జూలై 19, 2012

ఆకాశంలో ఒక తార

Posted in శాస్త్రీయం at 10:23 ఉద. by వసుంధర

మాకు తెలిసి రాజేష్ ఖన్నా తొలి చిత్రం 1967లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ రాజ్. ఆ చిత్రంలో రఫీ, లతా విడివిడిగా పాడిన అకేలేహై పాట ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతూంటుంది. అంతకుముందు 1966లో వచ్చిన ‘ఆఖ్రీ ఖత్ ‘ చూసినప్పటికీ, ఆ చిత్రంలో రాజేష్ ఖన్నా ఉన్నట్లు తెలియదు. దానికి చేతన్ ఆనంద్ చిత్రంగానే గుర్తింపు వచ్చింది. మాకు రాజ్ అనగానే రాజేష్ ఖన్నా గుర్తొస్తాడు- తర్వాత అదే పేరుతో ఇటీవల కొన్ని సినిమాలొచ్చినా కూడా.

రాజేష్ ఖన్నా నటనలో దేవానంద్‍ని పూర్తిగా అనుకరించేవాడు. రూపురేఖల్లో ఇద్దరికీ ఎక్కడా సామ్యం లేకపోవడంవల్ల అది అంతగా స్పష్టం కాదు. దిలీప్‍కుమార్‍ని అనుకరించే అమితాబ్ విషయంలోనూ ఇదే జరిగింది.

ఖన్నాది విలక్షణ రూపం. చక్కని గొంతు. నటనలో అంతంతమాత్రమైనా క్రమంగా అతడికి అవకాశాలు బాగా వచ్చాయి. ఐతే ఆనంద్ చిత్రం అతడికి నటుడిగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో ఆ పాత్రలో ఖన్నాని తప్ప వేరొకర్ని ఊహించుకోలేం. బాబూ ముషాయ్‍గా అమితాబ్‍కీ ఆ చిత్రంలో చాలా పేరొచ్చింది. కానీ బాబూ ముషాయ్ అన్న మాట రాజేష్ ఖన్నా నోట పలకడంవల్లనే ఆ పేరొచ్చిందంటే అతిశయోక్తి కాదు. హృషీకేశ్ ముఖర్జీ తీసిన చిత్రాల్లో దర్సకుడికంటే ఎక్కువగా నటులు గుర్తుండిపోయే తక్కువ సినిమాల్లో ఆనంద్ (రాజేష్ ఖన్నా), ఖూబ్‍సూరత్ (రేఖ) ఉన్నాయి.

రాజేష్ ఖన్నాకి సినీరంగంలో మొదటి సూపర్ స్టార్ హోదా ఇచ్చింది ఆరాధన చిత్రం. ఇందులో మేరే సప్నోంకా రాణీ పాటలో షర్మీలా నటన అపూర్వం. అమెకు ప్రియుడిగా, కొడుకుగా ద్విపాత్రాభినయం చేసి ఆ వైవిధ్యానికి అందరిచేతా సెబాస్ అనిపించుకున్నాడు రాజేష్ ఖన్నా.

రాజేష్ ఖన్నాకి మరో మలుపు నమక్ హరామ్ చిత్రం. అది ముందు తెలుగులో పద్మశ్రీ వారు ప్రాణమిత్రులు పేరిట తీశారు. నాగేశ్వరరావు, జగ్గయ్య, సావిత్రి ముఖ్య పాత్రలు ధరించారు. పి. పుల్లయ్య దర్శకత్వం వహించారు. అప్పట్లో కథ అత్యద్భుతం అనిపించింది. కానీ తెలుగు ప్రేక్షకులకు అది నచ్చలేదు. ఐనా ఆ కథలోని గొప్పతనాన్ని గ్రహించి హిందీలో పునర్నిర్మించడం, అది పెద్ద హిట్ కావడం విశేషం. ఈ చిత్రంలో రాజేష్ ఖన్నా గొప్పగా నటించినా అమితాబ్‍కి ఎక్కువ పేరొచ్చింది.

రాజేష్ ఖన్నా అంటే యువతలో పిచ్చి ఎంతలా ముదిరిందంటే కొందరు అమ్మాయిలు అతడి ఫొటోల్ని పెళ్లి చేసుకున్నారు. అభిమానులు, అనుయాయులు అతడిలో అహాన్ని పెంచారు. ఆ అహం అతణ్ణి పరిశ్రమతోపాటు ఎందరికో దూరం చేసింది. ఒకప్పుడెంతో వెలిగినా, కొంతకాలం అనామకుడిగానే మిగిలిపోయాడు. మరణం ఇప్పుడతణ్ణి జనంలో పునర్జీవుణ్ణి చేసింది.

ఆకాశంలో మెరిసే తారలు నేలమీద పడినట్లే, నేలపై తారలు ఆకాశంలోకీ వెళ్లొచ్చు. అలా జూలై  18, 2012 నుంచి రాజేష్ ఖన్నా ఆకాశంలో ఒక తార. అతడికి అక్షరజాలం నివాళి. మరిన్ని వివరాలతో ఆ తారకు శ్రీ టీవీఎస్ శాస్త్రి అర్పిస్తున్న నివాళికై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

1 వ్యాఖ్య »

  1. CS Sarma, Vijayawada said,

    It is a big tragedy in Rajesh Khanna Life, yet he has never shown his sorrows or shared with anybody. Poor Rajesh Khanna, I pity him with deep sorrow. May his soul, rest in peace – CS Sarma.


Leave a Reply

%d bloggers like this: