మే 15, 2012

విశ్వసాంఖ్యాచార్య డా.లక్కోజు సంజీవరాయశర్మ

Posted in శాస్త్రీయం at 9:33 ఉద. by వసుంధర

మనమధ్యనే మసిలినా మనకు తెలియని మహానుభావులు మన తెలుగువారిలోనే ఎందరో ఉన్నారు. వారిలో డా. లక్కోజు సంకీవరాయశర్మ ఒకరు. వారి గురించి శ్రీ టివిఎస్ శాస్త్రి అందజేసిన అద్భుత ఆశ్చర్యకర విశేషాలు (శ్రీమతి శ్రీదేవి మురళీధర్ కి ధన్యవాదాలతో) వారి మాటల్లోనే ఈక్రింద పొందుపరుస్తున్నాం-

విశ్వసాంఖ్యాచార్య,  గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ— 1966 డిసెంబరు ఏడో తేదీ హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక–
2 power 103 ఎంత?
సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని.
‘క’ నుంచి ‘క్ష’ వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, ‘స, రి, గ, మ, ప, ద, ని” అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు…
కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా… కాదు.
పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా… కాదు. పుట్టుగుడ్డి! పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది.
ఆయనే గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!
శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా… మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది… ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ అందరూ తలలు పట్టుకుంటారు! దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం… ”ఒక కోటి 84 లక్షల, 46 వేల 74 కోట్ల 40 లక్షల, 73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట… (1,84,46,74,40,73,70,95,51,615!)
ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే… అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి రెండింతలు!
అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు! ఇదంతా అబ్బురమనిపించవచ్చు. కానీ సంజీవరాయశర్మ గణితావధాన మహిమ అదంతా!
సంజీవరాయశర్మ 1907 నవంబరు నెల 22న కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలోని కల్లూరు జిల్లాలో జన్మించారు. జననీ జనకులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు. జన్మతః అంధుడు కావడంతో పురుడు పోసిన మహిళ గొంతు నులిమి దిబ్బలో పాతెయ్యమంది. కొందరు బంధువులు నోట్లో వడ్ల గింజ వేశారు. అయినా ఆయన్ని మరణం ఏమీ చేయలేకపోయింది. అప్పట్లో బ్రెయిలీ లిపి లేదు. పోనీ అంధుల్ని చేరదీసే వ్యవస్థా లేదు. శర్మ అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవే ఆయన విన్నారు. తల్లిదండ్రులు… ఇతరులు చెప్పే మాటలు, చేసే చిన్నలెక్కలు విన్నారు. ఒకటి, రెండు, మూడు…. ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు! సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షిత్రాలు, వారాలు, పక్షాలు… గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి పెంచారు. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతోన్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితులై నేర్చుకొన్నారు.
సంజీవరాయశర్మ తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించారు. అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను పలు ప్రదర్శనలిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబరు 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ సంజీవరాయశర్మ గణితావధానమే! ఆయన పొందిన సన్మానాలు, ప్రదర్శనలు ఒక పుస్తకం అంత ఉన్నాయి. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్, శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం!
అప్పట్లో అనీబ్ సెంట్ , నెహ్రూ, రాజేంద్రప్రసాద్ తో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్లా కీర్తించారు. శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు. అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేదావి ఇల్లు కదలలేకపోయారు. వివిధ విశ్వవిద్యాలయాలు… ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. చిత్రమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల పెట్టెను  దొంగలు తస్కరించారు.ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్ మిల్టన్ , బ్రెయిలీ లిపిని  కనుగొన్న హెలెన్  కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు మంచి శిక్షణ పొందారు. కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే… ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు శర్మ.ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ”ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం” అని శర్మనుద్దేశించి అన్నారు. శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ఆయన  ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయశర్మని రక్షించుకోలేకపోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు. ‘అంక విద్యాసాగర’ విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు! ఈ నోబెల్ బహుమతులు, మెగసెసేలు, జ్ఞాన పీఠాలు … ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో!(‘ఈనాడు’ లో  శ్రీ చీకోలు సుందరయ్య గారి వ్యాసం ఆధారంగా,శ్రీ సుందరయ్య గారికి కృతజ్ఞతలతో…)
