మార్చి 30, 2012

ఇష్క్- చిత్రసమీక్ష

Posted in బుల్లితెర-వెండితెర at 5:32 సా. by వసుంధర

రాహుల్ చాలా మంచబ్బాయి. కానీ అమ్మాయిల్ని కాస్త ఏడిపిస్తాడు. ప్రియ కూడా చాలా మంచమ్మాయి. ఏడిపించే అబ్బాయిలనో ఆటాడించగలదు. ఇద్దరూ కలుసుకున్నారు. ఒకరినొకరు ఆటాడించుకున్నారు. క్రమంగా ఇష్టపడ్డారు. ప్రేమలో పడ్డారు. అంతా బాగుందనేసరికి ప్రియ అన్నయ్యే వాళ్ల పెళ్లికి విలన్ అయ్యాడు. ఇక ప్రియ మనసు నొప్పించకుండా, ఆమె అన్నయ్య మనసుని తనకి అనుకూలంగా మార్చడం రాహుల్ బాధ్యత.
ఇలాంటి కథలు హిందీ చిత్రం దిల్వాలే దుల్హనియా లేజాయేంగేతో హిట్ ఫార్ములాగా మారాయి. తెలుగు చిత్రం ఢీ (కొట్టి చూడు)తో తెలుగుతనాన్ని సంతరించుకున్నాయి. నిర్మాతలూ దర్శకులు వాటికోసం ‘పరుగు’ పెట్టారు. రెడీ, బిందాస్ అన్నారు. కందిరీగలై దూకుడు చేశారు. అందరి ప్రయత్నాలూ సత్ఫలితాలనే ఇవ్వడంతో దర్శకుడు విక్రమ్ నుంచి ఇష్క్ పుట్టింది.
కథ పాతదే ఐతేనేం- ఇష్క్ కొత్తగానే అనిపిస్తుంది- రాహుల్-ప్రియల మధ్య ప్రేమ సన్నివేశాల కారణంగా. ఆ జంట చూడముచ్చటగా ఉన్నారు. తెలివిగా అనిపించారు. చమత్కారంగా మాట్లాడారు. సంస్కారమూ ఒలికించారు. ఉన్నంతసేపూ ప్రేక్షకులకు వినోదం పంచారు. ఉత్కంఠ కలిగించారు. నవ్వించారు. అలరించారు.
ఆ ఘనత మొదట దర్శకుడిది. తదుపరి మాటలది. తదుపరి వరుసక్రమంలో కెమేరా పనితనానిదీ, పాటల చిత్రీకరణదీ, సంగీతానిదీ. వారందరికీ ఓ వావ్!  కొన్ని పాటలు బొమ్మరిల్లు, హాపీడేస్ వగైరా చిత్రాల్లో పాటల్ని గుర్తు చేసినా చిత్రీకరణలో కొత్తగా ఉన్నాయని సరిపెట్టుకోవచ్చు. ఐనా పాటలు కూర్చేవారు కలకాలం గుర్తు పెట్టుకోమనే రోజులు కావివి. ఐతే ఓకేయే కదా! 
నితిన్ ఈ చిత్రంలో అందంగా, హుందాగా- మునుపటి చిత్రాలకి భిన్నంగా కనిపించాడు. నటనకి అవకాశమూ, అవసరమూ లేని పాత్రేమో అతడిది అనిపించింది కానీ ఇంచుమించు అలాంటి పాత్రలో నిత్యా మీనన్ అత్యద్భుతంగా హావభావాలు ప్రదర్శింంచడం గమనార్హం. చలాకీతనంతో, సహజ నటనతో- ఆమె తన అందచందాల గురించిన ఆలోచన రానివ్వకుండా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలాంటి వారు నేడు వెండితెరకు అరుదైన కథానాయికలు. ఆమెకు ప్రత్యేకాభినందనలు. మిగతావారందరూ తమతమ పాత్రలకు అతికినట్లు సరిపోయారు. విలన్‌గా నవ్వించగలిగిన అజయ్, ఎలాంటి పాత్రకైనా ప్రత్యేకత తేగల నాగినీడు వారిలో మరింత ప్రత్యేకం.
ఈ చిత్రంలో హీరో సిగరెట్ తాగడం, మద్యం పుచ్చుకోవడం- కథా గమనానికి పెద్దగా అవసరం అనిపించవు. వాటిని నిత్య జీవితంలో భాగాలుగా చూపించడం అవసరం అన్న భ్రమను యువతకు కలిగించడం అవసరమా? అలాగే గోవాలో రేప్ సీనులో- అబ్బాయిల ప్రిపరేషన్ సవివరంగా చూపనవసరమా? ఈ చిత్ర విజయానికి అవేమీ కారణం కాదని ప్రేక్షకులకి స్పష్టమైనా- సృజనాత్మకత లేని దర్శకులు- వాటిని మాత్రమే అనుకరించే ప్రమాదముంది. అలాగే ఫైటింగ్సులో రక్తపాతమూనూ.
విక్రమ్- అభిరుచి, సృజనాత్మకత ఉన్న దర్శకుడు అనిపిస్తుంది ఈ చిత్రం చూస్తే. మున్ముందు చిత్రాలలో ఆ అంశాలకే ప్రాధాన్యమిచ్చి ఇంకా మంచి చిత్రాలు తీస్తాడని ఆశిద్దాం.
ఇష్క్ గొప్ప చిత్రం కాకపోవచ్చు. కానీ సత్కాలక్షేపానికి మంచి వినోదాత్మక చిత్రం.            
  
 

Leave a Reply

%d bloggers like this: