జూన్ 28, 2012

అఖండ జ్యోతి

Posted in సాహితీ సమాచారం at 5:30 సా. by వసుంధర

శ్రీ ముళ్లపూడి వెంకటరమణ తెలుగులో ఆధునికతకు భాషనిచ్చాడు. పత్రికలకు జ్యోతినిచ్చాడు. చలనచిత్రాలకు సాక్షి అయ్యాడు. ఆయనవల్ల సీతాకల్యాణ వైభవం లండన్‍కి పాకుతుంది. రామాయణం ముత్యాలముగ్గుగా రూపు దిద్దుకుంటుంది. ఆడది మిస్టర్ పెళ్లాం ఔతుంది. మిస్సమ్మ తిరగబడి పెళ్లిపుస్తకమౌతుంది. రామాయణాన్ని ఆరాధించే ఆయన జీవిత చరిత్ర కోతికొమ్మచ్చి ఔతుంది. 

చిన్నతనంలోనే బాపుని పోగొట్టుకున్న ఆయనకి చిన్నప్పట్నించీ బాపు సహచరుడు కావడం విశేషం. ఒకరిది రాత. మరొకరిది గీత. ఆ రాత, గీతలది అవినాభావసంబంధం. వాటినే తమ నుదుటి రాతగా, జీవనగీతగా మార్చుకున్న వైనం పరమాద్భుతం. బాపు-రమణ అంటే ఏకవచనం అంటుంది తెలుగు వ్యాకరణం. ఐనా వారిని బహువచనంతో సంబోధించే వారే ఎక్కువ. ఆర్యులపట్ల ఆ ప్రయోగం గ్రాహ్యమే కదా! మాకైతే వారిరువురూ సాహితీపరంగా ఆరాధ్య దైవాలు.

పిల్లలకి బుడుగు. ప్రేమకు ఏకలవ్యుడు. ఆకలికి ఆనందరావు. మధ్యతరగతికి ప్రయోజకుడు. ధనికులకు అప్పారావు. సినిమాలకు విక్రమార్క సింహాసనం. రాజకీయాలకు బేతాళపంచవింశతిక. అన్ని రచనల్లోనూ చెప్పలేనంత హడావుడి. సభికుడైనా, సభాధ్యక్షుడైనా- మాట రాని మౌనం. మహాత్ములకే సాధ్యమైన వినయం. అందుకేనేమో ఎన్ని అర్హతలున్నా ఆయనకు జ్ఞానపీఠాలు, పద్మభూషణాలు దక్కవు. పాపం- అవి అలా చిన్నబోతే- ఆ తప్పు మాత్రం వారిది కాదు. 

శ్రీ రమణ పుట్టినరోజు ఈ రోజు కావడం జ్యోతిష శాస్త్రంపట్ల నమ్మకాన్ని కలిగించొచ్చు. ఎందుకంటే శ్రీ పివి నరసింహారావు జన్మదినం కూడా ఈ రోజే! శ్రీ పివి కూడా దేశంలో నేతగా వంద కోట్లకొక్కడు అనిపించుకున్నా- నేతల్లో ఆయన్ను స్మరించుకోవాలన్న ధ్యాసే కనపడదు.

సీతను రాముణ్ణించి వేరు చేసిన శ్రీరామరాజ్యంతో ఆయన బాపునుంచి వేరుపడి వెళ్లిపోయారు. ఇంతకాలం రమణ-బాపు ఒక్కరు.  ఇప్పుడు బాపు ఇద్దరు. ఆ ఇద్దరిలో రమణకి ఈ రోజు 81వ జన్మదినం.

వారికి అక్షరజాలం శుభాకాంక్షలు.

 

5 వ్యాఖ్యలు »

  1. ఆహ అలాగా మంచిదే!


Leave a Reply to Alapati Ramesh Babu Cancel reply

%d bloggers like this: