జూన్ 26, 2012

దరువు- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 11:56 ఉద. by వసుంధర

 ప్రస్తుతం మన దేశాన్నిపట్టి పీడిస్తున్న ముఖ్య సమస్య అవినీతి. ఆ మధ్య అన్నా హజారే అవినీతిపై పోరాటానికి పెద్ద ఎత్తున పిలుపునిస్తే యావద్భారతం స్పందించి ఆయన వెనుక నిల్చింది. ఐతే అవినీతిని అరికట్టాల్సిన వారే అవినీతిపరులు కావడం మన సమాజం దురదృష్టం. అన్ని పక్షాల ప్రజానాయకులూ అన్నా ఉద్యమాన్ని సమర్ధిస్తున్నట్లే కనిపిస్తూ వెన్నుపోటు కూడా పొడిచారు. ఒకపక్క చర్చల్లో జాప్యం. ఒకపక్కనుంచి అన్నా బృందంపై బురద చల్లడం. క్రమంగా ఆ ఉద్యమం నీరు కారింది. మీడియా ఐతే అన్నా హజారే అనుసరిస్తున్న పద్ధతుల్ని తప్పు పట్టే దిశకు కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశపడి స్పందించాల్సింది ప్రజలు. 

మన ప్రజలకి అన్నా హజారే అన్న కాదు. వారికి అవినీతిపరులైన నేతలు, లేదా సినీ హీరోలు వీరే అన్నలు. అందుకని కొందరు అవినీతిపై పోరాటాన్ని ప్రదర్శించడానికి వెండితెరను ఎన్నుకున్నారు. వాటిలో కాస్త తీవ్రమైనది భారతీయుడు, ఆచరణయోగ్యమైనది టాగోర్.  భారతీయుడు చిత్రం అఖండ విజయం సాధించి, కమలహాసన్ కి గొప్ప పేరు తెచ్చిపెట్టి, నేటి విశ్వరూపానికి సహకరించింది. టాగోర్ చిత్రం అఖండ విజయం సాధించి, చిరంజీవిని ప్రజారాజ్య సంస్థాపకుణ్ణి చేసి, కాంగ్రెస్ పార్టీలో చేర్చింది. హీరోల్ని అభిమానించడమే తప్ప కథకు స్పందించడం తెలియని ప్రజల రాజ్యంలో ఆ చిత్రాలు అవినీతి నిర్మూలనపై ఏ విధమైన ప్రభావమూ చూపలేకపోయాయి.

అటు అన్నా ఉద్యమాన్నీ, ఇటు అవినీతిపై సినిమాల్నీ వినోదాత్మకంగా మాత్రమే భావించే ప్రజలముందు- వినోదభరితంగానైనా అవినీతిపై విప్లవాన్ని ప్రజల మనసుల్లోకి ఎక్కించాలన్న ఆలోచనతో తయారైన చిత్రం- ఈ సంవత్సరం మే 25న విడుదలైన దరువు.

హిందువుల ఆధ్యాత్మిక చింత ఎంత పరిణతి చెందినదంటే తాము కొలిచే దేవతల్ని హాస్య శృంగారపరంగా మానవుల స్థాయికి దించడానికి ఏమాత్రం సంకోచించరు. హాస్యపరంగా యముడి పాత్ర చలనచిత్రాల్లో పూర్తిస్థాయిలో ప్రవేశించడం తెలుగునాట దేవాంతకుడు చిత్రంతో మొదలైంది. ఆ బెంగాలీ కథకు నరసరాజీయంతో మరింత తెలుగుతనాన్నాపాదించి యముడి పాత్రతో పాటు చిత్రగుప్తుడికీ విశిష్టతను కలిగించిన చిత్రం యమగోల. ఆ తర్వాత యముడు, చిత్రగుప్తుడు ఎన్నో తెలుగు హిట్ చిత్రాల్లో హాస్య, వినోద పాత్రలైనారు. మొట్టమొదటి సారిగా ఆ పాత్రల హాస్య వినోదాన్ని అవినీతిపై పోరాటానికి ఉపయోగించిన ప్రయోజనాత్మక చిత్రం- దరువు.

కథ యమలోకంలో మొదలౌతుంది. తనని ముప్పుతిప్పలు పెట్టగల తెలుగువాడంటే యముడికి భయం. అలాంటి ఓ తెలుగువాడు హీరో రవితేజ. అతడికి సిగ్గూ, ఎగ్గూ, ఉచ్ఛం, నీచం లేవు. డబ్బుకోసం ఏమైనా చేస్తాడు. కానీ అనుకోకుండా తాప్సీని చూసి ప్రేమలో పడతాడు. తాప్సీ బావ సుశాంత్ సింగ్ ఆమెను బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలనుకునే విలన్. తాప్సీ కోసం జరిగిన పోరాటంలో హీరో చచ్చిపోయి యమలోకానికి వెడతాడు. అతడి చావుకి చిత్రగుప్తుడు కావాలని చేసిన పొరపాటు కారణం. అది సవరించుకుందుకు యముడతణ్ణి అప్పుడే చనిపోయిన హోం మినిస్టర్ రవీంద్ర శరీరంలో ప్రవేశపెడతాడు. అనుబంధాలకు విలువనిస్తూ, ప్రేమించే హృదయంతో, సమాజాన్ని చూసి మానవత్వంతో స్పందించగలిగితే- మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఏమేం చెయ్యొచ్చో- అటు ప్రజలూ, ఇటు నాయకులూ కూడా తెలుసుకునేలా మిగతా చిత్రం రూపొందింది.

యమలోకాన్నీ, భూలోకాన్నీ ఇంత సమర్థవంతంగా, అర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా సమన్వయించిన సినీకథ తెలుగులో ఇంతవరకూ లేదనే చెప్పాలి. అందుకు దర్శకుడు శివనీ, రచయిత ఆదినారాయణనీ ప్రత్యేకంగా అభినందించాలి. ఆ కథను అంత గొప్పగానూ తెరకెక్కించిన శివ అభినందనీయుడు. చెప్పాలంటే ఇది పూర్తిగా శివ సినిమా. ఆతర్వాత ఈ చిత్రం పూర్తిగా రవితేజది.

హీరోగా రవితేజ నటన, పలుకుతీరు మిగతా నటులకు భిన్నం. ప్రతి సినిమాలో ఒకే విధంగా ఉండడంవల్ల ఆ విభిన్నత అప్పుడప్పుడు విసుగు కలిగిస్తుంది కూడా. ఈ చిత్రంలో బుల్లెట్ రాజా పాత్రకు ఆ నటన అతికినట్లు సరిపోయింది. బుల్లెట్ రాజా వెకిలితనం హోం మినిస్టర్ కీ విస్తరించడం ఎబ్బెట్టుగా అనిపించినా- అది సహజమేనని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రేమ సన్నివేశాల్లో హీరో కాస్త హుందాగా ఉంటే బాగుండేది. బుల్లెట్ రాజాయే రవీంద్ర శరీరంలో ప్రవేశించినప్పటికీ నటనలో మానసిక సంఘర్షణనైనా సరిగ్గా చూపకపోవడంవల్ల- రవితేజ ఒక్కలా మాత్రమే నటించగలడేమో అన్న అనుమానం కలుగుతుంది. ఐతే రవితేజ విభిన్నపాత్రలలో రాణించగలడనడానికి ఈ చిత్రంలో ఒక సందర్భం ఉంది. యముడు రవితేజని తిరిగి బ్రతికించడానికి అతడి రూపంలోనే ఉన్న కొంతమందిని ఎన్నుకుంటాడు. అప్పుడు రవితేజ వారి పాత్రల్లో- హద్ కర్ దీ ఆప్ నే చిత్రంలో గోవిందాకు- ఇంచుమించుగా దీటు వచ్చాడు. దర్శకుడు అతడికీ పాత్రల్లో మరికాస్త అవకాశం ఇచ్చి ఉండాల్సింది. హీరోయిన్‍గా తాప్సీ అందంగా ఉంది. అందాల్నిఆరబోసింది. ఆమె నవ్వు బాగుంటుందని పత్రికలు తెగ వ్రాస్తున్నాయనేమో- చిత్రం పొడుగునా అవసరమున్నా లేకపోయినా (ఒకోసారి ఎబ్బెట్టుగా అనిపించేలా కూడా) అదేపనిగా నవ్వులు చిందించింది. అవకాశం ఉన్నంతలో నవ్వులమీద దృష్టిని నటనమీద సారించి ఉంటే బాగుండేది. విలన్లుగా శాయాజీ షిందే ముద్దు మాటలతో ముద్దుగా ఉన్నాడు. సుశాంత్ సింగ్ నటించడానికి బదులు పాత్రలో జీవించే ప్రయత్నం చేయాల్సింది. పవిత్రానందస్వామిగా రఘుబాబు ఆ పాత్రకే వన్నె తెచ్చాడు. హాస్యనటులకు మించి కడుపుబ్బ నవ్వించాడు. హాస్యపాత్రల్లో బ్రహ్మానందం డాన్స్ మాస్టర్ విద్యా బాలన్‍గా తనదైన బాణీలో నటించాడు. ఫైటింగ్ సీన్సులో హీరోలకి డూప్‍ని పెట్టినట్లు- బ్రహ్మానందానికి డాన్స్ సీన్సులో డూప్ కాళ్లని వాడేరా అనిపిస్తుంది. అదే నిజమైతే- అంత అనుభవమున్ననటుడికి అది మచ్చే ఔతుంది. పాత యముడిగా సత్యనారాయణలో ప్రస్పుటమైన వృద్ధాప్య లక్షణాలు సహజంగా అతికాయి. కొత్త యముడిగా ప్రభు విగ్రహపుష్టి అనవచ్చు. ఎమ్మెస్ నారాయణలో ఎమ్మెస్సే తప్ప చిత్రగుప్తుడు కనపడడు. పలుకు తీరుని పాత్రకి అనుగుణంగా మార్చగలగడం కూడా నటనలో భాగమని ఈ నటుడు గుర్తించాలి. హీరో తల్లిగా జయసుధ ఆ పాత్రకి హుందాతనాన్నిఇవ్వడమేకాక- రవితేజనుంచీ కొంత నటనని రాబట్టడం గమనార్హం. 

సాంకేతికపరంగా ఉన్నత ప్రమాణాలు తెలుగు చిత్రాలకి మామూలే కదా. ఈ చిత్రమూ మినహాయింపు కాదు. పాటల్లో ఊపు, జోరు ఎక్కువ. సినిమా చూసి మర్చిపోవచ్చు. డాన్సుల్లో రవితేజని (అభిమానులు మన్నించాలి) భరించడం కాస్త కష్టమే. దింకుచకా పాటలో రఘుబాబు హావభావాలు చాలాకాలం గుర్తుండిపోతాయి.

మంచి కథ.  గొప్ప సందేశం. సామాజిక ప్రయోజనం ఎంతోకొంత. పుష్కలంగా వినోదం. పాతతరం నటీనటులకోసం తయారైన స్క్రీన్‍ప్లేని కొత్తతరం నటీనటులతో ఈ తరం దర్శకుడు తీసిన చిత్రమిది. తారలు పాతతరంవారంత న్యాయం చేకూర్చకపోయినా దర్సకుడు పాతతరంవారిని మించిన ప్రతిభను చూపడం విశేషం. హీరోగా రవితేజకి రోజులు దగ్గిర పడుతున్నాయనిపించినా- ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడమేకాక వారిని ప్రభావితం కూడా చెయ్యాలని ఆశ!

1 వ్యాఖ్య »

  1. venkat said,

    ఈ సినిమా ని చూసాను, కథ బాగానే ఉంది కాని, సినిమా చూడలేం. అందరు ఓవర ఆక్షన్ చేసే వాళ్ళే. బ్రహ్మనందం కామెడీ చాల అతి, రవితేజ ఇంకా అతి , అదేంటో రవితేజ ఎంత పిచ్చి అతి చేస్తే అంత హిట్ అవుతుందని అనుకుంటున్నారు దర్శకులు.
    నవ్వు రాని కామెడీ. కాని ఈ సినిమా రిలీజ్ అయి చాల రోజులు అయినట్టుంది ఇప్పుడు సమీక్షిస్తున్నరెంటి ? ఆల్రెడీ cinema కి ఫ్లాప్ టాక్ కూడా వచ్చింది.


Leave a Reply

%d bloggers like this: