మే 7, 2012

పాడుతా తీయగా

Posted in పాడుతా తీయగా at 11:26 ఉద. by వసుంధర

టివిలో వివిధ తెలుగు ఛానెల్సులో వస్తున్న పాటల పోటీ కార్యక్రమాల్లో- పాడుతా తీయగా (ఈటివి) ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ప్రతి సోమవారం రాత్రి 9.30కి ఆరంభమయ్యే ఈ కార్యక్రమాన్ని- ప్రముఖ సంగీతజ్ఞుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంకితభావం, శ్రద్ధాసక్తులు, అసమాన ప్రతిభ అందుకు ముఖ్య కారణం.

మీడియాలో బాలుగా సుప్రసిద్ధులైన బాలసుబ్రహ్మణ్యంని- ఆయన పేరులోని రెండు పొడి అక్షరాలతో బాసు అనడం అక్షరజాలం ప్రీతి. బాసు ఆధ్వర్యంలో నవంబర్ 7న రాగయాగం పేరిట మరో కొత్త పొటీ మొదలైంది. ఇందులో పాల్గొనే గాయనీగాయకుల వయోపరిమితి 18-24. రెండు వారాలపాటు కొంతమందిచేత చకచకా పాటలు పాడించి- 36మందిని ఎంపిక చేసారు. ఈ ప్రాథమిక దశలో పాల్గొన్నవారి ప్రావీణ్యం అంతంతమాత్రం అనిపించి కొంత నిరుత్సాహం కలిగింది. ఐతే నవంబర్ 21న అసలు పోటీ మొదలు కాగానే ఆ నిరుత్సాహం ఉత్సాహంగా మారిపోయింది. ఎంపికైన 36మందినీ నాలుగు భాగాలుగా విభజించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో చక్కని పాటలతోపాటు ఆసక్తికరమైన ఎన్నో విశేషాలు కూడా తెలిసాయి.

రాగయాగం వీనుల విందుగా, రసజ్ఞులకి పసందుగా కొనసాగింది. పోటీ పేరిట క్రమంగా ఒకొక్కరినే తప్పించుకుంటూ పోతున్నప్పుడు- అభ్యర్ధుల మనోభావాలెలా ఉన్న- ప్రేక్షకులకి మాత్రం మనసు కలుక్కుమనేది. అలా ఏప్రిల్ 30, 2012న రాగయాగం సెమిఫైనల్స్ ముగించుకుంది. ఫైనల్స్ కి చేరుకున్నవారు నలుగురుః తేజస్విని, హరిణి, రోహిత్, సాయిచరణ్. ఎవరికి వారే ‘సరిలేరు నాకెవ్వరూ’ అన్న తీరులో తమ ప్రతిభని ప్రదర్శించారు. వీరి పాటల్ని వినడం ఒక అనుభవం. అందులోనూ ఈ రాత్రినుంచి (మే 7) ఫైనల్స్.తప్పక చూడాల్సిందే.

ఈ కార్యక్రమంలో మెచ్చుకోతగ్గ అంశాలెన్నో ఉన్నాయి. 1. పోటీదార్లు ఒకే కుటుంbaబ సభ్యుల్లా ఆత్మీయంగా మసలడం. ఓటమిని చిరునవ్వుతో ఆహ్వానించి విజేతలని అభినందించడం. 2. బాసు వ్యాఖ్యలు,విశ్లేషణః గాయకులకే కాదు- ప్రేక్షకులకీ, సంగీతప్రియులకీ కూడా ఈ కార్యక్రమం ద్వారా గురువు, మిత్రుడు, ఆత్మబంధువు. 3. సినీ పరిశ్రమకు సంబంధించిన ఎందరో మహానుభావులు, అపురూప విశేషాలు ఈ కార్యక్రమం ద్వారా పరిచితమౌతున్నాయి. 4. భాష, పలుకు, ఉచ్చారణ విషయంలో ఎక్కడా రాజీకి తావివ్వని బాసు తీరు- నేటి ఆంగ్లమాధ్యమ సమాజంలో చెప్పుకోతగ్గ సాహితీసేవ.

ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు అవసరం ఆనిపిస్తుందిః 1. ఆరంభంలో బాసు పాడే పాట సినిమాలనుంచి కాక లలిత గీతం ఐతే బాగుంటుంది. అలాగే ఆయన తను పాడినవి కాక వేరే గాయకులు పాడినవి ఎన్నుకుంటే బాగుంటుంది. (ఉదాః రాజేశ్వరరావు ‘చల్ల గాలిలో’). 2. గాయనీ గాయకులు సినిమాలకు సంబంధించని లలిత గీతాలు కూడా ఎన్నుకుని పాడితే బాగుంటుంది. 3. విన్నవీ, తెలిసినవీ పాడ్డంవల్ల సృజనాత్మకతను పరీక్షించే అవకాశం లేదు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా స్వరపరచిన పాటల్ని తొలిసారిగా పాడించి వినిపిస్తే- అదో థ్రిల్.

ఈ కార్యక్రమంలో మాకు నచ్చని అంశాలు కొన్ని ఉన్నాయిః 1. సినీ గీతాలకి ప్రాచుర్యం ఎక్కువ. ఐతే జనాలు పిల్లా చావ్ అన్నా, ఝుమ్మంది నాదం అన్నా ఒక్కలాగే పాడుకుంటారు. అది జనాకర్షణే తప్ప జనప్రియత్వం కాదు. సినీ గీతాల్లో అద్భుతమైనవి చాలానే ఉన్నప్పటికీ- ఈ కార్యక్రమంలో ఆ కవిత్వానికి, గాయకులకి, సంగీత దర్శకులకి లభించే పొగడ్తల్లో- సర్వత్ర వర్జయేత్ అనతగ్గ అతి గోచరిస్తోంది. అది పొగడ్తల విలువను బాగా తగ్గించి- అర్హత ఉన్నవారికి కూడా ‘నాన్నా పులీ’ కథ తీరులో అసౌకర్యాన్ని కలిగిస్తోంది.  2. గాయనీ గాయకుల్ని మెచ్చినప్పుడూ, పోటీనుంచి తప్పించాల్సి వచ్చినప్పుడూ, ఫైనల్సుకి ముగ్గురికి బదులు నలుగుర్ని ఎన్నుకున్నప్పుడూ- కొత్తదనం లేకుండా ఒకే తరహా వ్యాఖ్యల్ని పదేపదే వినిపించడం- నచ్చని సినిమాని పదేపదే చూసినంత్ విసుగు పుట్టిస్తోంది. ఈ విషయంలో కొత్తదనం సాధ్యం కాదనుకుంటే- నేరుగా, సూటిగా చెప్పడమే మంచిది. 3. ఎక్కువగా హుందాగా ఉండే బాసు- కార్యక్రమాన్ని రసవత్తరం చెయ్యడం కోసం- కమేడియన్ తరహా నటన, వ్యాఖ్యలు చేస్తున్నారు. మంది మనసులో ఆయనకున్న స్థ్హానం వల్ల- అవన్నీ ప్రస్తుతానికి ముచ్చటగానే ఉన్నా- తన సంకల్పానికి ఆయన ఇతర మార్గాల్ని అన్వేషించడం కూడా మంచిది.

చెప్ప్వాడికి వినేవాడు లోకువ అని సామెత. అది బాసు నిర్వహణతోపాటు, ఈ మా వ్యాఖ్యలకీ వర్తిస్తుంది. కానీ పాడుతా తీయగా వంటి ప్రయోజనాత్మక, ఆరోగ్యకర కార్యక్రమం కొనసాగడానికి ఈ స్పందన ఉడతాభక్తి కావాలని మా ఆశ. మరెందరివో స్పందనల్ని అక్షరజాలం ఆహ్వానిస్తోంది.

ఇంతమంచి కార్యక్రమానికి వేదికనిచ్చిన ఈటివికీ, ఇది చాలా గొప్ప కార్యక్రమం అనిపించేలా నిర్వహిస్తున్న బాసుకీ అక్షరజాలం అభివందనాలు.

Leave a Reply

%d bloggers like this: