మార్చి 9, 2012

సహజనటి శ్రీమతి రాధాకుమారి కన్నుమూత

Posted in శాస్త్రీయం at 10:39 ఉద. by వసుంధర

నాలుగు దశాబ్దాలుగా నాలుగు వందలకు  పైగా తెలుగు సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషించిన శ్రీమతి రాధాకుమారి హైదరాబాద్ లో ,గురువారం ఉదయం (08 -03 -2012 )న గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఈమె వయసు 70 సంవత్సరాలు. భర్త శ్రీ రావి కొండల రావు గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరు కేవలం నటులే గాక, సినిమారంగంలో సహాయ దర్శకులుగా, పత్రికా ఉప సంపాదకులుగా, నాటికల రచయితగా, ప్రయోక్తగా, ప్రఖ్యాతి గాంచినవారు. పెక్కు నాటకాలలో నటించారు కూడా.ఆ రోజుల్లో వీరు వ్రాసిన నాటిక’ కుక్కపిల్ల దొరికింది’ ఎన్నో ప్రదర్శనలకు  నోచుకోవటమే కాకుండా, బహుమతులను కూడా పొందింది. శ్రీమతి రాధాకుమారి గారు కూడా నాటకరంగం నుండి వచ్చిన వారే! ఈమె షుమారు పదివేల నాటికల ప్రదర్శనలు యిచ్చిన ప్రఖ్యాత రంగస్థలనటి. రాధాకుమారి గారికి, రావి కొండల రావు గారికి నాటక రంగంలోనే పరిచయం యేర్పడి, అది ప్రణయంగా మారి ప్రేమ వివాహం చేసుకొని ,ఇద్దరూ ఒకటైనారు. సంసారం రసమయం చేసుకున్న ఆదర్శ జంట ఈ దంపతులు. శ్రీమతి రాధాకుమారి గారి మొదటి చిత్రం ‘తేనే మనసులు’. దీనికి దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు. ఈమె నాటక రంగంలో నటించే సమయంలో పెక్కు అవార్డ్స్ పొందారు. ‘మీ శ్రేయోభిలాషి’ అనే సినిమాలోని నటనకు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి నందీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
            ఈమె సహజనటి. ఆమె ప్రతిభ తెలిసిన దర్శకులైన  బాపు, జంధ్యాల లాంటి చక్కని అభిరుచిగల దర్శకుల పలు చిత్రాలలో మంచి పాత్రలు పోషించింది. పెళ్లి పుస్తకం, వివాహ భోజనం మొదలైన చిత్రాలలోని ఆమె నటన మనం ఎన్నటికీ మరువలేము. ఆమె డైలాగు చెప్పే విధానంలో తనదైన ఒక  ప్రత్యేక బాణీని యేర్పరుచుకుంది. మరణించే సమయంలో భర్త శ్రీ రావి కొండలరావు గారు, అమెరికాలో ప్రదర్శనల నిమిత్తం వెళ్ళారు. మార్గ మధ్యంలో, వీరికి దుబాయిలో ఈ వార్త తెలిసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.
              వీరు హైదరాబాద్ లోని  మోతీ నగర్ లో ఉన్న ‘సన్నీ రెసిడెన్సీ’ Apartment  లో వుంటున్నారు.అదే  Apartment లో నే ఉంటున్న మరొక హాస్యనటుడు ‘అనంత్'(రాజబాబు గారి సోదరుడు) వీరూ ఒకే కుటుంబ సభ్యులుగా కలసిమెలసి ఉండేవారు. అంతే కాకుండా, ఫ్లాట్స్ లో వున్న వారందరితో వీరికి చక్కని స్నేహ సంబంధాలు ఉండేవి. అదే Apartment  లో ఉంటున్న మా బంధువులను చూడటానికి వెళ్ళినప్పుడు వీరిని కూడా కలవటం జరిగింది. ఏ మాత్రం భేషజం లేని మంచి ఇల్లాలు. ‘మహిళా దినోత్సవం’ రోజున మనం ఒక మంచి మనిషిని, మంచి నటిని కోల్పోవటం కేవలం మన దురదృష్టం. వీరి సంతాన విషయం గురించిన వివరాలు తెలియవు.
                       శ్రీ రావి కొండల రావు గారికి సంతాప సానుభూతులు తెలియ జేస్తూ, శ్రీమతి రాధాకుమారి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను. ఆ సహజనటికి మన శ్రద్ధాంజలి!!!
భవదీయుడు,
టీవీయస్. శాస్త్రి.

3 వ్యాఖ్యలు »

  1. r.damayanthi said,

    ఈ వార్త వినంగానే బాధేసింది. రాధా కుమారి గారి ఆత్మకి శాంతి కలగాలి.
    రావు గారి మనసు నెమ్మది పొందాలి.
    వారికి నా సంతాపాన్ని తెలియచేస్తూ..
    ఆర్.దమయంతి.


Leave a Reply

%d bloggers like this: