Site icon వసుంధర అక్షరజాలం

రచ్చ- చిత్రసమీక్ష

స్వతంత్ర భారతానికి తొలి ప్రధాని జవహర్‍లాల్ నెహ్రూ. 1964లో ఆయన మరణించేక లాల్ బహదూర్ శాస్త్రి ఆ పదవి చేపట్టి గొప్పగా రాణించినా 1966లో ఆయన అకాల మరణానికి గురైనప్పుడు- కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పలువురు పోటీ పడ్డారు. వారి మధ్య రాజీ కుదర్చడానికి నెహ్రూ కుమార్తె ఇందిరను తాత్కాలికంగా భారత ప్రధానిగా ప్రతిపాదించారు పెద్దలు. ఆ ఏర్పాటుకి ప్రజల ఆమోదం ఎంతలా లభించిందని కాంగ్రెస్ పార్టీ భావించిందంటే- ఇందిర కుటుంబీకులకు మాత్రమే పార్టీ నాయకత్వాన్ని అప్పగించడం సంప్రదాయంగా మారిపోయింది. తలలు పండిన రాజనీతిజ్ఞులు కూడా ఆ సంప్రదాయాన్ని సహజంగా భావించడం విశేషం. 1984లో ఇందిర తన అంగరక్షకుల చేతిలో హత్యకు గురైతే- పార్టీ అది ఆమె త్యాగంగా భావించింది. ఆమె కుమారుడు రాజీవ్‍ని పైలట్ పదవినుంచి నేరుగా భారత ప్రధాని చేసింది. రాజీవ్‍ ప్రధానిగా అటు దేశానికి, ఇటు పార్టీకి చెప్పుకోతగ్గ ప్రయోజనాలు కలుగకపోయినా- ప్రస్తుతం దేశంలో ఎన్నో ప్రణాళికలు, సంస్థలు మహాత్ముని కంటే ఎక్కువగా రాజీవ్ పేరిట ఉండడం గమనార్హం. ఆ తర్వాత రాజీవ్ నాయకత్వంలో పార్టీ ఘోర పరాజయం చవి చూసింది. శ్రీలంక వ్యవహారంలో జోక్యం చేసుకోవాలన్న రాజీవ్ నిర్ణయం 1991లో ఆయన్ను దారుణ హత్యకు గురి చేసింది. రాజీవ్ ఆకస్మిక మరణం కాంగ్రెస్ పార్టీని అయోమయంలో పడేసింది. ఇందిర కుటుంబానికి విధేయుడన్న కారణంగా తాత్కాలికంగా పివి నరసింహారావు భారత ప్రధాని అయ్యాడు. అప్పుడు పివి దేశానికి ఆర్థికాభివృద్ధినిచ్చాడు. మన్‍మోహన్ వంటి సమర్ధుడికి ఉచితాసనమిచ్చాడు. యావత్ప్రపంచం ఆయన్ను దేశం గతిని మార్చి ప్రగతికి మళ్లించినవాడిగా గుర్తింపునిచ్చింది. ఐనా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందిర కోడలు సోనియాని మాత్రమే నేతగా ఆమోదించింది. పివి కన్ను మూయగానే ఆయన్ను తలపుల్లోంచి తొలగించింది. దేశానికి సోనియా కానీ, ఆమె కుమారుడు రాహుల్ కానీ కాకుండా- మన్‍మోహన్ ప్రధానిగా కొనసాగితే- అది సోనియా రాజనీతిజ్ఞతే కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంకల్పం కాదు.  చదువుకునే వయసులో విద్యాధిక్యతకూ, రాజకీయంగా ప్రజాసేవకూ- కృషి చేయని రాహుల్ (సోనియా కుమారుడు) రాజకీయాల్లో ప్రముఖపాత్ర వహించే రోజు కోసం ఆ పార్టీ సభ్యులు ఎదురు చూస్తున్నారు. భారత పౌరులు, మేధావులు కూడా రాహుల్ అర్హతలకంటే అతడి శీఘ్ర ఆగమనం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇదీ మన దేశ రాజకీయ పరిణతి, పరిస్థితి.

మన దేశంలో- ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో- సినిమాలదీ, రాజకీయాలదీ అవినాభావసంబంధం. మహా నటుడు ఎన్టీ రామారావు- రాజకీయాల్లో ప్రవేశించిన సంవత్సరంలోగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక రికార్డు. ఐతే ప్రస్తుతాంశం అది కాదు. ప్రతిభ, అర్హతలతో నిమిత్తం లేకుండా, వారసత్వానికి ప్రాధాన్యమిచ్చే ప్రజాస్వామ్యం సామ్యాన్ని సినీస్వామ్యమూ స్వీకరించింది. ప్రజలామోదించినట్లే ప్రేక్షకులూ ఆమోదిస్తున్నారు. ఇదీ మన చిత్ర పరిశ్రమ పరిణతి, పరిస్థితి.

ఈ నేపథ్యం రచ్చ చిత్రానికి ఎంతైనా అవసరం. 

తెలుగువారి ప్రియతమ సినీ కథానాయకుడు చిరంజీవి- తొలుత చిన్న చిన్న పాత్రలూ, ప్రతినాయక పాత్రలూ ఎన్నో వేసి వేసి తన సత్తా నిరూపించుకుని నటుడిగా ఎదిగి క్రమంగా కథానాయకుడై, సూపర్ స్టారై, చివరికి మెగాస్టార్ అనిపించుకున్నాడు. ఆయన తనయుడు రామ్ చరణ్ తేజను నటుడిగా ఎదుగకుండానే సూపర్ స్టార్‍గా చూడాలని సినీస్వామ్యం మనసు పడుతోంది. రామ్ చరణ్‍ ఎత్తరి కాడు. అందగాడు కూడా కాదు. రంగస్థలానుభవం లేదు. కనీసం తెలుగు భాష విషయమై తగిన కృషి కూడా చేసినట్లు తోచదు. అందువల్ల తొలి చిత్రం ‘చిరుత’ తుస్సుమంది. ఐనా పట్టు వదలక మలి చిత్రంలోనూ ఆతణ్ణి సూపర్ స్టార్ చెయ్యాలన్న ప్రయత్నం జరిగింది. అలా వచ్చిన ‘మగధీర’- రామ్ చరణ్‍ని అగ్రస్థానానికి తీసుకెళ్లింది. కానీ- సునీల్ వంటి కమేడియన్ హీరోగా, గ్లామరుతో నిమిత్తం లేని సలోనీని హీరోయిన్‍గా సినిమా (మర్యాద రామన్న) తీసినా- పెద్ద హిట్ చెయ్యగల అపూర్వ దర్శకుడు రాజమౌళి- ఆ చిత్రానికి అసలు సిసలు మగధీర అని లోకజ్ఞానం చెబుతుంది. అందుకే ఆ తర్వాత మరో దర్శకుడితో కాస్త ప్రయోగాత్మకంగా తీసిన రామ్ చరణ్ తదుపరి చిత్రం ‘ఆరెంజ్’ మళ్లీ తుస్సుమంది. ఐనా రామ్ చరణ్‍ని నటుడుగా కాక సూపర్ స్టార్‍గానే స్థిరపర్చాలనే పట్టుదలతో భారీ నిర్మాణవ్యయంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం రచ్చ.

కథా కమామీషూ- ఇలాంటి చిత్రాలకు కథ అక్కర్లేదనుకోవడం రివాజు. అదే పాటించడం జరిగింది ఈ చిత్రంలో. ఐతే లేని కథని ఉందన్నట్లు చూపగల ప్రతిభ తనకుందని దర్శకుడు సంపత్ నంది నిరూపించుకున్నాడు. మరీ పేరెక్కుఫున్న దర్శకుడైతే హీరో ఘనత మరుగున పడిపోతుందన్న అనుమానంతో ఈ దర్శకుణ్ణి ఎన్నుకుని ఉండొచ్చు. కానీ ఈ చిత్రంలో కథనానిదే పెద్ద పీట. కథనానికి తగిన మాటలు చిత్రానికి వన్నె తెచ్చాయి. కానీ కొన్ని మాటలు సాటి హీరో(ల)ని దెబ్బ కొట్టడానికే అన్నట్లున్నాయి. ఆ హీరో(ల)కీ అభిమానులుంటారన్న విషయం విస్మరించడంవల్ల అలాంటి ప్రయత్నం సినీ రాజకీయం అనిపించుకుంటుంది. అది పరిశ్రమకు మంచిది కాదు.

పాటలు, ఫైట్సు- సినిమాలో సంగీతం- ముఖ్యంగా నేపథ్య సంగీతం- గొప్పగా ఉంది. పాటలు మామూలుగానే ఉన్నా- చిత్రం పొడుగునా మెరిసే టైటిల్ సాంగ్ అందరు ప్రేక్షకుల్నీ అలరిస్తుంది.

హీరో- రామ్ చరణ్ మాటల్లో, నడకలో తండ్రిని అనుకరించడం హుందాగా ఉంది. పాటల్లో, ఫైట్సులో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ముఖ్యంగా నృత్యాల్లో- ఇతణ్ణి మించగలవారు లేరేమో అనిపిస్తుంది. నటనలో నేటి అభిరుచులకు అనుగుణంగా, సహజత్వం పాలెక్కువ ఉండడం అభినందనీయం. ఐతే తండ్రి పోలికలు కాస్త ఎక్కువగా తీసుకు రావడానికి జరిగిన ప్రయత్నం వల్లనేమో, ముఖం ఏదోలా అక్కడక్కడ విముఖంగా కూడా అనిపించింది.  ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‍బాబు, కృష్ణంరాజు, మోహన్‍బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వగైరాలందరూ- సూపర్ స్టార్స్ చెయ్యబడలేదు. అయ్యారు.   అది గ్రహించి- ఉన్నవి కాపాడుకుని, లేనివి పూడ్చుకుని, కథకి ప్రాధాన్యమున్న చిత్రాలనే ఎన్నుకుని, నటుడిగా ఎదగాలనుకుంటే- కాలక్రమేణా తనకి తానుగా సూపర్ స్టార్ కాగల పట్టుదల, ఇతడికి ఉన్నాయి. జంజీర్ కోసం వేచి చూద్దాం.     

హీరోయిన్- సినిమాల్లో ఆడపిల్లకి అవసరమైన- అందం, అదృష్టం, చొరవ, తెగువ– అన్నీ తనకి ఉన్నాయని నిరూపించుకుంది తమన్నా. అందుకు తగిన నటన కూడా కాస్త ప్రదర్శించడం ముదావహం. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన కృతకంగా అనిపించినా- అది కథానుగుణమని తర్వాత తెలుస్తుంది. రామ్ చరణ్‍తో పోటీపడి నటించిన తమన్నాకి ఈ చిత్రంలో అతడికంటే ఎక్కువ మార్కులు పడొచ్చు. అతగాడు కేవలం చిరంజీవి అభిమానులకి మాత్రమే పరిమితమైతే- ఆమె మహాజనానికి మరదలు పిల్లగా రాణించింది.

ఇతర నటీనటులు- ఇంత చేశాక- రామ్ చరణ్ తండ్రి పాత్రకి పార్దీబన్ బదులు చిరంజీవినే ఎన్నుకుని ఉంటే- అభిమానులకి మరింత మజాగా ఉండేది. మిగతా నటీనటులు ఫరవాలేదు. కామెడీ సన్నివేశాలకు తగిన నటన ప్రదర్శించారు ప్రముఖ కామెడీ నటులు. ఈ చిత్రంలో ప్రముఖులకంటే- కానివారు మరింత బాగా నటించారని చెప్పొచ్చు. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ కొంత నిరాశ పర్చినా- ఎమ్మెస్ నారాయణ, ఝాన్సీ- చిన్న పాత్రల్లోనే గుర్తుండిపోయే నటన ప్రదర్శించారు.

సూచన- హింసనే కథాంశంగా తీసుకున్న సిప్పీ ‘షోలే’,  వర్మ ‘సత్యా’ చిత్రాల్లో కౄరత్వం. రక్తం కనిపించే సందర్భాలు చాలా తక్కువ. ఐనా ఎన్నో సన్నివేశాలు వళ్లు జలదరించేలా, మనసుకు హత్తుకుని పోయి, ఆలోచనల్ని వెంటాడేలా ఉంటాయి. మన దర్శకులు- ఆ ప్రతిభను (లేకుంటే) సంతరించుకోవడమూ, (ఉంటే) ఆదర్శంగా తీసుకోవడమూ- ప్రేక్షకుల ఆరోగ్యానికి అత్యవసరం. లేకుంటే- కాళ్లు, చేతులు, తలలు నరుక్కోవడం- నిత్య జీవితంలో భాగంగా భావించే ప్రమాదకర అనారోగ్య దశ ఇంకా ముదురుతుంది సమాజంలో. 

హెచ్చరిక- దొంగతనం, స్మగ్లింగు, అబద్ధాలు, బెట్టింగులు, హత్యలు- ఇవి చేసేవారే హీరోలని- అన్ని చిత్రాల్లోలాగే ఈ చిత్రంలోనూ అంతర్లీనంగా ఓ సందేశం ఉంది. దినపత్రికలు చదివేవారికి- అలాంటి వారు రాజకీయాల్లోనూ హీరోలుగా చెలామణీ అయిపోతున్నారని తెలుస్తుంది. ఇలాంటి చిత్రాల్లో- మద్యపానం, ధూమపానం వగైరాలతో పాటు- ఈ చిత్రంలో హీరోని అనుకరించడం- సమాజం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటించవలసి ఉంది.  

చివరగా- ఆలోచించకుండా చూస్తే ఈ చిత్రం ఎక్కడా విసుగనిపించదు. హాల్లో ఉన్నంతసేపూ తగినంత్ వినోదాన్నిసుంది. హాల్లోంచి బయటికి వచ్చేక కూడా ఆలోచించకూడని చిత్రం ఇది. మెగాస్టార్ చిరంజీవి నుంచి అభిమానులు ఏమాశిస్తారో అన్నీ పుష్కలంగా ఉన్న ఈ చిత్రాన్ని- మిగతా ప్రేక్షకులతో మనకేంటిలే అని కేవలం చిరంజీవి అభిమానులకోసమే తయారు చేశారా అనిపిస్తుంది. చిరంజీవికి అభిమానులు కానివారుంటారా అనుకుంటే- ఈ చిత్రం సకలజనప్రియం.

సినీజోష్ సమీక్ష       ట్రైలర్      ఆడియోలో పాటలు

Exit mobile version