మే 15, 2012

బాలనటిగా రేఖ

Posted in వెండి తెర ముచ్చట్లు at 11:12 ఉద. by వసుంధర

ప్రముఖ సినీ నటి రేఖ– నటనా జీవితం తెలుగులో రంగుల రాట్నం చిత్రంలో (1966) బాలనటిగా మొదలైంది. అప్పుడామె పేరు భానురేఖ. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించినా- 1970లో 1980 విడుదలైన సావన్ బాదోం (హిందీ) చిత్రం కథానాయికగా ఆమె తొలిచిత్రం అంటారు. ఆమె నటించిన పలు చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఉత్తరాదిలో త్వరితగతిని అగ్రశ్రేణి తార అనిపించుకున్న రేఖకి- నటిగా కంటే రూప లావణ్యాలకూ, వంపుసొంపులకూ ఎక్కువ పేరుపడింది. ఎంతలా అంటే- ఉత్తమాభిరుచికి పేరుపడ్డ ప్రముఖ సినీ దర్శకుడు హృషీకేశ్ ముఖర్జీ- తన ఖూబ్ సూరత్ చిత్రానికి రేఖని కథానాయికగా ఎన్నుకోవడాన్ని పరిహసించేటంత. ఐతే ఆ చిత్రం విడుదలయ్యేక- ఆ పాత్రలో రేఖని తప్ప వేరొకర్ని ఊహించుకోలేమన్నంత గొప్ప అనుభూతి కలిగింది విమర్శకులకి. రేఖ నటజీవితాన్ని ఓ మలుపు తిప్పిన ఆ చిత్రం తర్వాత- దర్శకులు ఆమెని కేవలం నటనకోసమే తమతమ చిత్రాల్లోకి తీసుకొనడం మొదలైంది. నటిగా ఆమె సాధించిన విజయాల కారణంగానే ఇటీవల ఆమెను భారత దేశాధ్యక్షురాలు- రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నుకొనడం జరిగింది. 1966లో బాలనటిగా హావభావాలు, నాట్యవిన్యాసాలలో  రేఖ కనపర్చిన అనూహ్యమైన సహజ ప్రతిభ- మరో 14 సంవత్సరాల వరకూ మరుగున పడిపోవడానికి కారణం  కేవలం దర్శకులే అనుకోవాలి. రంగుల రాట్నం చిత్రానికి బిఎన్ రెడ్డి, ఖూబ్ సూరత్ కి హృషీకేశ్ ముఖర్జీ దర్శకులు కావడం గమనార్హం. నటీనటుల రాణింపుకి దర్శకుల ప్రాధాన్యానికి ఈ ఉదంతమో మచ్చుతునక.   

బాలనటిగా రేఖ విడియోకు లింకు ఇచ్చిన శ్రీదేవి మురళీధర్ కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: