Site icon వసుంధర అక్షరజాలం

ఒక రొమాంటిక్ క్రైమ్ కథ – చిత్రసమీక్ష

2012 జూన్ 15న విడుదలైన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రం విశిష్టమైనది.

లేత ప్రాయంలో ముగ్గురమ్మాయిలు. ముగ్గురికీ మంచి స్నేహం.

ఇంజనీరింగు చదువుతున్న వీణ కిరణ్ అనే యువకుడి వలలో పడి మోసపోయి బ్లాక్‍మెయిలింగ్‍కి గురై తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

ఇంటర్ చదివే తన్మయి వయసు పోరు తట్టుకోలేక విచ్చలవిడిగా తిరిగి పలుమార్లు గర్భస్రావం చేయించుకుంది. చివరికి తలిదండ్రులామెను చదువు మాన్పించి పెళ్లి కుదిర్చి ఇంటికి తీసుకెడతారు.

టెన్తు చదివే తన్మయి మధ్యతరగతి అమ్మాయి. కూతురి భవిష్యత్తుకి భర్త సంపాదన చాలదని ఆమె తల్లి శీలాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదిస్తూంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకోసం ఏమైనా చెయ్యగలనంటూ వెంటపడ్డ సంజయ్‍ని ప్రేమిస్తుంది. ఆమెకోసం చిల్లర దొంగతనాలు మొదలెట్టిన సంజయ్ క్రమంగా హత్యలకు పాల్పడతాడు. మొదట నిరసన. తర్వాత సంకోచం. ఆ తర్వాత తనే అతణ్ణి దొంగతనాలకూ, హత్యలకూ ప్రోత్సహించి సహకరిస్తుంది.

ఏ నేరమైనా ఎంతో కాలం దాగదు. సంజయ్, తన్మయిలు పోలీసుల ఎన్‍కౌంటర్లో మరణించడం కథకి ముగింపు. ఇందులో బిడ్డలపట్ల తలిదండ్రుల నిర్లక్ష్యముంది. తప్పు దారిలో పడుతున్న యువతరముంది. వారినందుకు ప్రోత్సహిస్తున్న వాతావరణముంది. ఇది కథ కాదు. ఇప్పుడు మన కళ్లముందు జరుగుతున్న వాస్తవం.

ఇందులో అక్రమ సంబంధాలు, బైక్ రేసులు, రహస్యంగా నీలిచిత్రాలు తీసి బ్లాక్‍మెయిల్ చెయ్యడం, చెయిన్ స్నాచింగు, మత్తు పదార్థాలు – ఇవన్నీనేడు జరుగుతున్నవే.

ఈ చిత్రంలో టీనేజి అమ్మాయిలు కాస్త పచ్చిగానే మాట్లాడతారు. కానీ ఆ మాటలు కమర్షియల్ సినిమాల్లో హీరో హీరోయిన్ల వ్యవహారంకంటే సభ్యం. ఆపైన వాస్తవం. ఈ చిత్రంలో యువతీయువకులు మనుషుల్ని దారుణంగా తలలు బద్దలుకొట్టి హత్యలు చేస్తారు. అవి మనం డెయిలీ సీరియల్స్‍లో చూసేవాటికంటే సహజమూ, వాస్తవమూ. ఇక పత్రికల్లో వచ్చే శృంగార సమస్యల వివరాలతో పోలిస్తే- సభ్యతలో వీటికి వీరతాడు వేసి తీరాలి కూడా.

ఈ చిత్రంలో నటీనటులు తమతమ పాత్రల్లో జీవించారు. ఇందులో సంభాషణలు వ్రాసినట్లుండవు. పాత్రలు మాట్లాదుతున్నట్లే అనిపిస్తుంది.

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఈ కథని ఎటువంటి హంగులూ, అర్భాటాలూ లేకుండా సూటిగా హృదయానికి హత్తుకునేలా అద్భుతంగా చెప్పాడు.  ప్రతి పాత్రలోని క్లిష్టతనూ అర్థం చేసుకుని అపురూపంగా చిత్రించాడు.

సంజయ్ హంతకుడని తన్మయికి మొదటిసారి తెలిసినప్పుడు ఆమె భయంతో వణికిపోతుంది. ఆమె ఎక్కడ తనని అసహ్యించుకుంతుందోనని భయపడుతూనే సంజయ్ శవంమీది నగలు ఒలుస్తూ– తానేంచేసినా ఆమె కోసమేనని ఘోషిస్తాడు. అప్పుడామె ఇంకా వణికిపోతూనే, శవానికింకా చెవి రింగులు ఉండిపోయాయని చెప్పడంతో ఆ దృశ్యం కట్. ఏ ఆంగ్ల చిత్రానికీ కాపీ కాకపోతే మనస్తత్వ ప్రదర్సనలో దర్శకుడు చేరుకున్న ఎత్తుకి అభివందనాలు.

అధికసంఖ్యలో ఆడపిల్లలు ఇంజనీర్లు, డాక్తర్లు అవుతున్నారని మురిసిపోతున్నాం. మరి వారికి మనం కనీస సదుపాయాలైనా అందించగల్గుతున్నామా? ఈ చిత్రంలో ఒక దృశ్యంలో రోడ్డు పక్కన లఘుశంక తీర్చుకుంటున్న అబ్బాయిల్ని చూస్తూ అంజలి, ‘మనకి అలా కుదరదు. మరుగు దొరక్క మనం కడుపునిండా మంఇనీళ్లు తాగి ఎన్నాళ్లయిందే” అని వాపోతుంది. అది విన్నప్పుడు అక్కలూ, చిట్టిచెల్లెళ్లూ గుర్తుకొచ్చి మనసేదోలా ఐపోతుంది. ఇదీ కనీసావసరాలపట్ల మన దృక్పథం.

ఈ చిత్రంలో తప్పు దారిన నడిచేవారెవ్వరూ తప్పు చేస్తున్నామనుకోరు. చివరికి హత్యలు చేసే సంజయ్ కూడా, ‘ఒక దేశం తన సంతోషంకోసం వేల మందిని చంపితే అది యుద్ధం ఆని సమర్ధిస్తారు. ఒక నాయకుడు తన సంతోషం కోసం ఎంత అవినీతికి పాల్పడినా, ఎన్ని హత్యలు చేసినా- అతడు జైలునుంచి బెయిలుమీద తిరిగొస్తే జనం బ్రహ్మరథం పట్టి పండుగ చేసుకుంటారు. మన సంతోషంకోసం మనం పదిమందిని చంపితే తప్పేమిటి?” అంటాడు. ఈ సందేశాన్ని యువతకి అందిస్తున్నవారెవరు?

ఈ చిత్రంలో వీణ ఆత్మహత్య మనసుల్ని కుదిపేస్తుంది. అంజలి అబార్షన్ ఏవగింపు కలిగిస్తాయి. తన్మయి ఆలోచనలు సమాజాన్ని సవాలు చేస్తాయి. కిరణ్ బ్లాక్ మెయిలింగ్ కలవరం కలిగిస్తుంది. సంజయ్ హత్యలకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  

వినడానికీ, చూడ్డానికీ కూడా ఈ చిత్రంలో పాటలు అనవసరం అనిపించింది. కథనంలో అపరిపక్వత ఉన్నట్లు కొందరు భావించారు. మాకు మాత్రం చిత్రం అదినుంచి చివరిదాకా ఉత్కంఠభరితంగా, అర్థవంతంగా హాలీవుడ్ స్థాయిలో (సాంకేతిక పరంగా కాకపోవచ్చు) అనిపించింది.

ఇలాంటి చిత్రాలు మన ప్రేక్షకులకు కొత్త. వీటిని అర్థం చేసుకుని ఆదరించే పరిణతి మనకి కావాలి. ఐతే ఈ చిత్రాన్ని మనం పిల్లలతో కలిసి చూడగలమా? మన పిల్లల్ని పబ్బులకీ, బార్లకీ పంపడం ఆధునికత అనుకునేవారు తప్పక చూడగలరు మరి!

పెద్దలకు పాఠం. పిన్నలకు గుణపాఠం. నేతలకు చెంపపెట్టు. సమాజానికి సవాలు. ఇది ఆలొచింపజేసే గొప్ప చిత్రం. ఐతే ఇలాంటి చిత్రాలు తియ్యడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యానికి దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డికి అభివందనాలు.

Exit mobile version