జూన్ 14, 2012

గబ్బర్ సింగ్- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 12:40 సా. by వసుంధర

 మన సమాజంలో కొందరు రౌడీషీటర్లు. కొందరు ప్రజా నాయకులు. ఇద్దరి మాటలూ, చేతలూ ఒకేలా ఉంటాయి. కానీ రౌడీషీటర్లని మనసులో ఏవగించుకుంటాం. నాయకులని మనసారా అభిమానిస్తాం. బయటి ప్రాంతంవారికి మాత్రం ఇద్దరూ రౌడీషీటర్లే అని స్పష్టంగా తెలుస్తుంది.

మరి సినిమాలు సమకాలీన వాతావరణాన్ని ప్రతిబింబించాలిగా. అందుకని సాధారణంగా మన సినిమాల్లో- ఒకరితో ఒకరికి పడని ఇద్దరు పురుషులు ముఖ్యపాత్రలు. శత్రువుల్ని చావగొట్టడం, కౄరంగా హింసించడం, ఒకోసారి చంపేయడం కూడా ఇద్దరికీ తప్పనిపించదు. ఇద్దరిలో ఒకరు హీరో, ఒకరు విలన్. ప్రేక్షకులు విలన్ చేసిన తప్పులకి శిక్ష పడాలనుకుంటారు. హీరో విలన్ ని ఎంత కౄరంగా హింసించి చంపినా సెబాసంటారు. భాష రానివాళ్లు చూస్తే సినిమాలో ఇద్దరూ విలన్లే అనిపిస్తుంది.   

ఈ సంవత్సరం మే 11న విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రం ఆ మేరకి కొంత విభిన్నం అని చెప్పాలి. హీరో తన చేతలకు అనుగుణంగా చిన్నప్పట్నించీ విలన్ల గుణగణాల్ని ప్రేమించడమే కాదు, తన పేరు వెంకటరత్నం నాయుడు ఐనా, గబ్బర్ సింగ్ అని మార్చుకున్నాడు. ఈ ఆదర్శాన్ని మన నేతలు కూడా పాటించి తమ పేర్లు డాకూ మంగల్ సింగ్ అనో, ఫూలన్ దేవి అనో మార్చుకుంటే వారి దోపిడికి తగ్గట్లే ఉంటుంది కదూ!

ఆరంభంలోనే ఈ సినిమాలో కొత్తదనం. సాధారణంగా హీరోలకి చిన్నప్పుడు సవతి తల్లి వల్ల ఇబ్బందులు. ఈ చిత్రంలో హీరోకి సవతి తండ్రి. ఆయన సవతి తమ్ముడిపట్ల చూపే పక్షపాత బుద్ధిని సహించలేక చిన్నప్పుడే ఇల్లొదిలి పోలీసు ఇనస్పెక్టరై గబ్బర్ సింగ్ గా తిరిగొస్తాడు హీరో.

ఇక కథ విషయానికొస్తే ఇది హిందీలో వచ్చిన దబంగ్ చిత్రానికి తెలుగుసేత. అందులో హీరో సల్మాన్ ఖాన్. విలన్ సోనూ సూద్. ఆ సినిమా వారిద్దరిదీ. ఇందులో హీరో పవన్ కళ్యాణ్. విలన్ అభిమన్యు సింగ్. ఈ సినిమా పవన్ ఒక్కడిదే. ఆ సినిమాలో కథ బలమైన సన్నివేశాల చుట్టూ తిరిగి, ఉత్కంఠ రేపే క్లైమాక్స్ తో పకడ్బందీగా ఉంటే, ఈ సినిమాలో కథ పవన్ చుట్టూ తిరుగుతూ, బలహీనమైన సన్నివేశాలతో హడావుడిగా ముగిసిన క్లైమాక్స్ తో కాస్త గజిబిజిగా అనిపిస్తుంది. ఐతే సినిమా చూస్తున్నంతసేపూ ఎక్కడా విసుగనిపించదు. ఆ ఘనత మొత్తం సినిమాని తన భుజస్కంధాలమీద మోసిన పవన్ ది.  పవన్ ని అంత గొప్పగా ఉపయోగించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ది.’నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది’ వంటి మెరుపు డైలాగ్స్ కూడా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.

నటన పరంగా పవన్ గొప్పగా నటించాడనేందుకు లేదు. కానీ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, స్టైలు, స్టెప్సు అన్నీ అద్భుతంగా కుదిరి ఆ పాత్రలో అతణ్ణి తప్ప వేరెవర్నీ ఊహించుకోలేం అనిపిస్తుంది. మనకి చాలాకాలంగా తెలిసిన పవన్ ప్రత్యేకతలన్నీ ఈ సినిమా కోసమేనా అనిపించేటంత గొప్పగా ఇమిడాయి. ఆ మేరకి అది పవన్ ఘనత. విలన్ గా అభిమన్యు సింగ్ విగ్రహపుష్టి అనిపించాడు. నటనలో భీబత్సం, కామెడీలలో ఏది ఎన్నుకోవాలో తెలియక కొంత గజిబిజికి లోనైనట్లనిపిస్తుంది (దబంగ్ లో సోనూ సూద్ ఈ పాత్రని గొప్పగా పండించాడు). తప్పు అభిమన్యుదో, దర్శకుడిదో మరి. పాత్ర చిన్నదే ఐనా గుర్తుండిపోవడం ప్రస్తుతం రావు రమేష్ నటనలో చేరుకున్న ఎత్తుకి నిదర్శనం. పవన్ తల్లిగా సుహాసిని ఒప్పించలేదు. సవతి తండ్రిగా నాగినీడు సహజంగా అనిపించినా పాత్ర గుర్తుండదు. కోట శ్రీనివాసరావుది పాత్ర విలక్షణమే ఐనా తీర్చి దిద్దడానికి దర్శకుడు కాస్త శ్రద్ధ వహిస్తే బాగుండేది. విలన్ సహచరుడిగా రొటీన్ పాత్రకి తనికెళ్ల భరణి తనదైన మాటు వేసి కొంత ఆసక్తి కలిగించారు. హీరో సవతి తమ్ముడిగా అజయ్, ఇంకా ఇష్క్ ప్రభావంనుంచి బయటపడ లేదనిపిస్తుంది. హీరోయిన్ గా శృతిహాసన్ పల్లెపడుచు దుస్తుల్లో చాలా బాగుంది. కొన్ని చోట్ల మగాడికి ఆడవేషం వేసినట్లున్నా ఆమె గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. నటనకు అవకాశమున్న పాత్ర గ్లామర్ కే పరిమితం కావడానికి కారణం ఆమె పరిమితులో, దర్శకుడి ఆశయమో తెలియదు. హాపీడేస్ గాయత్రి చౌకబారు అభిరుచులకు అనుగుణమైన డైలాగ్సు, అభినయం, చూపులు ఉన్న పాత్రలో ప్రేక్షకులకు గుర్తుండిపోయే నటన ప్రదర్శించింది. ఆలీ, బ్రహ్మానందం లతో కామెడీ సీన్లు బాగా రాణించాయంటే అందుకు ఆయా నటుల ప్రతిభ కారణం.  

సాంకేతికపరంగా తెలుగు చిత్రాల స్థాయి మాయాబజార్ కాలంనుండే జగద్విదితం. అలా ఈ చిత్రం కనులకు పండుగే. ఇక పాటల విషయానికొస్తే దేవిశ్రీ ప్రసాద్ ఊపు అన్ని వయసుల వారినీ ఉర్రూతలూగిస్తుంది. ఇక దబంగ్ చిత్రంలో యవద్భారతంలో గొప్ప సంచలనం సృష్టించిన ‘మున్నీ బద్‍నామ్ హుయీ డార్లింగ్ తేరేలియే’ ఐటమ్ సాంగ్‍కి దీటైన వరస కట్టడం ఆయనకో పెద్ద సవాలు. అదాయన ఎంత అవలీలగా సాధించాడంటే ‘కెవ్వు కేక’ మకుటంతో ఆ పాట   తెలుగు నాట మ్రోగిపోతూ గబ్బర్ సింగ్ చిత్రవిజయానికి ఓ కారణమై మలైకా అరోరా ఖాన్‍కి కూడా తగినంత పేరు తెచ్చిపెట్టింది. సల్మాన్ ఖాన్ ఆ పాటని తన దబంగ్ 2 చిత్రం కోసం కొన్నట్లు వార్త. ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ మరో దృశ్యం అంత్యాక్షరి. మునుపంతగా ఎరుగని జూనియర్ నటుల్ని, అదీ రౌడీల గెటప్‍లో ఉంచి 12 నిముషాల సేపు ఒక పోలీసు స్టేషన్‍లో నృత్యనాటికలా ప్రదర్శించిన అంత్యాక్షరి ఓ కొత్త ప్రయోగం. థియేటర్లో చూస్తున్నప్పుడు మూడు నాలుగు నిముషాల తర్వాత విసుగనిపించిన ఈ దృశ్యం ప్రస్తుతం సృష్టిస్తున్న సంచలనం ఆశ్చర్యకరం. దర్శకుడు ప్రేక్షకుల నాడిని ఎంత బాగా తెలుసుకున్నాడా అనిపిస్తుంది. కొందరు జూనియర్ ఆర్టిస్టుల అసమాన ప్రతిభ ఈవిధంగా బయటపడడం ముదావహం.

మంచి కథ లేదు. సందేశం లేదు. సామాజిక ప్రయోజనం లేదు. ఇంకా చెప్పాలంటే కొత్తదనం కూడా లేదు. కానీ చూస్తున్నంతసేపూ ప్రేక్షకలకు పుష్కలంగా వినోదం. అటు నిర్మాతలకీ, ఇటు ప్రేక్షకులకీ ఇది ఒక గొప్ప పైసా వసూలు చిత్రం. ఐతే ఒరవడికి పనికొచ్చే అంశాలేమీ లేకపోవడంవల్ల హీరోకీ, నిర్మాతకీ, దర్శకుడికీ ఈ చిత్రం ఏమాత్రం మార్గదర్శకం కాలేదు. ఖుషీ తర్వాత పవన్ కీ, పోకిరి తర్వాత పూరీకీ ఇలాంటి ఇబ్బందే వచ్చింది. హీరో అభిమానులకోసమే కాక, తెలుగు చిత్రరంగంమీద అభిమానంతో కూడా సినిమాలు తీసి విజయాలు సాధించిన ప్రతిభావంతులు మనకెందరో ఉన్నారు. ప్రస్తుతానికి అదృష్టవంతులుగా నిరూపించుకున్న గబ్బర్ సింగ్ బృందం మున్ముందు ప్రతిభావంతులు అని కూడా నిరూపించుకోగలరని ఆశిద్దాం. 

 

4 వ్యాఖ్యలు »

  1. bonagiri said,

    మీ సమీక్షలు బాగుంటాయి.
    కాని మీరు ఇంత ఆలస్యంగా ఎందుకు వ్రాస్తున్నారు?

    • ఒకోసారి సినిమా చూడ్డం ఆలస్యమౌతుంది. ఒకోసారి సమయం దొరక్క ఆలస్యమౌతుంది. స్పందన పలువురితో పంచుకోవాలన్న తపన మాచేత వ్రాయిస్తుంది. ఫలానా టైముకే వ్రాయాలన్న ఒత్తిడి లేదు కదా. పాత, కొత్త చిత్రాలపై సినీరంగానికి సంబంధించి పంచుకోవాల్సిన ఎన్నో విశేషాలున్నాయి. వీలునుబట్టి అక్షరజాలంలో ఉంచుతాము. మా సమీక్షలపట్ల మీ సదభిప్రాయానికి ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: