయాలపట్ల అసహనం ఉందదు. అదే బ్లాగు సంస్కృతిలో మాకు నచ్చినది. మీకు మా అభినందనలు.

 2. bonagiri said,

  my blog http://www.bonagiri.wordpress.com

  • మీరు వ్రాసింది బాగుంది. మీకిది మాఫియాని సమర్ధిస్తున్నట్లుగా తోచింది. మాకిది మాఫియాపై స్తుతినిందలాంటి వ్యంగ్యాస్త్రంగా తోచింది. అదీ తేడా! మిగతా విషయాల్లో చాలావరకూ మేమనుకున్నదే మీరూ వ్రాశారు.


Leave a Reply

%d bloggers like this: