వసుంధర అక్షరజాలం

పూలరంగడు- చిత్రసమీక్ష

సాధారణంగా మన చిత్రాల్లో కమేడియన్ అంటే హీరోకి పక్కనో, విలన్‌కి అనుచరుడుగానో ఉంటాడు. అలా నటిస్తూనే హీరో, విలన్స్ అంత ప్రాధాన్యం సంతరించుకున్న వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఎంతలా అంటే-  పూర్వం శివరావు, రేలంగి- ఆ తర్వాత రాజబాబు, ఆ తర్వాత ఆలీ- పూర్తి స్థాయి హీరోలుగా చిత్రాలు వచ్చి ఘనవిజయం సాధించాయి. నేటి హాస్యనటుల్లో కమేడియన్‌గా తనదంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంటున్న సునీల్ మరో ప్రత్యేకత హీరోలకు తగిన అంగసౌష్టవం, హీరోల్లాగే నృత్యం చెయ్యగల నైపుణ్యం. ఆపైన ౨౦౦౪లో వచ్చిన మల్లీశ్వరి చిత్రంలో అతడి నటన రాజకపూర్ ఛాయలతో అలరించింది. ౨౦౦౬లో సునీల్ హీరోగా అందాలరాముడు వచ్చినప్పుడు- మల్లీశ్వరి తరహా నటనని ఆశించాం. కానీ ఇతర చిత్రాల్లో హీరోలపక్కన కాసేపైతే చెల్లుబడి ఐపోతుందనే వెకిలితనానికే అతడు ప్రాధాన్యమిచ్చాడు. ఆ చిత్రం పెద్ద హిట్ కావడంతో- నటుడిగా సునీల్ తన తీరు మార్చుకుంటాడన్న ఆశ పోయింది. కానీ ఆధునిక తెలుగు సినీరంగంలో మేధావి అనతగ్గ రాజమౌళి- సునీల్ హీరోగా మర్యాదరామన్న చిత్రం తియ్యడం- అటు సునీల్‌కీ ఇటు ప్రేక్షకులకీ వరమే! నేపథ్యం ఫాక్షనిజం. హీరోకి అడుగడుగునా ప్రాణభయం. విలన్లు కటిక కసాయిలు. అలాంటి కథని ఉత్కంఠభరితంగా, సరదాగా తియ్యడం- కత్తిమీద సాము. ఆ సాముకి తగిన మల్లీశ్వరి నటనకి ప్రాధాన్యమివ్వడంతో- ఆ చిత్రవిజయం సునీల్‌ని హీరోగా నిలబెట్టిందనే చెప్పాలి. తదుపరి వచ్చిన కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు చిత్రం- నేటి తెలుగు చిత్రాలపై గొప్ప వ్యంగ్యాస్త్రం. ఈ చిత్రంలో సునీల్ నటన కూడా గొప్పగా ఉంది. కానీ రామ్ గోపాల్ వర్మ ముద్రకి తెలుగు సినీ ప్రేక్షకులు ఠారెత్తిపోతున్న రోజులివి. అందువల్ల కనీసం ఓ మాదిరిగానైనా ఆడాల్సిన చిత్రం ఘోరపరాజయాన్ని చవి చూసింది అనుకోవాలి. పూలరంగడు సునీల్ హీరోగా వచ్చిన నాల్గవ సినిమా.
పూలరంగడు చిత్రకథలో మర్యాదరామన్న ఛాయలున్నాయి, ఆ పస లేదు. మర్యాదరామన్న చిత్రంలో హీరో పాత్ర ఉదాత్తమైనది. ఈ చిత్రంలో హీరో పాత్రపట్ల దర్శకుడికీ, నటుడికీ కూడా అవగాహన ఉన్నదనిపించదు. చేతకాని డాక్టరుగా ఓ పేషెంటుకి ముందుపళ్లన్నీ పీకడం- అమానుషమని ప్రేక్షకులకి అనిపించొచ్చు కాక, హాస్యమని దర్శకుడికి అనిపించింది. సునీల్ నటన హాస్యానికీ-అపహాస్యానికీ, అమాయకత్వానికీ-మోసానికీ, అవకాశవాదానికీ-మానవత్వానికీ మధ్య ఊగిసలాడిన తీరు అసందర్భంగా ఉంది. దేవ్ గిల్ విలన్‌గా చూడ్డానికి బాగున్నాడు. నటించకుండా పాత్రలో జీవించి ఉంటే ఇంకా బాగుండేవాడు. ప్రదీప్ రావత్ గత చిత్రాలకు భిన్నంగా, హుందాగా ఉన్నాడు. ఆలీ తన పాత్రకి న్యాయం చేశాడు. రఘుబాబు పాత్ర ఎలాంటిదైనా- అతడి ఉనికి చిత్రానికి అదనపు ఆకర్షణ. కోట శ్రీనివాసరావు పాత్ర చిన్నది. ఆయనా, మిగతావారూ తమ స్థాయికి న్యాయం చేకూర్చారు.
తనకి చిత్రాలు లేని తరుణంలో ఆరతీ అగర్వాల్ సునీల్ పక్కన అందాలరాముడులో కథానాయికగా నటించింది. తర్వాతి రెండు చిత్రాల్లోనూ- సునీల్ పక్కన పేరుపడిన హీరోయిన్లు లేరు. ఈ చిత్రంలోనూ ఇషా చావ్లా- అన్యమనస్కంగా అనిపించింది.
చిత్రం పొడవునా సంభాషణలు బాగున్నాయి. కొన్నిచోట్ల మరీ బాగున్నాయి. కానీ అవి చిత్రంలో కలిసిపోలేదు. కథతో నిమిత్తం లేకుండా విడిగా విన్నా బాగుంటాయి. నిజానికీ చిత్రంలో చెప్పుకోతగ్గది క్లైమాక్స్. అందుకు సునీల్‌ని సిక్స్ పాక్‌లో చూపించడం కథనం విలువని పెంచింది. సిక్స్ పాక్ కోసం సునీల్ పడిన శ్రమ గురించి మీడియాలో చాలా ప్రచారమైంది. సునీల్ డాన్సులకి కూడా చాలా శ్రమ పడినట్లు అనిపిస్తుంది. స్వతహాగా సునీల్‌కి డాన్సుల్లో సౌలభ్యముంది. హీరోగా తన్ను తాను నిరూపించుకోవాలన్న తాపత్రయం అతడికి అనవసరం. ఏదిఏమైనా ఈ చిత్రంలో డాన్సుల్లో అతడు రాణించాడనే చెప్పాలి. కోరియోగ్రాఫీ అభినందనీయం. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. ఇక్కడ క్లిక్ చేసి మీ అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు.
దర్శకుడు వీరభద్రమ్‌లో టాలెంట్ ఉంది. ఈ చిత్ర విజయానికి తన టాలెంటే కారణం అనుకోకపోతే అది రాణించే అవకాశముంది. ఈ విషయంలో దర్శకులు రాజమౌళిని ఆదర్శంగా తీసుకోవాలి.
పూలరంగడు ఘనవిజయాన్ని సాధించిందని అంటున్నారు. నిర్మాత, దర్శకుడు, హీరోలు, తదితరులకు అభినందనలు. మున్ముందు వారు తెలుగు చిత్రాలకీ అభినందనలు తేగలరని ఆశిద్దాం.  
  
Exit mobile version