వారితో నా ప్రత్యక్ష  పరిచయం—-
నేను 1981 నుండి 1985 వరకూ శ్రీ కాళహస్తిలో పనిచేశాను.ఆ రోజుల్లో ఆయన స్వామి వారి సన్నిధిలో రోజూ సాయంత్రం వయోలిన్ వాయించేవారు.అంధులు.వయోలిన్ మీద కమాన్ కర్ర నాట్యంచేస్తుంటే,ద్వారం వారి వయోలిన్ సంగీతం గుర్తుకు వచ్చేది! నేను పనిచేసే బాంక్ సమీపంలోనే ఒక చిన్న పాడుపడ్డ ఇంటిలో వుండేవారు.”ప్రతి రోజూ బాంక్ కు వచ్చి కాసేపు నాతో ముచ్చటించండి,మీతో సరదాగా మాట్లాడుకోవచ్చు,ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు”అని వారిని వేడుకున్నాను.వారు అలానే,సాయంత్రం నాలుగు గంటల సమయంలో వచ్చేవారు.రాగానే,వారికి ఫలహారం,కాఫీ ఏర్పాటు చేసే వాడిని.వాటిని ప్రేమతో స్వీకరించి.రోజుకొక ‘గణిత విన్యాసాన్ని’ చూపించేవారు.నేను M.A(Maths).ఆయన ,”బాబుగారు! మీరు ఏమి చదువుకున్నారు?”అని అడిగినప్పుడు చాలా సిగ్గుపడ్డాను.యెందుకంటే,ఆ అ’గణిత’ మేధావి ముందు మనం నిరక్షురలం క్రింద లెక్క వేసుకొనవచ్చు.”మీరు ఏ రోజు పుట్టారు బాబు గారు?”అని అడిగారు. దానికి నేను సమాధానంగా,”శ్రీ వికృతి నామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు,రోహిణీ నక్షత్రంలో జన్మించాను.”అని చెప్పాను.వెంటనే రెండు నిముషాలలోపే,”అంటే, 22 -12 -1950 న,మంగళవారం జన్మించారు” అని చెప్పి నన్ను ఆశ్చర్యంలో ముంచేశారు.యిలా రోజుకొక,విన్యాసాన్నిచూసే వాడిని.ఎప్పుడన్నా,నూతన వస్త్రాలను ఇచ్చి,స్వీకరించమని ప్రాధేయ పడేవాడిని.చాలా అభిమాన వంతులు.ఎవరినుండి ఆయాచితంగా యేమీ ఆశించరు.అప్పుడప్పుడు మాత్రమే స్వీకరించే వారు.జీవనం గడవటం చాలా ఇబ్బందిగా వుండేది.పైగా,వీరికి ఒక సహాయకుడు కూడా వుండేవారు.ఒక రోజు,’బాబుగారూ! నాకొక చిన్న సహాయం చేయగలరా?’అని ప్రాదేయపడినంత పని చేశారు.”చెప్పండి,నాకు చేతనైతే ఎన్ని కష్టాలొచ్చినా సహాయం చేయటానికి వెనుకాడను”అని చెప్పాను.స్కూల్ పిల్లకు నా విద్యను ప్రదర్శించి,యాజమాన్యం వారు సహకారం చేస్తే,ఏదో కొంత ధనం చేకూరి,నా కుటుంబ పోషణ భారం సులభం అవుతుంది.అలా జీవించటంలో నాకొక తృప్తి కూడా వుంటుంది” అని వారి కోరికను వెళ్ల బుచ్చారు.వెంటనే,నా మిత్రుడు,హైస్కూల్ హెడ్ మాస్టర్ గారైన శ్రీ అంగర ఆంజనేయ శర్మ గారి సహాయంతో  శ్రీ సంజీవ రాయ శర్మ గారిని తీసుకొని,విద్యాశాఖ లోని జిల్లా అధికారిని చిత్తూరులోకలిశాం.వారు వీరి విద్యను చూసి ఆశ్చర్య పడి,ప్రతి విద్యాలయానికి,వీరి విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయ వలసినదిగా వెంటనే సూచనలు ఇచ్చారు.అంతే కాకుండా హైదరాబాద్ లోని  పై అధికారులకు వీరి ప్రజ్ఞా పాటవాలను గురించి  కూడా తెలియ చేశారు.అలా వారు,వారానికి ఒక విద్యాలయాన్ని సందర్శించే వారు.విద్యాలయం తరఫున ఏ ఉపాధ్యాయుడో  వచ్చి వారిని తీసుకొని వెళ్లి మళ్ళీ ఇంటి వద్ద దించేవారు.అలా వారికి తృప్తినిచ్చే వ్యాసంగం ద్వారా కొంతా ఆర్ధిక స్థితి కూడా మెరుగు పడింది.సాయంత్రపు వేళలో,స్వామి వారి గుడి తలుపులు వీరి వయోలిన్ వాదన తోనే తెరుచుకునేవి.నాద,నాట్య ప్రియుడైన నటరాజుకు మరి అటువంటి వారంటేనే ఇష్టం కదా!అలా వారి జీవనం సాగుతుండేది.ఏ విద్యాలయంలోనూ,ఏ గురువు వద్ద అభ్యసించకుండా యెంతో ఘనమైన విద్యను సొంతం చేసుకున్న ఒక గొప్ప మేధావి శ్రీ శర్మ గారు.1985 లో నేను అక్కడినుండి బదలీ అయ్యి గుంటూరుకు వచ్చాను.చాలా కాలం వరకూ,వారి యోగ క్షేమాలు తెలుసుకున్నాను.నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడల్లా వారిని కలుసుకొనే వాడిని.
1997 లో వారు మరణించి నపుడు నేను వెళ్ళలేక పోయాను.1997 లో నాకు గుండెకు చికిత్సజరగటం వల్ల,వెళ్ల లేక పోయాను.
                      శ్రీనివాస రామానుజం గారు చిన్న తనంలోనే మరణించారు.శ్రీమతి శకుంతలా దేవి గారిని చూసే  అదృష్టం కలుగలేదు.పుట్టుకతోనే గణితాన్ని ఔపోసన పట్టిన శ్రీ శర్మ గారితో నాకు ప్రత్యక్ష పరిచయం కలగటం,నిజంగా అది పూర్వజన్మ పుణ్యఫలమే!
ఆ అ’గణిత’మేధావి కి మనం ఘనమైన నివాళిని  సమర్పించుకుందాం! 

9 వ్యాఖ్యలు »

 1. TVS SASTRY said,

  యెలా పంపాలోతెలియజేయగలరు.,మీ మెయిల్ id కూడా తెలుపగలరు.
  TVS SASTRY

 2. TVS SASTRY said,

  గౌరవనీయులైన సంపాదకులకు,
  నేనొక రచయితను.నా రచనలు’శిరాకదంబం’ అనే వెబ్ పత్రికలో ప్రతివారం పడుతున్నాయి.ఈ లింకులో నా రచనలను చదగలరు.

  (టి. వి. యస్. శాస్త్రి గారి పేజీ) .మీ పత్రిక వంటి దానిలో నా రచనలను చూసుకోవాలని నా తపన.నా రచనలు మీకు నచ్చితే,పంపమంటే పంపుతాను.మీ పత్రికలో కూడా నా వ్యాసాలు కొన్ని ప్రచురించారు,శ్రీదేవి మురళీధర్ గారు పంపారు. మీ సమాధానం కొరకు వేచిచూస్తుంటాను.

  భవదీయుడు,

  టీవీయస్.శాస్త్రి

  తెలుగువారందరము తెలుగులోనే మాట్లాడుదాము
  తెలుగులోనే వ్రాద్దాము.దేశ భాషలందు తెలుగు లెస్స!
  (టి. వి. యస్. శాస్త్రి గారి పేజీ)

  • మీ అభిమానానికీ, ఆసక్తికీ ధన్యవాదాలు. మీ రచనలు బాగుంటున్నాయి. vasumdhara@gmail.com (మా ఈమెయిల్ చిరునామా) కి పంపగలరు.


Leave a Reply

%d bloggers like this: